తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 135
రేకు: 0135-01 శ్రీరాగం సం: 02-142 వేంకటగానం
పల్లవి: బిరుదులన్నియు నీవే బిరుదు లోకములెల్ల
అరయ నీపాదమందె అణఁగుండెఁ గాన
చ. 1: బహుదేవతాసార్వభౌమ బిరుదు నీకే
సహజము నీవు భూసతిపతివి గాన
వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే
విహితము చక్రము చే వెలసేవు గాన
చ. 2: పెను దేవశిఖామణి బిరుదు నీకే చెల్లు
ఘన కౌస్తుభమణి గలవాఁడవు గాన
మును దేవదేవోత్తముఁడను బిరుదు నీకే
ననిచెఁ బురుషోత్తమనాముఁడవు గాన
చ. 3: వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదే
కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన
తిట్టమై శ్రీవేంకటేశదేవ సింహమవు నీవే
అట్టె నారసింహుఁడవై అమరితి గాన
రేకు: 0135-02 లలిత సం: 02-143 దశావతారములు
పల్లవి: ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు
దిందువడె సిరులతో తెప్పతిరుణాళ్ళు
చ. 1: పాలజలనిధిలోఁ బవ్వళించ పాముతెప్పఁ
దేలుచున్న దది దెప్పదిరుణాళ్ళు
వోలి నేకోదకమై వొక్క మఱ్ఱియాకుమీఁద
తేలుచున్నదది తెప్పతిరుణాళ్ళు
చ. 2: అమృతము దచ్చునాఁడు అంబుధిలో మంధరము
తెమలఁ దేలించు తెప్పతిరుణాళ్ళు
యమునలో కాళింగునంగపుపడిగెమీఁద
తిమిరి తొక్కిన తెప్పతిరుణాళ్ళు
చ. 3: అప్పుడు పదారువేలు అంగనల చెమటల-
తెప్పలఁ దేలిన తెప్పతిరుణాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతిఁ గోనేటిలోన
తెప్పిరిల్లె నేఁట నేఁట తెప్పతిరుణాళ్ళు
రేకు: 0135-03 లలిత సం: 02-144 భక్తి
పల్లవి: తలగరో లోకులు తడవకరో మమ్ము
కలిగినదిది మా కాఁపురము
చ. 1: నరహరికీర్తన నానిన జిహ్వ
వొరుల నుతింపఁగ నోపదు జిహ్వ
మురహరు పదములు మొక్కిన శిరము
పరుల వందనకుఁ బరగదు శిరము
చ. 2: శ్రీపతినే పూజించిన కరములు
చోఁపి యాచనకుఁ జొరవు కరములు
యేపున హరికడ కేఁగిన కాళ్ళు
పాపుల యిండ్లకుఁ బారవు కాళ్ళు
చ. 3: శ్రీవేంకటపతిఁ జింతించు మనసు
దావతి నితరముఁ దలఁచదు మనసు
దేవుఁడతని యాధీనపు తనువు
తేవల నితరాధీనము గాదు
రేకు: 0135-04 రామక్రియ సం: 02-145 వైరాగ్య చింత
పల్లవి: ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు
కాలముతో నిలిచేను కైవల్యపదవి
చ. 1: పాపములు హరినామపఠనచేఁ బాపుకొంటి
కైపుగఁ జిత్రగుప్తుఁ డాకవిలె గట్టు
కోపులఁ బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి
పూఁపల స్వర్గము త్రోవ భుజవేయరో
చ. 2: అతుమలో నజ్ఞాన మాచార్యుఁడే పాపె
ఆతల జన్మాల వాకిలటు ముయ్యరో
చేత హరిదాస్యమున జీవన్ముక్తుఁడనైతి
జాతి యధర్మములాల సంబంధము విడరో
చ. 3: పరమాత్ము చింతచేత బదుకు నిశ్చయమాయ
ధరఁ గైవసము గావో తగుచిత్తమా
యిరవైన శ్రీవేంకటేశుఁ డేలుకొనె మమ్ము
పరదేవతలు మాకుఁ బనిలేదు మీరు
రేకు: 0135-05 భైరవి సం: 02-146 భగవద్గీత కీర్తనలు
పల్లవి: మఱియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు
జఱసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు
చ. 1: భవసాగరంబులోఁబడి మునిఁగిన నాకు
తివిరి నీనామమను తేపయే దిక్కు
చివికి కర్మంబనెడి చిచ్చు చొచ్చిన నాకు
జవళి నాచార్యు కృపాజలధియే దిక్కు
చ. 2: ఘనమోహపాశముల గాలిఁ బొయ్యెడి నాకు
కొనల నీ పాదచింతకొమ్మయే దిక్కు
కనలి మనసనెడి యాకాసముననున్న నాకు
కనుఁగొనఁగ నీదాస్యగరుడఁడే దిక్కు
చ. 3: మరిగి సంసారమనెడి మంటికిందటి నాకు
ధర భక్తియను బిలద్వారమే దిక్కు
యిరవైన శ్రీవేంకటేశ యిన్నిటా నాకు-
నరుదైన నీవంతరాత్మవే దిక్కు
రేకు: 0135-06 రామక్రియ సం: 02-147 వైరాగ్య చింత
పల్లవి: శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ బొరలఁగనేలా
చ. 1: కాయము సుఖదుఃఖములకు మూలము
పాయము యింద్రియపరవశము
ఆయము రెంటికి నన్నపానములు
మోయని మోఁపిది ములుగఁగనేలా
చ. 2: తలఁపు పుణ్యపాతకముల మూలము
కలిగిన పుట్టువు కర్మగతి
ఫల మిది రెంటికి బలుసంసారము
కలిగిన వెట్టికి కాదననేలా
చ. 3: జీవుఁ డింతటా సృష్టికి మూలము
భావము బ్రకృతికిఁ బ్రపంచము
చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు నెమకఁగనేలా