తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 109
రేకు: 0109-01 దేసాక్షి సం: 02-049 అధ్యాత్మ
పల్లవి: ఏవీ నుపాయాలుగావు యెక్కువ భక్తేకాని
దావతిఁ బడక యిది దక్కితే సులభము
చ. 1: ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి
దంటవాయువు గెలువఁ దలచేదెల్లా
వెంటిక వట్టుకపోయి వెఁస గొండ వాఁకుట
వెంటఁ గర్మమార్గమున విష్ణుని సాధించుట
చ. 2: యేనుగుతోఁ బెనఁగుట యిల నిరాహారియై
కానని పంచేంద్రియాలఁ గట్టఁబోవుట
నానించినుపగుగిళ్ళు నములుట బలిమిని
ధ్యానించి మనఁసుఁబట్టి దైవము సాధించుట
చ. 3: దప్పికి నెండమావులు దాగ దగ్గరఁబోవుట
తప్పుఁ జదువులలోఁ దత్త్వము నెంచుట
పిప్పి చవి యడుగుట పెక్కు దైవాలఁ గొలిచి
కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట
రేకు: 0109-02 శంకరాభారణం సం: 02-050 వేంకటగానం
పల్లవి: అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు
యిప్పుడిట్టిమహిమల నెక్కుడాయ నీతఁడు
చ. 1: చేకొని తొలితొలుతే చేసిన పన్నీరుకాపు
జోకఁ గాలువలై సొరిది జార
సైకపునీలాద్రినుండి జలజల బారేటి-
రేకల సెలయేరులరీతి నున్న దిదివో
చ. 2: తెప్పలుగా గుప్పినట్టి తెల్లని కప్పురకాపు
చిప్పిలుచు వెన్నెలలై చిందఁగాను
పుప్పొడిఁదోఁగిన కల్పభూజము నిలుచున్న-
చొప్పున నున్నాఁడిదివో సొంపులు మీరుచును
చ. 3: పొందుగ నంతటిమీఁదఁ బూసిన పునుగుకాపు
కందువ మాణిక్యముల గనియైనట్టు
అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ
చెంది యరతఁ గట్టఁగా శ్రీవిభుఁడై నిలిచె
రేకు: 0109-03 మలహరి సం: 02-051 శరణాగతి
పల్లవి: ఏమి సేసే మిఁక నేము యెంతని దాఁచుకొందుము
నీమహిమ యింతంతననేరము నేమయ్యా
చ. 1: అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే
పొందిన పాతకమెల్లాఁ బొలిసిపోయ
మందలించి మఱి యొకమాటు నుడిగిన ఫల-
మందు నీ కప్పగించితి మదిగోవయ్యా
చ. 2: యిట్టె మీకు రెండుచెతులెత్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండము వెట్టిన ఫల-
మట్టె నీమీఁద నున్నది అదిగోవయ్యా
చ. 3: సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున
సిరులఁ బుణ్యుఁడనైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుఁడనైన ఫల-
మరయ నీమీఁద నున్న దదిగోవయ్యా
రేకు: 0109-04 సాళంగం సం: 02-052 వైష్ణవ భక్తి
పల్లవి: ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము
తక్కక శ్రీపతి నీవే దయఁజూతు గాక
చ. 1: కాదనఁగ నెట్టువచ్చు కన్నులెదిటి లోకము
లేదనఁగ నెట్టువచ్చు లీలకర్మము
నీదాసుఁడ ననుచు నీమరఁగు చొచ్చుకొంటే
యేదెసనైనాఁ బెట్టి యీడేరింతు గాక
చ. 2: తోయ నెట్టువచ్చు మించి తొలఁకేటి నీమాయ
పాయ నెట్టువచ్చుఁ యీభవబంధాలు
చేయార నిన్నుఁ బూజించి చేరి నీముద్రలు మోఁచి
యీయెడ నుండఁగా నీవే యీడేరింతు గాక
చ. 3: తెలియఁగ నెట్టువచ్చు ద్రిష్టమైన నీమహిమ
తలచఁగ నెట్టువచ్చు తగు నీరూపు
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండఁగా
యిలఁమీద మమ్మునీవే యీడేరింతు గాక
రేకు: 0109-05 శుద్ధవసంతం సం: 02-053 భగవద్గీత కీర్తనలు
పల్లవి: పురుషోత్తముఁడ నీవు పురుషాధముఁడ నేను
ధరలో నాయందు మంచితన మేది
చ. 1: అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయిన దయ అది నీది
నిను నెఱఁగకుండేటి నీచుగుణము నాది
నను నెడయకుండే గుణము నీది
చ. 2: సకలయాచకమే సరుస నాకుఁ బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నాకెప్పుడూను
వెకలివై ననుఁ గాచేవిధము నీది
చ. 3: నేరమింతయును నాది నేరుపింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి శ్రీవేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
రేకు: 0109-06 గుండక్రియ సం: 02-054 అధ్యాత్మ
పల్లవి: నారాయ ణాచ్యుతానంత గోవిందా
నేరరాదు విజ్ఞానము నీ వియ్యక లేదు
చ. 1: నిగమాంతవిదులై తే నిన్నెఱుఁగుదురు గాక
మృగసమానులకేల మీమీఁది భక్తి
వెగటుగాఁ గృపతోడ విశ్వరూపు చూపినాను
పగటు దుర్యోధనుఁడు బహురూప మనఁడా
చ. 2: చిరపుణ్యులైతే మీ సేవలు సేతురు గాక
దురితచిత్తులకు మీత్రోవ యేఁటికి
గరిమఁ బ్రత్యక్షమై కంబములోఁ గలిగినా
హిరణ్యకశిపుఁడు మిమ్మెంచి శరణనెనా
చ. 3: దేవతలయితే మిమ్ముఁ దెలియనేర్తురు గాక
యేవల నసురులు మిమ్మెఱిఁగేరా
శ్రీవేంకటాద్రిమీఁద సిరితో నీ వుండఁగాను
కేవల సంసారు లెఱిఁగియును మఱవరా