తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 133
రేకు: 0133-01 మలహరి సం: 02-132 శరణాగతి
పల్లవి: సర్వోపాయముల జగతి నాకితఁడే
వుర్వీధరుఁడు పురుషోత్తముం డితఁడే
చ. 1: సకలగంగాది తీర్థస్నానఫలము లివి స్వామిపుష్కరణి జలమే నాకు
సకలపుణ్యక్షేత్రావాసయాత్ర లివి సరి వేంకటాచలవిహార మిదియే
సకలవేదాధ్యయనశాస్త్రపాఠంబు లివి శౌరిసంకీర్తనం బిదియే నాకు
సకలకర్మానుష్ఠానముల యితని కిచ్చటఁ జాతుపడి కైంకర్య మిదియే
చ. 2: ఉపవాసతపములివి యితని ప్రసాదంబులొగి భుజింపుటే నాదు దినదినంబు
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబులు శరణనేటి సేవ యొకటే
ఉపమింపఁ బుణ్యపురుషుల దర్శనము నాకు నొగి నిచటి బహువృక్షదర్శనంబు
యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి యెన్నఁగల బహుపక్షికలకలంబు
చ. 3: తలఁపుగల యోగంబులందు శ్రీవైష్ణవులఁ దగులు సంవాససహయోగంబు
వెలయ నిండుమహోత్సవంబులిన్నియు నితనివిభవంబులెసఁగు తిరునాళ్ళు నాకు
చెలఁగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశ్వరుని శరణాగతి
అలరు నాసంపదలు యితని పట్టపురాణి అలమేలుమంగ కడకంటిచూపు
రేకు: 0133-02 శ్రీరాగం సం: 02-133 వైరాగ్య చింత
పల్లవి: ఇంతయు నీమాయమయ మేగతిఁ దెలియఁగ వచ్చును
దొంతిఁబెట్టిన కుండలు తొడరిన జన్నములు
చ. 1: కలలోపలి సంభోగము ఘనమగు సంపద లిన్నియు
వలలోపలి నిడిపరులు వన్నెల విభవములు
తలఁపునఁ గలిగియు నిందునే తగులకపో దెవ్వరికిని
తెలిసినఁ దెలియదు యిదివో దేవరహస్యంబు
చ. 2: అద్దములోపలి నీడలు అందరి దేహపురూపులు
చద్దికి వండిన వంటలు జంటఁగర్మములు
పొద్దొకవిధమయి తోఁచును భువి నజ్ఞానాంబుధిలో-
నద్దిన దిది దెలియఁగరా దంబుదముల మెఱుఁగు
చ. 3: మనసునఁ దాగినపా లివి మదిఁగల కోరిక లిన్నియు
యినుమున నిగిరిననీళ్లు యిల నాహారములు
పనివడి శ్రీవేంకటగిరిపతి నీదాసు లివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపు మర్మములు
రేకు: 0133-03 లలిత సం: 02-134 భక్తి
పల్లవి: షోడశకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి
చ. 1: అలరు విశ్వాత్ముకున కావాహన మిదె పర్వ-
నిలయున కాసనము నెమ్మి నిదె
అల గంగాజనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధిశాయికిని మజ్జన మిదె
చ. 2: వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివె
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము(???)
చ. 3: అమృతమథనునకు నదివో నైవేద్యము
గమిఁ జంద్రనేత్రునకుఁ గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రిమీఁది దేవునికి
తమితోఁ బ్రదక్షిణాలు దండములు నివిగో
రేకు: 0133-04 మాళవిగౌళ సం: 02-135 అధ్యాత్మ
పల్లవి: ఏమీ నెఱఁగనినాఁడు యిటు నిన్నుఁ గొలిచేనా
నీమాయ దెలుపఁగా నినుననేఁ గాకా
చ. 1: పసురముగఁ జేసితే బడి నిన్నుఁ దలఁచేనా
వెస రాయిఁ జేసితే వెదికి నిన్నెఱిఁగేనా
పొఁసగ మానుగ నన్నుఁ బుట్టించితేఁ బొగడేనా
ముసిపి నరుఁ జేయఁగా మొరయిడేఁ గాక
చ. 2: మొగి మృగముఁ జేసితే మొక్కనెఱిఁగెనా
తగఁ బక్షి జేసితేఁ దరిఁ బూజ సేసేనా
జిగి నితరజంతువుగఁ జేసితేఁ దగిలేనా
అగపడి వివేకిఁ జేయఁగననేఁ గాక
చ. 3: యింత కధికారిఁ జేసి యీప్రపంచజ్ఞాన-
మింత యొసఁగితివి మరఁ గిఁకనేలా
చింత లిన్నియుఁ దీర శ్రీవేంకటేశ నను
సంతతము నేలఁగా శరణనేఁ గాక
రేకు: 0133-05 శుద్ధవసంతం సం: 02-136 అధ్యాత్మ
పల్లవి: పరమాత్ముఁ డొక్కఁడే పరమపావనుఁడు గన
పరిపూర్ణుఁడనెడి యీభావమే చాలు
చ. 1: హేయ మిందే దుపాధేయ మిందేది
బాయిటనే హరి సర్వపరిపూర్ణుఁడు
నేయునెడ గుణభావజీవకల్పనము లివి
రోయఁజూచినఁ దనదు కాయమే రోఁత
చ. 2: జాతి యిందే దంత్యజాతి యిందేది
జాతులన్నిటా నాత్మ సర్వేశుఁడు
ఆతలను అంటుముట్టనెడి భావనలెల్ల
బాఁతిపడి యెఱఁగనోపని వెలితే తనది
చ. 3: తెలివిగలదాఁకాఁ దెగని మఱఁగు లివి
తెలిసినంతటిమీఁదఁ దీరు సంశయము
యిలలోన శ్రీవేంకటేశ్వరుని కరుణచే
వెలసి యీజ్ఞానంబు విడువకు మనసా