Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 114

వికీసోర్స్ నుండి

రేకు: 0114-01 సాళంగనాట సం: 02-079 విష్వక్సేన

పల్లవి: అదెవచ్చె నిదివచ్చె నచ్యుతు సేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు ॥పల్లవి॥
    
చ. 1: గరుడధ్వజంబదె ఘన శంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరి పంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై పారరో దానవులు
    
చ. 2: తెల్లని గొడుగులవె దేవదుంధుబులునవె
యెల్ల దేవతల రథాలింతటానవె
కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు
    
చ. 3: వెండిపైఁడి గుదెలవె వెంజామరలవె
మెండగు కైవారాలు మించినవవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టెనదె యిదె
బండుబండై జజ్జరించి పారరో దైతేయులు

రేకు: 0114-02 లలిత సం: 02-080 వైరాగ్య చింత

పల్లవి: అయ్యో నేనేకా అన్నిటికంటెఁ దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుఁగాని
    
చ. 1: తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా-
యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే-
ముడిచి వేసినంతనే ముట్టరాదాయను
    
చ. 2: వెక్కసపు రచనల వేవేలు రుచులు నా
వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు
పక్కన దేవార్హపుఁ బరిమళ గంధములు నా-
ముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను
    
చ. 3: గగనాననుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనే యోగ్యము గావు
నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక
మొగడై యెరుక తుదిముట్టరాదాయను

రేకు: 0114-03 నాట సం: 02-081 సంస్కృత కీర్తనలు

పల్లవి: మర్ద మర్ద మమబంధాని
దుర్దాంత మహాదురితాని
    
చ. 1: చక్రాయుధ రవిశత తేజోఽంచిత
సక్రోధసహస్ర ప్రముఖా
విక్రమక్రమా విస్ఫులింగకణ
నక్రహరణ హరినవ్యకరాంకా
    
చ. 2: కలితసుదర్శన కఠినవిదారణ
కులిశకోటిభవ ఘోషణా
ప్రళయానలసంభ్రమవిభ్రమకర
రళితదైత్యగళరక్తవికీరణా
    
చ. 3: హితకర శ్రీవేంకటేశప్రయుక్త
సతతపరాక్రమజయంకర
చతురోఽహంతే శరణం గతోఽస్మి
యితరాన్ విభజ్య యిహ మాం రక్ష

రేకు: 0114-04 మాళవిగౌళ సం: 02-082 భక్తి

పల్లవి: నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
    
చ. 1: తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమటా
కనుఁగొను చూపులే ఘనదీపము లట
తనలోపలి యంతర్యామికిని
    
చ. 2: పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలఁపులోపలనున్న దైవమునకు
    
చ. 3: గమనచేష్టలే యంగరంగగతియట
తమిగల జీవుఁడే దాసుఁడట
అమరిన వూర్పులే యాలవట్టములట
క్రమముతో శ్రీవేంకటరాయనికిని

రేకు: 0114-05 ముఖారి సం: 02-083 నామ సంకీర్తన

పల్లవి: కిన్నజానేఽహం కేశవాత్పర మహో
సన్నుతాకర మమాచరణాయ తస్మై
    
చ. 1: వేదాంతవేద్యాయ విశ్వరూపాయ నమో
ఆదిమధ్యాంతరహితాధికాయ
భేదాయ పునరప్యభేదాయ నమో నమో
నాదప్రియాయ మమ నాథాయ తస్మై
    
చ. 2: పరమపురుషాయ భవబంధహరణాయ నమో
నిరుపమానందాయ నిత్యాయ
దురితదూరాయ కలిదోషవిధ్వస్తాయ
హరియచ్యుతాయ మమ ఆత్మాయ తస్మై
    
చ. 3: కాలాత్మకాయ నిజకరుణాకరాయ నమో
శ్రీలలామాకుచాశ్రితగుణాయ
హేలాంక శ్రీవేంకటేశాయ నమో నమో
పాలితాఖిల మమాభరణాయ తస్మై

రేకు: 0114-06 కాంబోది సం: 02-084 వైరాగ్య చింత

పల్లవి: చెల్ల నెక్కికొంటివిగా జీవుఁడ యీబలుకోటా
బల్లి దుఁడ నీకు నేఁడు పట్టమాయఁ గోటా
    
చ. 1: తొమ్మిది గవనులైన దొడ్డతోలుఁ గోటా
కొమ్ముల చవుల మూల కొత్తళాల కోటా
వమ్ములేని మెడవంపు వంకదార కోటా
పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా
    
చ. 2: తలవాకిలి దంతపుతలుపుల కోటా
తలిరుఁ జేతుల పెద్దదంతెనాల కోటా
వెలియాసలనే దండువిడిసిన కోటా
గులుగై యింద్రియములు కొల్ల గొన్న కోటా
    
చ. 3: నడచప్పరములనే నలువైన కోటా
జడిసిన చెవుల మించు సవరణ కోటా
పడనిపాట్లఁ బడి ఫలియించెఁ గోటా
యెడమిచ్చి శ్రీవేంకటేశుఁ డేలేఁ గోటా