తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 132

వికీసోర్స్ నుండి

రేకు: 0132-01 గుండక్రియ సం: 02-127 ఆధ్యాత్మ

పల్లవి: హరిహరి నీమాయాజగమిది అండనే చూచుచు నవ్వుచును
అరసి యందులో నిను భావించేటి ఆత్మభావమిది యెన్నఁడొకో

చ. 1: సకలోద్యోగంబులు మాని సకలోపాయంబులు విడిచి
సకలేంద్రియముల జాలటు మాని సకలవిషయముల రహితుఁడై
సకలముఁ దనవలె భావించి సర్వాంతరాత్మవు నినుఁ దెలిసి
అకలంకంబున నుండెడి భావంబది యిఁక నెన్నఁడొకో

చ. 2:ఘనమగు కోర్కులఁ జాలించి ఘనకోపంబు నివారించి
ఘనకాముకత్వముల నటు దనిసి ఘనమగు నాసలఁ దొలఁగించి
ఘనముఁ గొంచముల నినుఁ దలఁచి ఘనాఘనుఁడవు నీవనుచు
అనుమానము లటు సుఖియించే దది యిఁక నెన్న డొకో

చ. 3:పరచింతలలోఁ దడఁబడక పరమార్గంబుల కగపడక
పరహింసలకను యెన్నఁడు జొరక పరదూషణలకు నెడగిలిసి
పరదేవుఁడ శ్రీవేంకటభూధరపతి నీకే శరణనుచు
అరమరపుల నేఁ జొక్కితి తనిసేదది యిఁక నెన్నఁడొకో

రేకు: 0132-02 బౌళి సం: 02-128 వైరాగ్య చింత

పల్లవి: ఏది వలసె నీవది సేయు యిందులోన నో జీవాత్మ
పాదగు మనలో నంతరాత్మయై పరగిన శ్రీహరి పనుపునను

చ. 1: మనవంటి జీవులే మహిలోన నొక కొన్ని
శునకములై కుక్కుటములై సూకరములు నైనవి
దినదినముఁ గర్మపాశములఁ దిరిగెడి దుర్దశ లటుచూడు
సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటుచూడు

చ. 2: కన్నులుఁ గాళ్ళు మనవలెఁ దనువులు గైకొని కొందరు నరులు
పన్నిన తొత్తులు బంట్లునై మనపనులు సేయుచున్నారు
యెన్నఁగ శ్రీహరి నెఱఁగక యిడుములఁ బొరలెడి దది చూడు
మున్నె హరిదాసులై నారదముఖ్యులు గెలిచిన దది చూడు

చ. 3: యింతగాలమును యీపుట్టుగులనె యిటువలెఁ బొరలితి మిన్నాళ్ళు
యింతట శ్రీవేంకటేశుఁడు దలంచి యీ జన్మంబున మము నేలె
వింతల బొరలిన నరకకూపముల వెనకటి దైన్యములటు చూడు
సంతసమున ముందరిమోక్షము సర్వానందంబది చూడు

రేకు: 0132-03 శంకరాభరణం సం: 02-129 భగవద్గీత కీర్తనలు

పల్లవి: నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు
ఈవల నాగుణదోషాలెంచ నిఁక నేలా

చ. 1: పూవులపైఁ గాసీఁ బొరి ముండ్లపైఁ గాసీని
ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా
పావనుల నటు గాచి పాపపుంజమైన నన్నుఁ
గావఁగా నీకృపకునుఁ గడమయ్యీనా

చ. 2: గోపుమీఁద విసరీఁ గుక్కమీఁద విసరీని
పావనపు గాలికిని పాపమంటీనా
దేవతల రక్షించి దీనుఁడనైన నాకుఁ
దోవచూపి రక్షించితే దోసమయ్యీనా

చ. 3: కులజుని యింటనుండీ కులహీనుని యింటనుండీ
యిలలో నెండకు నేమి హీనమయ్యీనా
వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో
నిలిచి వరములిచ్చి నేఁడు గావవే

రేకు: 0132-04 సామంతం సం: 02-130 వైరాగ్య చింత

పల్లవి: నెప్పున ధర్మపుణ్యము నీచేతి దింతే
యెప్పుడు గాచినఁ గావు మింతా నీచిత్తము

చ. 1: యేవల నరుఁడు లేక యెద్దే తా దున్నునా
నీవు సేయించక వేరే నేఁ బుణ్యము సేసేనా
దేవుఁడ సూర్యుఁడు రాక తెల్లవారునా రేయి
వేవేగ నీకృపఁగాక విజ్ఞానినౌదునా

చ. 2: కుమ్మరవాఁడు లేకే కుండ రాఁ బుట్టునా
నెమ్మి నీవు పుట్టించక నేనే పుట్టితినా
వమ్ముల రాట్నము నిలువక గుండ్రలు నిల్చునా
పమ్మి నీయప్పణ లేక భవములు మానునా

చ. 3: మక్కువ మగఁడులేని మనువు గలుగునా
లెక్కించి యంతర్యామివి లేని నే నున్నాఁడనా
చక్కఁగ శ్రీవేంకటేశ శరణనే బుద్ధి నాకు
తక్కక నీవియ్యకుంటే దాసుడ నే నౌదునా

రేకు: 0132-05 లలిత సం: 02-131 శరణాగతి

పల్లవి: ఇహమేకాని యిఁకఁ బరమేకాని
బహుళమై హరి నీపై భక్తే చాలు

చ. 1: యెందు జనించిన నేమి యెచ్చోట నున్న నేమి
కందువ నీదాస్యము గలిగితేఁ జాలు
అంది స్వర్గమేకాని అల నరకమేకాని
అందపు నీనామము నా కబ్బుటేచాలు

చ. 2: దొరయైనఁ జాలు గడుఁ దుచ్ఛపు బంటైనఁ జాలు
కరఁగి నిన్నుఁ దలఁచఁగలితేఁ జాలు
పరులు మెచ్చిన మేలు పమ్మి దూషించిన మేలు
హరి నీసేవాపరుఁడౌటే చాలు

చ. 3: యిలఁ జదువులు రానీ యిటు రాక మాననీ
తలఁపు నీపాదముల తగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చలపట్టి నాకు నీశరణమే చాలు