తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 110
రేకు: 0110-01 శంకరాభరణం సం: 02-055 వైరాగ్య చింత
పల్లవి: లేదు భయము మఱి కాదు భవము
ఆదియు నంత్యముఁ దెలిసిన హరియాజ్ఞే కాన
చ. 1: తలఁపులు గడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి
వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమఁ గలిగిన యాతఁడు
చెలఁగుచు పనులైనా సేసిన మరి యేమి
చ. 2: పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
నించిన దైవము నమ్మిన నిర్భరుఁడయిన యాతఁడు
యెంచుక యేవర్గంబుల నెట్టుండిన నేమి
చ. 3: వేగమె లోపల గడువక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీవేంకటపతి నెఱిఁగి సుఖించేటి యాతఁడు
జాగుల ప్రపంచమందును సతమైనా నేమి
రేకు: 0110-02 గుండక్రియ సం: 02-056 అధ్యాత్మ
పల్లవి: హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని
తరఁగు మొరఁగులను దాఁటలే రెవ్వరును
చ. 1: నిండుఁ జింతాజలధికి నీళ్లు దనచిత్తమే
దండి పుణ్యపాపాలే దరులు
కొండలవంటి కరళ్లు కోరికె లెందు చూచినా
తండుముండుపడేవారే దాఁటలే రెవ్వరును
చ. 2: ఆపదలు సంపదలు అందులోని మకరాలు
కాఁపురపు లంపటాలే కైయొత్తులు
చాపలపు గుణములే సరిఁజొచ్చే యేరులు
దాపుదండ చేకొని దాఁటలే రెవ్వరును
చ. 3: నెలవై వుబ్బుసగ్గులే నిచ్చలుఁబోటునుఁ బాటు
బలువైన యాశే బడబాగ్ని
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ
తలఁచి యితరులెల్ల దాఁటలే రెవ్వరును
రేకు: 0110-03 గౌళ సం: 02-057 దశావతారములు
పల్లవి: ఈతనిఁ గొలిచితేనే యిన్ని గొలలునుఁ దీరు
చేతనఁ బెట్టు పుణ్యాలు చేరువనే కలుగు
చ. 1: పట్టి కాళింగునిఁ దోలి పాముకొల దీర్చినాఁడు
బట్టబాయిటనే రేపల్లెవారికి
అట్టె పూతనఁ జంపి ఆఁడుఁగొల దీర్చినాఁడు
గట్టిగాఁ గృష్ణుఁడు లోకమువారికెల్లను
చ. 2: బలురావణుఁ జంపి బాఁపనకొల దీర్చినాఁడు
యిలమీఁదఁ గలిగిన ఋషులకెల్లా
కొలఁది మీరినయట్టి కోఁతికొల దీర్చినాడు
సొలసి రాఘవుఁ డదె సుగ్రీవునికిని
చ. 3: వొలిసి పురాలు చొచ్చి వూరఁగొల దీర్చినాఁడు
అల తనదాసులైన అమరులకు
సిలుగుఁగొలలు దీర్చి సేన వరా లిచ్చినాఁడు
చెలఁగి పరుషలకు శ్రీవేంకటేశుఁడు
రేకు: 0110-04 శ్రీరాగం సం: 02-058 వైరాగ్య చింత
పల్లవి: వివేకించ వేళ లేదు విజ్ఞానమార్గమందు
భవసంపదల పెద్దపౌఁజు చూచీ జీవుఁడు
చ. 1: చిత్తమనియెడి మహాసింహాసనం బెక్కి
హత్తి బహుపరాకాయ నదె జీవుఁడు
గుత్తపు దేహమనేటి కొలువుకూటములోన
జొత్తుఁ బ్రకృతినాట్యము చూచీని జీవుఁడు
చ. 2: పంచేంద్రియములనే బలుతేజీలపై నెక్కి
అంచల వయ్యాళి దోలీనదె జీవుఁడు
ముంచిన కర్మములనే ముద్రల పెట్టెలు దెచ్చి
సంచముగా లెక్కవెట్టి సరిదాఁచీ జీవుఁడు
చ. 3: యిచ్చఁ గామక్రోధాలనే హితమంత్రులునుఁ దారు
తచ్చి తలపోసుకొనీఁ దగ జీవుఁడు
అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండఁగా
పచ్చిగా నాతనిఁ జూచి భ్రమసీని జీవుఁడు
రేకు: 0110-05 సామంతం సం: 02-059 అధ్యాత్మ
పల్లవి: చెల్లఁబో తియ్యనినోరఁ జేఁదేఁటికి యీ-
పల్లదపుఁ గోరికలపాలు సేయవలెనా
చ. 1: ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నాపాలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా
చ. 2: పామరపు టింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్త్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటి సుఖములనే భ్రమయించవలెనా
చ. 3: గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుఁడవై యేలికవు
చొక్కి నామనసింత సోదించవలెనా
రేకు: 0110-06 భూపాళం సం: 02-060 దశావతారములు
పల్లవి: చూపఁ జెప్పగల భక్త సుజనుఁడవు మాకు
దాపైన హరి యిట్టె తప్పెఁ దారెననక
చ. 1: కోరి పాండవులయింటఁ గూర లారగించినట్టు
సారవు శబరివిందు చవిగొన్నట్టు
వూరకే మాయింట నీవు వొదవినపాటి నీ-
వారగించవయ్య చవు లౌఁగాములెంచక
చ. 2: తొల్లియు రేపల్లె గొల్లదోమటి దొడికినట్టు
తల్లి అనసూయ పాలఁ దనిసినట్టు
చిల్లరైన మాయింటఁ జేసిన పా టారగించు
చల్లతోడి బోనమైన చాలుఁ జాలదనక
చ. 3: అంకెల శ్రీవేంకటాద్రి నారగించినయట్టు
కొంకులేక సిరితోడఁ గోనేటిరాయ
లెంకనయిన నాయింటిలేశమైన నారగించు
అంకించి నీనాలోని అంతరము లెంచకా