తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 119
రేకు: 0119-01 లలిత సం: 02-109 శరణాగతి
పల్లవి: సకల బలంబులు నీవే సర్వేశ్వర నాకు
అకలంకంబగు సుఖమే అన్నిట నిదే నాకు
చ. 1: పొందుగఁ జక్రాంకితమే బుజబలమిదె నాకు
అందిన హరి నీచింతే ఆత్మబలము నాకు
సందడిఁ బేరుబలము కేశవనామము నాకు
యిందును నందును భవభయ మిఁక లేదిదే నాకు
చ. 2: అంగపుఁ దిరుమణు లివి పంచాంగబలము నాకు
సంగతి నీపై పాటలె స్వరబలిమిదే నాకు
రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు
యింగితముగ నిహపరముల కెదురేదిదే నాకు
చ. 3: కనుఁగొను నీవిగ్రహమే గ్రహబలిమిదె నాకు
విను నీదాసుల సేవే వెనుబలిమిదె నాకు
తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పఁగ నింతటఁ గలిగెబో యిదే నాకు
రేకు: 0119-02 సాళంగనాట సం: 02-110 తేరు
పల్లవి: ఇదివో వీథివీథుల నీతని తేరు
యెదుట శ్రీవేంకటాద్రిని తేరు
చ. 1: చట్టువడఁ దోలె నాఁడు సముద్రాలపైఁ దేరు
ఘెుట్టుగాఁ దోలెను పౌండ్రకునిపైఁ దేరు
జట్టిగొని తోలె జరాసంధునిపై నదె తేరు
కొట్టి తోలె హంసడిచుకులపై(???) తేరు (డిభక డిచికుఁడు - హంసుని సోదరుఁడు)
చ. 2: ఘోరమై కుంగఁగఁ దోలె కులగిరులపైఁ దేరు
కౌరవసేనపై దోలె గక్కనఁ దేరు
కోరి మధురమీఁద నక్రూరుఁ గూడ తోలెఁ దేరు
ఆరసి సంధిమాటలు ఆడఁ దోలెఁ దేరు
చ. 3: తచ్చి శిశుపాలాది దైత్యులపైఁ దోలెఁ దేరు
పెచ్చుగాఁ దోలె రుక్మిణి పెండ్లి తేరు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చెచ్చెరఁ దోలె దిక్కుల సింగారపుఁ దేరు
రేకు: 0119-03 పాడి సం: 02-111 వేంకటగానం
పల్లవి: అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా
చ. 1: అదివో కోనేటిలోన నదివో సర్వ తీర్థములు
అదివో పైఁడిమేడల హరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరములిచ్చె నిందిరానాథుఁడు
చ. 2: అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్ల సంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు
చ. 3: అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్మంగ
అదివో నిత్యశూరులు ఆళువారలు
నిదుల శేషాచలము నిక్కి పైపైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు
రేకు: 0119-04 నాట సం: 02-112 నృసింహ
పల్లవి: అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
మహామహిమలను మలసీ వాఁడే
చ. 1: కదలుఁ గన్నులును కరాళవదనము
గుదిగొను భయదపుఁ గోరలును
అదరు మీసములు నలరఁగ నవ్వుచు
వుదుటు తోడఁ గొలువున్నాఁడు వాఁడె
చ. 2: అతిసిత నఖములు ననంత భుజములు
వితతపరాక్రమ వేషమును
అతులదీర్ఘజిహ్వయుఁ గడు మెరయఁగ
మితిలేని కరుణ మెరసీ వాఁడే
చ. 3: సందడి సొమ్ములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడగను
యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట-
మందు నిందు గడుఁ నలరీ వాడే
రేకు: 0119-05 సాళంగనాట సం: 02-113 నృసింహ
పల్లవి: సిరిఁ దొడపై నిడి శ్రీనరసింహుఁడు
యిరవుగ వరములనిచ్చీని వాడే
చ. 1: ఘనమగు కోరలు కరాళవదనము
చెనకుచు గొడసెటి జిహ్వయును
నినిపుఁ గటమరలు నిటలలోచనము
నొనరఁగ గొలువై యున్నాఁడు వాఁడే
చ. 2: చటులచక్రకరంబును శార్ఙ్గరంబుసు
అటు వరదాభయహస్తములు
పటుతరయోగపు పట్టబంధమును
కటితటి జెలఁగఁగఁ గడఁగీ వాఁడే
చ. 3: పరపగు శేషుని పడగల నీడల
అరుదగు రవిచంద్రాంకముల
సిరులగద్దెపై శ్రీవేంకటేశుడు
పరిపూర్ణుఁడై పరగీ వాఁడే
రేకు: 0119-06 శ్రీరాగం సం: 02-114 శరణాగతి
పల్లవి: నిర్మలులు వీరు నిత్యసుఖులు
కర్మదూరులు విష్ణుకైంకర్యపరులు
చ. 1: పరమజ్ఞానసంపన్నులగువారికిని
అరుదుగా దిచటి మహదైశ్వర్యము
హరికృపాధనము చేనబ్బిన మహాత్ములకు
సరకుగాకుండు పంచల నిధానములు
చ. 2: బలిమిని వేదాంతపట్టభద్రులకు నిల
బలురాజ్యపదవు లిరుగడబంట్లు
లలిమీరి హరిచక్రలాంఛనపు శూరులకు
యెలమి విజయములెల్ల నింటిలో నుండు
చ. 3: యీవలను శ్రీవేంకటేశు శరణాగతుల-
కావటించిన పుణ్య మడువుగాదు
దైవజ్ఞులయిన యాధర్మస్వరూపులకు
వేవేలు భోగములు వెనుతగులుచుండు