Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 113

వికీసోర్స్ నుండి

రేకు: 0113-01 మాళవి సం: 02-073 నామ సంకీర్తన

పల్లవి: ధ్రువవరదా సంస్తుతవరదా
నవమైన యార్తుని నన్నుఁ గావవే
    
చ. 1: కరిరాజవరదా కాకాసురవరదా
శరణాగతవిభీషణ వరదా
సిరుల వేదాలు నిన్నుఁ జెప్పగా వినీని
మరిగి మఱఁగుచొచ్చే మమ్ముఁ గావవే
    
చ. 2: అక్రూరవరదా అంబరీషవరదా
శక్రాది దివిజనిచయవరదా
విక్రమించి యిన్నిటా నీవే ఘనమని నీకు
చక్రధర శరణంటి సరిఁగావవే
    
చ. 3: ద్రౌపదీవరదా తగ నర్జునవరదా
శ్రీపతీ ప్రహ్లాదశిశువరదా
యేపున శ్రీవేంకటాద్రి నిటు నేను నాగురుఁడు
చూపఁగా గొలిచే నచ్చుగఁ గావవే

రేకు: 0113-02 గుండక్రియ సం: 02-074 శరణాగతి

పల్లవి: నమ్మిన దొకటే నాకు నీశరణము
యెమ్మెల సంసార మింతే యిందేమిగలదు
    
చ. 1: యేఁటికర్మము నా కేఁటిధర్మము
యేఁటిదో నేఁ జేయఁగా నీ కేమి గూడెను
నాఁటకపు తొంటివారు నడిచిన మార్గమని
యీఁటుకుఁ జేఁసేఁగాక యిందేమి గలదు
    
చ. 2: యేడతపము నా కేడజపము నే
వాడికఁ జేయఁగ నీకు వచ్చినదేమి
బెడిదపుఁ బెద్దలెల్లాఁ బెట్టిన తిట్టములంటా
యీడుకుఁ జేసెఁగాక యిందేమి గలదు
    
చ. 3: యెక్కడిపుణ్యము నా కెక్కడిభోగములు
యిక్కువ నన్నిట్లఁ జేసి యేమిగంటివి
నిక్కెపు శ్రీవేంకటేశ నిన్నుఁ గనుటగాక
యెక్కడి కెక్కడిమాయ లిందేమి గలదు

రేకు: 0113-03 బౌళి సం: 02-075 అధ్యాత్మ

పల్లవి: అన్నియును హరి సేసే యటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోఁచు
    
చ. 1: తిరుపై యవ్వలవ్వలఁ దిరుగుచుండేటివేళఁ
దిరిగినట్లనుండు దిక్కులెల్లాను
సిరుల సంసారభ్రమఁ జిక్కిన జీవునికిని
పరగ నైహికమే పరమై తోఁచు
    
చ. 2: సొగసి యద్దమునీడ చూచినవేళఁ దనకు
మగుడ వేఱొకరూపు మతిఁ దోఁచును
తగిలి యిట్లానేపో తనుఁదా నెఱఁగకున్న
నిగిడిన పుట్టువులు నిజమై తోఁచు
    
చ. 3: కదిసిన సకలాంధకార మంతటాఁ గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపు శ్రీవేంకటేశుఁడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోఁచు

రేకు: 0113-04 లలిత సం: 02-076 వైరాగ్య చింత

పల్లవి: అవి యటు భావించినట్లాను
కవగొని యిందుకుఁ గలఁగరు ఘనులు
    
చ. 1: అరయఁగ నేఁబదియక్షరములె పో
ధరలోపల నిందాస్తుతులు
సరిఁ బురాణములు శాస్త్రవేదములు
యిరవుగ నిన్నియు నిందే పొడమె
    
చ. 2: వొక్క దేహమున నున్నయంగములు
పెక్కువిధములై బెరసినవి
చిక్కులఁ గొన్నిటి సిగ్గుల దాఁతురు
యెక్కువ యతులకు నిన్నియు సమము
    
చ. 3: అంతరాత్మలో నంతర్యామై
బంతులఁ దిరిగేటి బంధువులు
చింతింప నతఁడే శ్రీవేంకటేశ్వరుఁ-
డింతకుఁ గర్తని యెంతురు బుధులు

రేకు: 0113-05 మాళవి సం: 02-077 శరణాగతి

పల్లవి: బలువుఁడు హరిఁ జేపట్టితిని
తలఁచినదెల్లా దక్కెను నాకు
    
చ. 1: దురితధ్వంసుఁడు దుఃఖవిదారుఁడు
అరిభయంకరుఁ డచ్యుతుఁడు
సిరివరుఁ డితనినిఁ జేకొని కొలిచిన
పరమసుఖమెపో భయ మెక్కడిది
    
చ. 2: దానవాంతకుఁడు దైవశిఖామణి
మానరక్షకుఁడు మాధవుఁడు
నానాముఖముల నాపాలఁ గలఁడు
యేనెపముల నా కెదురే లేదు
    
చ. 3: అనయము నిర్మలుఁ డఖిలానందుఁడు
ఘనుఁ డీశ్రీవేంకటవిభుఁడు
కనుకొని మము నిటు గాచుక తిరిగీ
యెనయఁగ నేలికె యితఁడే మాకు

రేకు: 0113-06 దేవగాంధారి సం: 02-078 వైరాగ్య చింత

పల్లవి: మేలు లేదు తీలు లేదు మించీనిదే హరిమాయ
కాలమందే హరిఁ గంటి కైవల్య మొకటే
    
చ. 1: సురలును జీవులె నసురలును జీవులె
ధర నిందుఁ బ్రకృతిభేదమే కాని
సురలకు స్వర్గ మసురలకు నరకము
పరగ నీరెంటిగతి పాపపుణ్యములే
    
చ. 2: పొలఁతులు జీవులే పురుషులు జీవులే
తలఁప భావభేదములే కాని
బలిమి స్వతంత్రముఁ బరతంత్ర మొకరికి
యెలమి విందులోఁ జెల్లే హీనాధికములే
    
చ. 3: రాజులును జీవులే రాసిబంట్లు జీవులే
వోజతో సంపద చెల్లేదొకటే వేరు
సాజపు శ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి
బాజుఁ గర్మ మొండొకటి బంధమోక్షములు