Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 107

వికీసోర్స్ నుండి

రేకు: 0107-01 సాళంగనాట సం: 02-037 ఉపమానములు

పల్లవి: ఆమీఁది నిజసుఖ మరయలేము
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా
    
చ. 1: మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా
    
చ. 2: బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా
    
చ. 3: బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా

రేకు: 0107-02 దేసాక్షి సం: 02-038 అధ్యాత్మ

పల్లవి: దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో
కావించి గంటగటుక(???) కాచుకుండే విదివో
    
చ. 1: వెదక నావసమా వేగుదాఁకా నిన్ను నేను
కదిసి నీమూరితి కాన వసమా
యెదుట శంఖుచక్రాల యెట్టిదైవమ నేనని
పొదుగుచు నీకు నీవే పొడచూపేవు గాక
    
చ. 2: పొగడ నావసమా పురుణించి నీగుణాలు
తగుల నావసమా నీతలఁపెఱిగి
నిగడి వేదశాస్త్రాల నిన్ను నీవే చెప్పుకొని
పగటు మాయజ్ఞానము పాపేవింతే కాక
    
చ. 3: కొలువ నావసమా గుఱుతెఱిఁగి నీవెంట
చెలఁగి నాచేతులఁ బూజించ వసమా
నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి
మలసి పెరరేఁపుచు మన్నించేవు గాక

రేకు: 0107-03 కన్నడగౌళ సం: 02-039 వైరాగ్య చింత

పల్లవి: నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ
అన్నిటా రక్షించకపో దంతర్యామి
    
చ. 1: సొమ్మువో వేసినవాఁడు చుట్టిచుట్టి వీథులెల్లా
కమ్ముక వెదకీనట కన్నదాఁకాను
నమ్మిన అజ్ఞానములో నన్నుఁ బడవేసుకొని
అమ్మరో వూరకుందురా అంతర్యామి
    
చ. 2: వోడ బేరమాడేవాఁడు వొకదరి చేరిచి
కూడిన యర్థము గాచుకొనీనట
యీడనే ప్రపంచములో నిట్టె నన్ను దరిచేర్చి
వోడక కాచుకోరాదా వో యంతర్యామి
    
చ. 3: చేరి పుప్పమ్మేవాఁడు చిట్లు వేఁ గనఁడట
వూరకే శ్రీవేంకటేశ వోపికతోడ
ఆరయ నన్నుఁ బుట్టించినట్టివాఁడవు నాభార-
మేరీతినైన మోపు మిఁక సంతర్యామి

రేకు: 0107-04 భూపాళం సం: 02-040 వైరాగ్య చింత

పల్లవి: హరివారమైతిమి మ మ్మవుఁగాదనఁగరాదు
తరముగా దిఁకను మాతప్పులు లోఁగొనరో
    
చ. 1: వెన్నడించి సూడువట్టే విష్ణుమాయ నీకు నేము
యిన్నిటాఁ బంతమిచ్చేము యింకఁ గావరో
నన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు
మున్నె కిందుపడితిమి ముంచి దయఁజూడవో
    
చ. 2: ఆడించేటి కామక్రోధాది జూజరులాల
వోడితిమి మీకుఁ దొల్లె వొరయకురో
వీడని కర్మము నీకు వెఱచి పూరి గఱచే-
మీడనే ధర్మదార మా కిఁకనైనాఁ బట్టవో
    
చ. 3: దక్కఁగొన్న మాలోని తనుభోగములాల
మొక్కితిమి మాకుఁ గొంత మొగమోడరో
యెక్కువ శ్రీవేంకటేశు డేలే మాజన్మములాల
గక్కన వేఁడుకొంటిమి కపటాలు మానరో

రేకు: 0107-05 బౌళి సం: 02-041 అంత్యప్రాస

పల్లవి: అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదులె సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
    
చ. 1: వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి
    
చ. 2: తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి
    
చ. 3: మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి

రేకు: 0107-06 లలిత సం: 02-042 వైరాగ్య చింత

పల్లవి: తుద సమస్తమును దుర్లభమే
అదె సులభుఁడు మాహరి యొకఁడే
    
చ. 1: సురలును నరులును సొంపగు సిరులును
వొరసిన నిన్నియు నుపాధులే
నిరుపాధికుఁడును నిజకరుణానిధి
అరయఁగ నిదె మాహరి యొకఁడే
    
చ. 2: అందరియీవులు నఖిలకర్మములు
అందఁగరాని ప్రయాసములే
యిందిరారమణి నేచిన సేవిది
చెందరు సుజనులు చెప్పంగలదె
    
చ. 3: యితరోపాయము లేవి చూచినా
శ్రుతివిరహితములు శూన్యములే
రతి శ్రీవేంకటరమణునిమతి యిది
హితపరిపూర్ణం బిది యొకటే