తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 116
రేకు: 0116-01 సాళంగనాట సం: 02-091 నృసింహ
పల్లవి: విఱిగిరి దానవవీరు లదె
అఱిముఱి దేవత లాడేరదె
చ. 1: పరగుకంభ మదె పగిలె పగిలె నదె
హరినరసింహంబాయ నదె
గరుడధ్వజ మదె ఘనచక్రం బదె
మొరసేటి శంకపుమ్రోత లవె
చ. 2: వెడలె వెడలె నదె వెనుకొని హిరణ్యుఁ
దొడికిపట్టె నదె తొడమీఁద
విడువక చించిన వేయిచేతులవె
కడపమీఁదనే కదలఁడదె
చ. 3: అదె వామాంకంబందు లక్ష్మి యదె
కదిసి శాంతమదే కరుణ యదె
వుదుటున ప్రహ్లాదు నూరడించె నదె
యిదె శ్రీవేంకటమెక్కె నదె
రేకు: 0116-02 సామంతం సం: 02-092 వైరాగ్య చింత
పల్లవి: ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ
గద్దించి యాడవుండునో కడసారీ తాను
చ. 1: తోడఁబుట్టిన మమత తొడఁగి కొన్నాళ్లకు
వాడికె పుత్రులమీఁదవలె నుండదు
వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని
కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే
చ. 2: తల్లిమీఁదఁ గలభక్తి తనకే కొన్నాళ్లకు
యిల్లాలుమీఁదవలె నింత వుండదు
వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత
యిల్లుముంగి లొక్కరిది యెరవు వొక్కరిది
చ. 3: నీతితో శ్రీవేంకటేశు నిత్యసేవ కొన్నాళ్ల-
కీతల సంసారమంత యితవు గాదు
ఆతఁడెట్టు యివియెట్టు అందరూ నెఱిఁగినదే
చేతు లొకటిమీఁదట చిత్త మొకయందు
రేకు: 0116-03 నాట సం: 02-093 నృసింహ
పల్లవి: దేవశిఖామణి దివిజులు వొగడఁగ
వేవేలు గతులు వెలసీ వాఁడే
చ. 1: వీదుల వీదుల వెసఁ దురగముపై
భేదిల బల్లెము బిరబిరఁ దిప్పుచు
మోదముతోడుత మోహనమూరితి
యే దెసచూచిన నేఁగీ వాఁడే
చ. 2: కన్నులు దిప్పుచు కర్ణములు గదల
సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటఁ దేజి యాడఁగ దేవుఁడు
తిన్నఁగ వాగేలు దిప్పీ వాఁడే
చ. 3: వలగొనఁ దిరుగుచు వాలము విసరుచు
నిలిచి గుఱ్ఱ మటు నేర్పులు చూపఁగ
బలుశ్రీవేంకటపతి యహోబలపుఁ
బొలమున సారెకుఁ బొదలీ వాఁడే
రేకు: 0116-04 రామక్రియ సం: 02-094 శరణాగతి
పల్లవి: ఇందరి బుద్ధులు యీశ్వరేచ్ఛకు సరిరావు
గొందినున్న మానుషము కొలువ దెంతైనా
చ. 1: తనంతఁ దా నూరకున్న దైవమే తోడౌను
కినిసి తాఁ బదిరితే కిందుమీఁదౌను
తనుఁ దానే చేరె హరి దధివిభాండకునకు
కొనకెక్కఁ బోయి నీవి కొంచపడెఁ దొల్లి
చ. 2: వొక్కటివాఁడు దానైతే వున్నచోనే మేలు చేరు
పెక్కుబుద్ధులఁ బోతేను పిరివీకౌను
పక్కన నంబరీషుఁడు పట్టిన వ్రతాన గెల్చె
దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను
చ. 3: శ్రీవేంకటేశ్వరు చేతిలోవీ జగములు
భావించిఁ యాతడు నడపక మానఁడు
వావిరి నిదెఱఁగక వట్టియలమటఁ బడి
జీవులేల బడలేరు చింత లిట్టె పాయరో
రేకు: 0116-05 శ్రీరాగం సం: 02-095 అధ్యాత్మ
పల్లవి: ఎంత వాటువడె నీశ్వరుఁడు
జంతువుల కేది సతమోకాని
చ. 1: వోముచు లోలో నొకదేహమునకె
యేమి రచించెను యీశ్వరుఁడు
కామించి మోక్షసుఖమునకునైతే
వోమిన స్రిష్టులు వొకటీఁ గావు
చ. 2: భోగించ బుట్టిన భూతకోట్లను
యేగతి మోఁచీ నీశ్వరుఁడు
చేగదేర తనసేవకుఁ జొచ్చిన-
యోగము సులభం బొకటొకటికిని
చ. 3: పన్నిన జగములు ప్రాణాధారము
యెన్నిట నున్నాఁ డీశ్వరుఁడు
కన్నుల శ్రీవేంకటపతియని కని
వున్నవేళ తమ వునికే సుఖము
రేకు: 0116-06 దేసాక్షి సం: 02-096 ఉపమానములు
పల్లవి: నమ్మలేము కానలేము నరులాల మనమింతే
సమ్మతించి యేలేవాఁడు సర్వేశుఁడే సుండీ
చ. 1: కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండినయట్టు
వొంటి దేహమెల్లా జేవొడ్డుకొన్నట్టు
అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయై వుండీ
జంటయై కాచుకున్నాఁడు సర్వేశుఁడే సుండీ
చ. 2: చీఁకటి నోటికిఁ గడి చేయే కొంటవచ్చినట్టు
ఆఁకటికి గుక్కిళ్లు ఆసయినట్టు
వీఁకల జంతువులకు వెలుపల లోననుండి
సాఁకుచునున్నాఁ డిదివో సర్వేశుఁడే సుండీ
చ. 3: తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు
తెమలి ప్రాణ మిన్నిటాఁ దీపయినట్టు
అమరిన భోగమోక్షా లడిగినవారి కిచ్చీ
సముఁడు శ్రీవేంకటాద్రి సర్వేశుఁడే సుండీ