తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 97
రేకు: 0౦97-01 లలిత సం; 01-483 వైరాగ్య చింత
పల్లవి:
అమ్మెడి దొకటి అసిమలోదొకటి
బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా
చ.1:
సంగము మానక శాంతియుఁ గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేఁటి పెద్దలముయ్యా
చ.2:
కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువ మనసు
క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు
పేరడి నేమిటి పెద్దలమయ్యా
చ.3:
ఫలము లందితే బంధము వీడదు
ఫలముతో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశు దాసులము
పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా
రేకు: 0౦97-02 అలిత సం: 01-484 అంత్యప్రాస
పల్లవి:
అటువంటివాఁడువో హరిదాసుఁడు
అటమటాలు విడిచి నాతఁడే సుఖి
చ.1:
తిట్టేటిమాటలును దీవించేమాటలును
అట్టే సరెని తలఁచి నాతఁడే సుఖి
పట్టి చంపేవేళను పట్టము గట్టే వేళ
అట్టు నిట్టు చలించనిల యాతడే సుఖి
చ.2:
చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినాను
ఆరగించి తనివొందే యతఁడే సుఖి
తేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టముల
నారయ సరిగాఁజూచే యాతడే సుఖి
చ.3:
పాంది పుణ్యము వచ్చి పారిఁ బాపము వచ్చిన-
నందలి ఫలమొల్లని యాతడే సుఖి
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరి
అందరానిపద మందననాతఁడే సుఖి
రేకు: 0097-03 గుండక్రియ సం; 01-485 వైరాగ్య చింత
పల్లవి:
ఎవ్వరు గ ర్తలు గారు యిందిరానాథుఁడే కర్త
నివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో
చ.1:
కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదు
అర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదు
మర్మపుమాయ గర్తఅయితే మరి విజ్ఞానమే లేదు
నిర్మితము హరి దింతే నిజమిదెఱఁగరో
చ.2:
ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవు
వుపమ మనసు గర్తైఉంటే నాచారమే లేదు
కపటపు దేహములే కర్తలయితే చావు లేదు
నెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో
చ.3:
పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదు
అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి
నిలయపుహరి యింతే నేఁడే కొలువరో
రేకు: 0097-04 బౌళి సం: 01-486 అధ్యాత్మ
పల్లవి:
ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయ
తెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు
చ.1:
అనిశమును దేహమును కన్న పానము లిడిన
యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో
గొనకొన్న మానినుల కూటముల సుఖము లివి
మనసుదాటినపాలు మట్టులేదెపుడు
చ.2:
వొడలఁబెట్టినసామ్ము లొగిఁ దనకుఁ గానరా-
వడవిఁ గాసినవెన్నె లది కన్నులకును
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే
బెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట
చ.3:
చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు
యెద్దుయెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలో
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె
రేకు:0౦97-05 భైరవి సం: 01-487 భగవద్గీత కీర్తనలు
పల్లవి:
నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు
భావించలేనివారిపాప మింతేకాని
చ.1:
పరమపద మొసఁగి పాపమడంచేనని
చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె
నిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదు
పరగ నమ్మనివారిపాప మింతేకాని
చ.2:
నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని
యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత
దాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచి
పైపై నమ్మనివారిపాప మింతే కాని
చ.3:
బంతిఁ బురాణములను భక్తసులభుఁడ నని
అంతరాత్మ వీమాట అడితివి తొలుతనే
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు
పంతాన నమ్మనివారిపాప మింతేకాని
రేకు: 0097-06 బౌళి సం: 01-488 వైరాగ్య చింత
పల్లవి:
కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ
పాయక తిరిగాడేరు పాపపుతలారులు
చ.1:
కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగాను
దీము గోపపుప్రధాని దిక్కు లేలీని
కోమలపుజ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడ
గామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో
చ.2:
చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టి
యిత్తలవిషయములు యెన్నికిచ్చిరి
తుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చె
జొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టు గులు
చ.3:
బలుసంసారమనేటిభండారము ఘనమాయ
కలదీగి జవ్వనపుకై జీతము
యిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటి
బలువుని రాజుఁజేసి పాలించె నన్నును