Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 118

వికీసోర్స్ నుండి

రేకు: 0118-01 దేసాళం సం: 02-103 ఉపమానములు

పల్లవి: జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు
కావక పోరాదు మాకుఁ గల యంతర్యామివి
    
చ. 1: పైపై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను
చేపట్టి యడిగి తెచ్చి చేఁదు దిన్నట్లు
పూపలైన చేతిలోనే పుణ్యములు వుండఁగాను
పాపములు చవియంటాఁ బట్టబొయ్యీ జీవుఁడు
    
చ. 2: యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండఁగాను
కంటగించి గాజుఁబూస గట్టుకొన్నట్లు
వెంటనే హరినామాలు వేయివేలై వుండఁగా
జంట నితరమంత్రాలు జపియించీ జీవుఁడు
    
చ. 3: చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండఁగాను
వేసరక వెలయాలి వెతకినట్లు
మేసుల శ్రీవేంకటేశ మీదాస్యమే వుండఁగా
వాసిఁ బరులఁ గొలువనే వడిఁ గోరీ జీవుఁడు

రేకు: 0118-02 గౌళ సం: 02-104 వైరాగ్య చింత

పల్లవి: ఊరకే దొరుకునా వున్నతోన్నతసుఖము
సారంబు దెలిసికా జయము చేకొనుట
    
చ. 1: తలఁపులోపలి చింత దాఁటినప్పుడు గదా
అలరి దైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా
తలకొన్న మోక్షంబు తనకుఁ జేపడుట
    
చ. 2: కర్మంబు కసటు వోఁ గడగినప్పుడు గదా
నిర్మలజ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీమఱఁగు జొచ్చినఁ గదా
కూర్మిఁ దన జన్మమెక్కుడు కెక్కుడౌట
    
చ. 3: తన శాంతమాత్మలోఁ దగిలినప్పుడు గదా
పనిగొన్న తన చదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినఁ గదా దరిచేరి మనుట

రేకు: 0118-03 భైరవి సం: 02-105 వైరాగ్య చింత

పల్లవి: ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో
దామెన సంసారములోఁ దట్టువడీ మనసు
    
చ. 1: యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి
చక్కుముక్కు సేసి యెంచి సాధించీని
గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట
వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని
    
చ. 2: యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన
వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో
విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని
    
చ. 3: యే వేళ గుణమో యెడతెగని కర్మాలు
రావిమాని జిగురై వూరక యంటీని
శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి
కావఁగఁగదా నీవే గతి యనవలసె


రేకు: 0118-04 ముఖారి సం: 02-106 అధ్యాత్మ

పల్లవి: నిరుహేతుక దయానిధివి నీవు
కరుణించు నీకు నొక్కటి విన్నపము
    
చ. 1: దేవా నీమహిమ తెలియ నెవ్వరివశ-
మీవల నీవే గతెను టింతేకాక
భావించలేరు నిన్ను బ్రహ్మాదులు సహితము
నీవేడ నేనేడ నే నొక జంతువను
    
చ. 2: చిత్తా హరి నాదిక్కు చేకొని యవలోకించవే
యిత్తల సంసారవార్ధి యీఁదుచున్నాఁడ
హత్తి చూచేవారేకాని అడ్డగించేవారు లేరు
పొత్తుల నాధర్మము పుణ్యము నీచేతిది
    
చ. 3: అవధారు శ్రీవేంకటాధీశ నాజన్మము
కవిసి యింద్రియములఁ గట్టువడ్డాఁడ
జవళి నీపాదములే శరణము చొచ్చినాఁడ
తవిలి నీచిత్తమింతే తరవాత నిఁకను

రేకు: 0118-05 బౌళి సం: 02-107 దశావతారములు

పల్లవి: శ్రీవేంకటేశ్వరుఁడు చేరి విజయముఁ బొంది
దేవతలు చూడ దశదిక్కులకు నేసెను
    
చ. 1: అరికమ్ము వేసెనట్టె అల్లనరకాసురుపై
మేరమీరి రావణునిమీఁద నేసెను
సారపుజలధిమీఁద జలములింకఁగ నేసె
దారి దప్పకుండ నేడుదాళ్లు దెగనేసె
    
చ. 2: పగదీర మింటిమీఁది బాణునిమీఁద నేసె
మిగుల మెరసి మాయమృగము నేసె
జగములో రాక్షసుల సంహరముగ నేసె
నిగిడి రక్తగుండాలు నిండ నేసెను
    
చ. 3: ఖరదూషణాదుల కడిఖండలుగ నేసె
సరుసఁ గుంభకర్ణునిఁ జావనేసెను
అరిది శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
గరుడనిమీఁద నెక్కి కంటువాయ నేసెను

రేకు: 0118-06 బౌళి సం: 02-108 విష్వక్సేన

పల్లవి: ఆర్పులు బొబ్బలె నవె వినుఁడు
యేర్పడ నసురల నిటువలె గెలిచే
    
చ. 1: కూలిన తలలును గుఱ్ఱపు డొక్కలు
నేలపైఁ బారిన నెత్తురులు
వోలిఁ జూడుఁ డిదె వుద్ధగళలీ రణ-
కేలిని విష్వక్సేనుఁడు గెలిచె
    
చ. 2: పడిన రథంబులు బాహుదండములు
కెడసిన గజములు గొడగులును
అడియాలము లివె అక్కడ విక్కడ
చిడుముడి విష్వక్సేనుఁడు గెలిచె
    
చ. 3: పగుల పగుల వృషభాసురునిఁ జంపె
పగ నీఁగె అతని బలములతో
అగపడి శ్రీవేంకటాధిపు పంపున
జిగిగల విష్వక్సేనుఁడు గెలిచె