తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 106
రేకు: 0106-01 శంకరాభరణం సం: 02-031 దశావతారములు
పల్లవి: ఇందుకేపో వెరగయ్యీ నేమందును
కుందులేని నీమహిమ కొనియాడఁగలనా
చ. 1: అటు దేవతల కెల్ల నమృతమిచ్చిన నీవు
యిటు వెన్నదొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు
సట రోలఁ గట్టువడ్డ చందాన కేమందును
చ. 2: కలిగి యాకరిరాజుఁ గరుణఁ గాచిన నీవు
యిల నావులఁ గాచుట కేమందును
తలఁప బ్రహ్మాదిదేవతలకుఁ జిక్కని నీవు
చెలుల కాఁగిళ్లకుఁ జిక్కితి వేమందును
చ. 3: భావించ నన్నింటకంటేఁ బరమమూ ర్తివి నీవు
యీవల బాలుఁడవై తి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును
రేకు: 0106-02 పాడి సం: 02-032 దశావతారములు
పల్లవి: వెన్నలు దొంగిలునాటి వెఱ్ఱివా నీవు
విన్నకన్నజాడ గాదు వెఱ్ఱివా నీవు
చ. 1: చేరి నిన్నునొల్లనట్టిజీవుల నీవుదరాన
వీరుఁడవై మోఁచేవు వెఱ్ఱివా నీవు
నారపేరు నుడిగితే నా పేరంటాఁ దగిలేవు
వీరానఁ జుట్టమవై వెఱ్ఱివా నీవు
చ. 2: బంటులైనవారికిఁ బరతంత్రుఁడవై యీ-
వెంటవెంట దిరిగేవు వెఱ్ఱివా నీవు
అంటే ననరాదు రెండుఅడుకులకే చొచ్చేవు
వింటే మాకు నవ్వువచ్చీ వెఱ్ఱివా నీవు
చ. 3: పావనులయి లోకమెల్లా బదుకుమంటాఁ బేళ్లు
వేవేలు వెట్టుకొంటివి వెఱ్ఱివా నీవు
శ్రీవేంకటేశుఁడవై చెంది వరము లిచ్చేవు
వేవేగ నెవ్వరికైనా వెఱ్ఱివా నీవు
రేకు: 0106-03 రామక్రియ సం: 02-033 అధ్యాత్మ
పల్లవి: అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు
చ. 1: దేవుఁడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండఁగా
సోవల నాస్తికునకు శూన్యమై తోఁచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపు జీవునకు గతుగతుకే
చ. 2: హరి శరణంటేఁ గాచే అట్టియుపాయమే వుండఁగ
విరసానకుఁ గర్మమే వెగ్గళమాయ
పరగ నరులకెల్లాఁ బట్టపగలై యుండఁగా
అరయఁ గొన్ని జంతుల కంధకారమాయను
చ. 3: యిక్కడ శ్రీవేంకటేశుఁ డెదుటనే వుండఁగాను
అక్కటా మూఢున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైనఁ గోడికి
తెక్కులఁ దవ్వఁ బొయ్యేది తిప్పపెంటలే
రేకు: 0106-04 లలిత సం: 02-034 అంత్యప్రాస
పల్లవి: కరుణించు మిఁకనైన కాఁపురమా
కరికరిఁ బెట్టుకుమీ కాఁపురమా
చ. 1: కలలోని సుఖమైన కాఁపురమా
కలుషమే చవియైన కాఁపురమా
కలను బేహారపు కాఁపురమా
కలఁడు మా కిదే హరి కాఁపురమా
చ. 2: గంట వేఁటలో తగులు కాఁపురమా
కంట వత్తివెట్టి కాచే కాఁపురమా
గంటుగిందుగాఁ బొరలే కాఁపురమా
కంటిమి శ్రీపతికృప కాఁపురమా
చ. 3: కావిరి వెఱ్ఱి చేరాయి కాఁపురమా
కావలసినట్లయ్యే కాఁపురమా
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్ను నన్ను నొక్క-
కైవశము సేసెఁగదో కాఁపురమా
రేకు: 0106-05 పాడి సం: 02-035 అధ్యాత్మ
పల్లవి: వేసరకు వీఁడేల యనకుము విడువ నిన్నిఁక శరణు చొచ్చితి
నీసరెవ్వరు లేరు వెదకిన నిండుబండికిఁ జేటవేఁ గా
చ. 1: మీరు నాకుఁ గలరు నేనేమి సేసినఁ గాతురనియెడి-
ధీరతను జము సరకు గొనకే తివిరిఁ సేసితిఁ బాపము
వోరసేయుచు నెంతలేదని వూరకే మీరుంటిరేనియు
వారికినిఁ గొరగాను నే నెవ్వరిని నెఱఁగను మిమ్మేకాని
చ. 2: మిమ్ముఁ గొలిచిన గర్వమున నేమీఁ జేయక కాలమందే
నమ్మి కర్మములెల్ల మానితి నాకు నాకే వేసరి
దొమ్మి కోపక మీకు నాకును దూరమనుచుఁ బరాకుచేసిన
యిమ్ములను నన్నవియు రోసును యేల నాకవి నీవేకాక
చ. 3: నీకు మొక్కిన మందెమేళము నే నొక కొండ సేసుక
లోకముల దేవతలకెల్లను లోను వెలిగానైతి
యీకడను శ్రీవేంకటేశుఁడ యిప్పుడిటు ననుఁ గరుణఁజూచితి
చేకొనుచు వారె మెత్తురు చెలఁగి నీకింకరుఁడననుచు
రేకు: 0106-06 వరాళి సం: 02-036 అధ్యాత్మ
పల్లవి: ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా
చ. 1: నేను నిన్నుఁ గొలిచితిని నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీని
కానిలేని బంట్లఁ దేరకాండ్లు వెట్టిగొనఁగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా
చ. 2: పుట్టించినాఁడవు నీవు పుట్టినవాఁడను నేను
పట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాఁచితే
తట్టి నీవు వహించుకోఁదగదా సర్వేశ్వరా
చ. 3: యెదుట నీవు గలవు యిహములో నేఁ గలను
చెదరిన చిత్తమేల చిమ్మిరేఁచీని
అదన శ్రీవేంకటేశ అరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా