తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 140

వికీసోర్స్ నుండి

రేకు: 0140-01 శంకరాభరణం సం: 02-172 అధ్యాత్మ

పల్లవి: ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
మోహములే చిగిరించీ మొదల జవ్వనము

చ. 1: యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను
అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము

చ. 2: దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు
ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము

చ. 3: యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నిదానము నీభక్తి
యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము

రేకు: 0140-02 ముఖారి సం: 02-173 వేంకటగానం

పల్లవి: ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను
వారివారి పాలికి వరదుఁడవౌదువు

చ. 1: చేరికొల్చినవారికిఁ జేపట్టుఁ గుంచమవు
కోరి నుతించినవారికి కొంగుపైఁడివి
మేరతోఁ దలఁచువారి మేటినిధానమవు
సారపు వివేకులకు సచ్చిదానందుఁడవు

చ. 2: కావలెననేవారికి కామధేనువవు మరి
సేవసేసేవారికి చింతామణివి
నీవే గతెన్నవారికి నిఖిల రక్షకుఁడవు
వావిరి శరణువేఁడేవారి భాగ్యరాశివి

చ. 3: నిన్నుఁ బూజించేవారి నిజపరతత్త్వమవు
ఇన్నిటా నీదాసులకు నేలికెవు
యెన్నఁగ శ్రీవేంకటేశ యిహపరములకును
పన్ని కాచుకున్నవారి ఫలదాయకుఁడవు

రేకు: 0140-03 వరాళి సం: 02-174 అధ్యాత్మ

పల్లవి: ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
మతి వారూఁ దమవంటి మనుజులే కాక

చ. 1: చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక
సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు
బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక

చ. 2: తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
గుడికొన్న తనలోని గుణాలే కాక
కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు
నడచేటి తనవర్తనములే కాక

చ. 3: ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక
తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు
కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక

రేకు: 0140-04 దేసాళం సం: 02-175 అధ్యాత్మ

పల్లవి: అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో
చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా

చ. 1: నేనే మంచివాఁడనై తే నిండుకోదా జ్ఞానము
కానీలే యింకా నేమేమి గడమో కాక
ఆనుక సుకృతినైతే నలవడదా విర క్తి
కానరాని తప్పు లెన్నిగలవో కాక

చ. 2: నామనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా
చేముంచి నేరమేమి సేసితినో కాక
ఆముక మోక్షాధికారినైతే నెదురుగా రాదా
కామితార్థాలు భోగించఁ గలుగఁబోలుఁ గాక

చ. 3: ఔలే నామేను పవిత్రమైతే సేవ గొనవా
యేలాగున్నదో నీచిత్త మెఱఁగఁ గాక
యీలీల శ్రీవేంకటేశ యెదుటనే వున్నాఁడవు
యేలుకొని చేపట్టి యీడేర్చవు గాక

రేకు: 0140-05 శ్రీరాగం సం: 02-176 వైరాగ్య చింత

పల్లవి: చొచ్చితి నీకు శరణు సుద్దు లిఁకనేఁటికి
కచ్చుపెట్టెవ్వరివల్లాఁ గలిగేదేమీ

చ. 1: పుట్టుక మునుపెఱఁగ పుట్టుగు మీఁదెఱఁగను
యిట్టె యప్పటి యెఱుక యేడ కెక్కీని
పట్టె మదనుభూతము పరసిపోయను బుద్ధి
వట్టి పెద్దతనాలను వచ్చేదేమీ

చ. 2: రానివి రప్పించఁగ నేరను వచ్చే వాఁప నేర
తానకపు నాస్వతంత్ర మెందాఁకా వచ్చును
అనుకున్నది ముదిమి అట్టె జారె శాంతము
నే నెంత విఱ్ఱవీఁగినా నిండేదేమీ

చ. 3: యిప్పుడు నే నెవ్వఁడనో యెక్కడ నీ వున్నాఁడవో
కప్పిన నావుపాయాలే కార్యమిచ్చీని
నెప్పున శ్రీవేంకటేశ నీయెదుటఁబడ్డ పని
తప్పక యీడేర్తు గాక తలపోసేదేమీ

రేకు: 0140-06 కన్నడగౌళ సం: 02-177 శరణాగతి

పల్లవి: చేసిన నావిన్నపము చిత్తానఁ బెట్టుకొమ్మీ
వేసరించి యిప్పుడే నే వేఁడుకొంటిఁ జుమ్మీ

చ. 1: ముందె నాపుణ్యఫలములు నీ కిచ్చితినంటి
కందువఁ గోరనని సంకల్పించితిని
యిందు మఱచి తప్పినా యిన్ని నీకె సెలవు
నిందవేసి నన్ను నిఁక నేరము లెంచకుమీ

చ. 2: నిన్నేకాని యితరుల నేఁ గొలువనొల్ల నంటి
వున్నతిఁ బరద్రవ్యా లొల్లనంటి
అన్నిటా నేనే మఱి యప్పటిమాటే యంచు
సన్నల నన్నందుకు నొచ్చమని దూరకుమీ

చ. 3: నానా వుపాయాల నాఁడే శరణంటి
పూని నీసాకారమునేఁ బొడగంటిని
నేను మత్తుఁడనై వున్నా నీవే తలఁచి తెలుపుకో
కోనేటి శ్రీవేంకటేశ కొసరించుకోకుమీ