Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 115

వికీసోర్స్ నుండి

రేకు: 0115-01 శంకరాభారణం సం: 02-085 నామ సంకీర్తన
పల్లవి: నాటికి నాఁడు గొత్త నేటికి నేఁడు గొత్త
నాటకపు దైవమవు నమో నమో
    
చ. 1: సిరుల రుక్మాంగదుచేతి కత్తిధారఁ దొల్లి
వరస ధర్మాంగదుపై వనమాలాయ
హరి నీకృపకలిమి నట్లనే అరులచే
కరిఖడ్గధార నాకుఁ గలువదండాయ
    
చ. 2: మునుప హరిశ్చంద్రు మొనకత్తిధారఁ దొల్లి
పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ
వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి-
ఘనఖడ్గధార నాకుఁ గస్తూరివాటాయ
    
చ. 3: చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి
కలుషముఁ బెడఁబాపి కాచినట్టు
అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి
యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ

రేకు: 0115-02 సాళంగనాట సం: 02-086 భక్తి

పల్లవి: కంటిమి రెంటికి భూమి గలుగు దృష్టాంతము
గొంటరి రావణునందు గుహునియందు
    
చ. 1: నీదాస్యముగల నీచజన్మమైన మేలు
యేదియు నెఱఁగనట్టి యెక్కువ జన్మానకంటే
వాదపుగర్వము లేదు వట్టియాచారము లేదు
సాదించి నైచ్యానుసంధానమే కాని
    
చ. 2: మిమ్ముఁ దలపుచుఁ జేయు మృగయానయైన మేలు
సొమ్ముపోక మీకుఁగాని సుకృతము సేయుకంటె
దిమ్మరిజన్మము లేదు తెగనికోరిక లేదు
పమ్మి నీపైఁ బెట్టినట్టి భారమేకాని
    
చ. 3: దిక్కులు సాధించుకంటె తెలిసి శ్రీవేంకటేశు-
దిక్కు నీనామమే కా సాధించుటే మేలు
యెక్కువ తక్కువ లేదు యెఱు కెఱఁగమి లేదు
చక్కజాడతో నీకు శరణంటేఁగాని

రేకు: 0115-03 లలిత సం: 02-087 వైరాగ్య చింత

పల్లవి: కామధేనువై కలిగె నీధరణి
వాములు వలసినవారికి విధులు
    
చ. 1: అందరు జీవులే ఆయాకర్మముఁ
బొంది బుద్ధు లెప్పుడు వేరు
కొందరు స్వర్గము గోరి సుఖింతురు
కొందరు నరకానఁ గూలుదురు
    
చ. 2: దేవుఁ డిందరికి దిక్కై యుండును
భావాభావమే బహువిధము
దేవత లమృతాధీనమై మనిరి
తోవనె దనుజులు దురిత మందిరి
    
చ. 3: పుట్టు గందరికి పొంచి కలిగినదె
దట్టపుమనసులే తమకొలఁది
యిట్టే శ్రీవేంకటేశుఁడు సేసిన
యట్లౌ నాతఁడు అదివో యెదుట

రేకు: 0115-04 గుండక్రియ సం: 02-088 శరణాగతి

పల్లవి: ఏ పురాణముల నెంత వెదకినా
శ్రీపతిదాసులు చెడరెన్నఁడును
    
చ. 1: హరివిరహితములు అవి గొన్నాళ్ళకు
విరసంబులు మరి విఫలములు
నరహరిఁ గొలిచిటు నమ్మిన వరములు
నిరతము లెన్నఁడు నెలవులు చెడవు
    
చ. 2: కమలాక్షుని మతిఁగానని చదువులు
కుమతంబులు బహుకుపథములు
జమళి నచ్యుతుని సమారాధనలు
విమలములే కాని వితథముగావు
    
చ. 3: శ్రీవల్లభుగతిఁ జేరని పదవులు
దావతులు కపటధర్మములు
శ్రీవేంకటపతి సేవించు సేవలు
పావనము లధికభాగ్యపు సిరులు

రేకు: 0115-05 ముఖారి సం: 02-089 హరిదాసులు

పల్లవి: ఏలోకమందున్నా నేమి లేదు
తాలిమి నందుకుఁదగ్గ దావతే కాని
    
చ. 1: సురల కసురలకు సూడునుఁ బాడునే కాని
పొరసి సుఖించఁగఁ బొద్దు లేదు
ధరలో ఋషులకు తపము సేయనే కాని
మరిగి భోగించఁగ మరి పొద్దు లేదు
    
చ. 2: గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని
చిక్కి పరుసము గలిగి సెలవు లేదు
రెక్కలుగల పక్షికి రేసుతిమ్మటలే కాని
చక్క వైకుంఠాన కెగయ సత్తువ లేదు
    
చ. 3: సకల జంతువులకు జన్మాదులే కాని
అకటా నిత్యానంద మందలేదు
వెకలి శ్రీవేంకటేశువిష్ణుదాసులకే మంచి-
సుకములెల్లాఁ గలవు సుడివడలేదు

రేకు: 0115-06 దేవగాంధారి సం: 02-090 శరణాగతి

పల్లవి: అన్నియునుఁ దనఆచార్యాధీనము
చెన్నుమీఱ హరిపాదసేవ చేయు మనసా
    
చ. 1: దైవమూఁ గొంచము గాఁడు తానూ గొంచము గాఁడు
భావించి కొలచేవారి పరిపాటి
చేవలఁ బత్తిముదుగు చేనిముదుగూ లేదు
వావిరిఁ బోఁగెత్తేటి వారివారి నేరుపు
    
చ. 2: కాలము కడమలేదు కర్మము కడమ లేదు
కేలి విశ్వాసము గలిగిన పాటి
వ్రాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు
పోలించేటి విద్వాంసుల బుద్ధిలోని నేరుపు
    
చ. 3: జ్ఞానానకుఁ దప్పులేదు జన్మానకుఁ దప్పులేదు
నానాటికి వివేకించి నడచేపాటి
పానిపట్టి శ్రీవేంకటపతి యింతకు మూలము
ఆనుక యీతని శరణనేవారి నేరుపు