Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 136

వికీసోర్స్ నుండి

రేకు: 0136-01 ధన్నాసి సం: 02-148 గురు వందన, నృసింహ

పల్లవి: జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము
నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు

చ. 1: అలరి దేహమనేటి యాగశాలలోన
బలువై యజ్ఞానపు పశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు

చ. 2: మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కఁగా సంకీర్తనసామగానము చేసి
యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు

చ. 3: తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి
కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె
యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు

రేకు: 0136-02 శ్రీరాగం సం: 02-149 వేంకటగానం

పల్లవి: లావణ్యశృంగారరాయ లక్ష్మీనాథ
యేవేళ నీవినోదాన కేదాయ నేమి

చ. 1: పాలజలధివంటిది పవ్వళించు నామనసు
గాలివూర్పులే కడళ్లు కలదు లోఁతు
చాలఁగ దొల్లి నీవు సముద్రశాయివట
యీలీల నీవినోదాన కేదాయ నేమి

చ. 2: నిక్కపుభూమివంటిది నెలవుకో నామనసు
పెక్కులిన్నియుఁ గలవు పెరుగుచుండు
పుక్కటఁ దొల్లియు నీవు భూసతిమగఁడవట
యెక్కువ నీవినోదాన కేదాయ నేమి

చ. 3: నిండుఁగొండవంటి దిదె నిలుచుండు నాభక్తి
వుండుచోటనేవుండు నొక్కచోటను
కొండలరాయఁడవట కోరికె శ్రీవేంకటేశ
అండ నీవినోదాన కేదియాయ నేమి

రేకు: 0136-03 రామక్రియ సం: 02-150 వైరాగ్య చింత

పల్లవి: మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన
అచ్చపు నీసూత్రధారి నవధారు దేవ

చ. 1: వొక్కఁడ నే జీవుఁడను వోహో హరీ
పెక్కు బహురూపాలే పెంచి యాడితి
తక్కిన యింద్రియములే తగుమేళము
అక్కజపు విద్యవాఁడ నవధారు దేవ

చ. 2: సూటి నించుకంతవాఁడఁ జూడవే హరీ
వీటి సంసారపుబారి విద్య లాడితి
పాటి నాకర్మమే క్రియాభాషాంగము
ఆటవాఁడ నింతే నేను అవధారు దేవ

చ. 3: చేరి చిత్తగించుమీ శ్రీవేంకటేశ నేఁడు
మేరతో భక్తెనే మోకుమీఁద నాడేను
యీరానిపదవులు యిచ్చితి నాకు
ఆరితేరి గెలిచితి నవధారు దేవ

రేకు: 0136-04 శ్రీరాగం సం: 02-151 అన్నమయ్య స్తుతి

పల్లవి: దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే

చ. 1: అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘన నారదాది భాగవతులతో
దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

చ. 2: వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడనున్న శ్రీవేంకటేశుఁ గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

చ. 3: సంకీర్తనముతోడ సనకాదులెల్లఁ బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమినుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు-
నంకెల మాయింటి విందు లారగించవే

రేకు: 0136-05 మాళవి సం: 02-152 వైరాగ్య చింత

పల్లవి: గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ
విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు

చ. 1: సరి పిఱుఁదే రెండు జంటబండికండ్లు
సరవితోఁ బాదాలు చాఁపునొగలు
గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు
దొరయై దేహరథము దోలీఁబో జీవుఁడు

చ. 2: పంచమహాభూతములు పంచవన్నెకోకలు
పంచల చేతులు రెండు బలుటెక్కెలు
మించైన శిరసే మీదనున్న శిఖరము
పంచేంద్రియరథము పఱపీఁబో జీవుఁడు

చ. 3: పాపపుణ్యములు రెండు పక్కనున్నచీలలు
తోపుల యన్నపానాలు దొబ్బుఁదెడ్లు
యేపున శ్రీవేంకటేశుఁ డెక్కి వీథుల నేఁగఁగ
కాపాడి నరరథము గడపీఁబో జీవుఁడు

రేకు: 0136-06 సాళంగం సం: 02-153 అంత్యప్రాస

పల్లవి: ఉన్న మంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే
విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము

చ. 1: పరగఁ బుచ్చకాయలఁ బరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరువిన్నా వాఁడిచెడని మంత్రము
అరయ నిదొక్కటేపో హరినామమంత్రము

చ. 2: యేజాతినోరికైన నెంగిలిలేని మంత్రము
వోజదప్పితేఁ జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తేఁ దీరిపోని మంత్రము
సాజమైన దిదేపో సత్యమైన మంత్రము

చ. 3: యిహముఁ బరముఁ దానే యియ్యఁజాలిన మంత్రము
సహజమై వేదాలసార మంత్రము
బహునారదాదులెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీవేంకటేశు మంత్రము