తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 108

వికీసోర్స్ నుండి

రేకు: 0108-01 లలిత సం: 02-043 భక్తి

పల్లవి: ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు
    
చ. 1: పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిఁగిన యెదుటనె వున్నది
వరుసల మఱచినవారికి మాయ
    
చ. 2: వేదాంతసారము విష్ణుభక్తి యిది
ఆదిమునుల మత మయినది
సాదించువారికి సర్వసాధనము
కాదని తొలఁగిన గడుశూన్యంబు
    
చ. 3: చేతినిధానము శ్రీవేంకటపతి
యేతలఁ జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము

రేకు: 0108-02 ధన్నాసి సం: 02-044 హరిదాసులు

పల్లవి: హరిదాసులతోడ నల్పులు సరెనరాదు
గురుఁడు శిష్యుడుననే గుఱి దప్పుఁగానా
    
చ. 1: కోరి ముత్యపుఁజిప్పలఁ గురిసిన వానయు
సారెఁ బెంకులలో వాన సరియౌనా
శ్రీరమణుఁ డిన్నిటానుఁ జేరియుంటేనుండెఁ గాక
సారెకుఁ బాత్రాపాత్రసంగతింతా లేదా
    
చ. 2: మలయాద్రి మాఁకులును మహిమీఁది మాఁకులును
చలమున నెంచిచూడ సరియౌనా
అలరి దేవుఁడు అంతర్యామియైతేనాయఁ గాక
తెలియఁగ క్షేత్రవాసి దిక్కులందు లేదా
    
చ. 3: అమరుల జన్మములు నసురల జన్మములు
జమళిఁ బుట్టినంతలో సరియౌనా
అమరి శ్రీవేంకటేశుఁ డాతుమైతేనాయఁ గాక
తమితో నధికారిభేదములు లేవా

రేకు: 0108-03 దేసాళం సం: 02-045 వైరాగ్య చింత

పల్లవి: నే ననఁగా నెంతవాఁడ నెయ్యపుజీవులలోన
యీనెపాన రక్షించీ నీశ్వరుఁడే కాక
    
చ. 1: యెవ్వరు బుద్ధిచెప్పిరి యిలపైఁ జీమలకెల్లా
నెవ్వగఁ బుట్టల గొల్చు నించుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలోఁ
దవ్వించి తలకెత్తే యంతర్యామేకాక
    
చ. 2: చెట్టుల కెవ్వరు బుద్ధిచేప్పేరు తతికాలానఁ
బుట్టి కాచి పూచి నిండాఁ బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని
తిట్టపెట్టి రచించిన దేవుఁ డింతేకాక
    
చ. 3: బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు
తిద్ది చన్నుదాగి పూరి దినుమని
పొద్దువొద్దులోన నుండి భోగములు మఱపిన-
నిద్దపు శ్రీవేంకటాద్రినిలయుండే కాక

రేకు: 0108-04 రామక్రియ సం: 02-046 వైరాగ్య చింత

పల్లవి: తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
యిల నొకమాట నీ కెత్తిచ్చితిఁగాని
    
చ. 1: పుట్టించేవాఁడవు నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే
యెట్టున్నా నపరాధా లేవి మాకు
అట్టూ నన్నవారముగా మనఁగా నీచిత్తమెట్టో
కిట్టి వొకమాట మడిగితి నింతేకాని
    
చ. 2: మనసులోపల నీవే మరి వెలుపల నీవే
యెనసి అపరాధాలు యేవి మాకు
నిను నౌఁగాదనలేము నీ సరివారముఁ గాము
అనవలసినమాట అంటి మింతే కాని
    
చ. 3: అంతరాత్మవును నీవే అన్నిటాఁ గావఁగ నీవే
యెంతైనా నపరాధా లేవి మాకు
వింత లేక శ్రీవేంకటవిభుఁడ నీబంట నింతే
వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని

రేకు: 0108-05 సాళంగనాట సం: 02-047 దశావతారములు

పల్లవి: నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు
చాయల నీసుద్ది విని శరణంటి నేను
    
చ. 1: కావలనంటేఁ దొల్లి కంభము చించుకవెళ్లి
కైవశమై ప్రహ్లాదుఁ గావవా నీవు
తేవలనంటే బ్రహ్మదేవునికి వేదములు
సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు
    
చ. 2: పట్టియెత్తవలెనంటేఁ బాతాళానఁ బడ్డ కొండ
తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు
మట్టుపెట్టవలెనంటే మరి భూమి చాపగాఁగ
చుట్టుకపోతేఁ దెచ్చి సొంపుగ నిలుపవా
    
చ. 3: పక్షపాతమయ్యేనంటేఁ బాండవుల గెలుపించి
యీక్షితి యేలించి చనవియ్యవా నీవు
రక్షించేనంటేఁ గాతరాన శ్రీవేంకటాద్రిఁ బ్ర-
త్యక్షమై మావంటివారిఁ దగఁ గరుణించవా

రేకు: 0108-06 సామంతం సం: 02-048 కృస్ణ

పల్లవి: అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు
యిందుముఖులఁ గూడినాఁ డీతఁడానాఁడు
    
చ. 1: యిందరూ నేఁటేఁట జేసే యింద్రయాగపు ముద్దలు
అందుకొని యారగించినాతఁడా వీఁడు
చెంది మునులసతుల సతఁ దెప్పించుక మంచి-
విందు లారగించినాఁడు వీఁ డానాఁడు
    
చ. 2: తొలుత బ్రహ్మ దాఁచిన దూడలకు బాలులకు
అలరి మారు గడించినాతఁడా వీఁడు
నిలుచుం డేడుదినాలు నెమ్మది వేలఁ గొండెత్తి
యిల నావులఁ గాచినాఁ డీతఁ డానాఁడు
    
చ. 3: బాలుఁడై పూతనాదుల బలురక్కసులఁ జంపి
ఆలరి యాటలాడిన యాతఁడా వీఁడు
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాఁడు తొలుతే
యేలెను బ్రహ్మాదుల నీతఁ డానాఁడు