తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 117
రేకు: 0117-01 రామక్రియ సం: 02-097 అంత్యప్రాస
పల్లవి: ఇట్టిజీవుల కింక నేది వాటి
దట్టమై దేవుఁడ నీవే దయఁజూతుగాకా
చ. 1: తనజన్మవిదు(ధు )లనుఁ దలఁచు నొక్కొకవేళ
వొనర మఱచునట్టె వొక్కొకవేళ
వినుఁ బురాణకథలు వివరించి యొకవేళ
పెనచి సందేహములె పెంచు నొకవేళ
చ. 2: విసిగి సంసారమందు విరతుఁడౌ నొకవేళ
వొఁసగి యందె మత్తుఁడౌ నొకవేళ
పసిగొని యింద్రియాల బంటై వుండు నొకవేళ
ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ
చ. 3: కోరి తపములు చేసి గుణియౌ తా నొకవేళ
వూరకే అలసి వుండు నొక్కవేళ
యీరీతి శ్రీవేంకటేశ యెదలో నీవుండఁగాను
బీరాన నీకే మొఱవెట్టు నొకవేళ
రేకు: 0117-02 సామంతం సం: 02-098 వేంకటగానం
పల్లవి: ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక
యింతయు నేలేటి దైవ మిఁక వేరే కలరా
చ. 1: మొదల జగములకు మూలమైనవాఁడు
తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు
మదనగురుఁడే కాక మఱి వేరే కలరా
చ. 2: పరమాణువైనవాఁడు బ్రహ్మాండమైనవాఁడు
సురలకు నరులకుఁ జోటయినవాఁడు
పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు
హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా
చ. 3: పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాఁడు
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి-
పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా
రేకు: 0117-03 పాడి సం: 02-099 అధ్యాత్మ
పల్లవి: భోగసహాయులె పొరుగెల్లా
ఆగమవిదు(ధు) లును ననంతములు
చ. 1: కులమునఁ జుట్టాలు కోటాఁనగోట్లు
కలిమిలేమి కొక్కఁడనే గుఱి
పలులంపటముల ప్రజలే యిందరు
నిలిచిన చోటికి నే నొక్కఁడనే
చ. 2: చెట్టడిచిన నిదె చేటఁడు పండ్లు
గుట్టు దెలుసుకొన గురి నేను
వొట్టుక సంసార మూరల్లా నిదె
పుట్టినప్పటికి భువి నొక్కఁడనే
చ. 3: చనవుమనవులకు జగమెల్లా నిదె
కొనకు మొదలికిని గురి నేను
యెనయుచు శ్రీవేంకటేశుఁ డేలెఁ గన
నినుపుగమికాఁడ నే నొక్కఁడనే
రేకు: 0117-04 శ్రీరాగం సం: 02-100 అన్నమయ్య స్తుతి, గురు వందన
పల్లవి: హరి యవతారమీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతఁ డన్నమయ్య
చ. 1: వైకుంఠనాథుని వద్ద వడిఁ బాడుచున్నవాఁడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాడు
ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య
చ. 2: క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండల తేజమువద్ద నున్నవాఁడు
ఆరీతులఁ తాళ్ళపాక అన్నమయ్య
చ. 3: యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాఁడు
ఆ(హా?)వభావమై తాళ్ళపాక అన్నమయ్య
రేకు: 0117-05 మలహరి సం: 02-101 శరణాగతి
పల్లవి: కోరి మాభుజముల డాగులు మోచుకున్నారము
ధారుణిలోపల మమ్ము దయఁజూచుఁ గాక
చ. 1: సతతము హరిచేతి శంఖచక్రములే
గతియై మాపాలనుండి కాచుఁ గాక
అతిరయమైనట్టిఅచ్యుతుని ఆయుధాలే
హితవుగ మమ్ము నిట్టె యేలుఁ గాక
చ. 2: కమలాపతిచేతుల గదాపద్మములు
మమకారముతో మము మన్నించుఁ గాక
సమరవిజయమైన శార్ఙ్గాదిశరములు
తమితోడ మాకు దాపుదండై వుండుఁ గాక
చ. 3: ముంచి శ్రీవేంకటేశుఁడు మొలఁగట్టిన కఠారు
అంచెల మాకెల్ల రక్షై అమరుఁ గాక
అంచ నీతని కైదువులమరిన హస్తములు
పంచల మాకిట్టే వజ్రపంజరా లవుఁ గాక
రేకు: 0117-06 లలిత సం: 02-102 వేంకటగానం
పల్లవి: ఎన్నఁడొకో బుద్ధెరిఁగి యీడేరేది జంతువుల
యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి
చ. 1: కావించి నీపాదతీర్థగంగ ప్రవాహమైనది
పావనులై యిందరిని బ్రదుకుమని
లావుగా నీప్రసాదతులసి నారువోశున్నది
వేవేలు పాతకాలెల్ల విదళించుమనుచు
చ. 2: చింతల నీమూర్తులు శిలాశాసనాలైనవి
పంతముతోఁ గొలిచిట్టె బ్రదుకుమని
బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి
దొంతులైన భవముల తుద గనుమనుచు
చ. 3: అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి
బందె దీర నీకు మ్రొక్కి బ్రదుకుమని
అందపు శ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాఁడ-
వెందు చూచిన విజ్ఞాన మింద కొండో యనుచు