తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 98

వికీసోర్స్ నుండి


రేకు: 0098-01 సాళంగనాట సం; 01-489 వైరాగ్య చింత

పల్లవి:
అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము
మట్టుపడితే శాంతము మఱి యేలా

చ.1:
జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ
బడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపము
వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా

చ.2:
ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొక్కవేళ
మేరలేని చీకటియై మించును దుఃఖములెల్లా
వూరట లేనికర్మికి నొక్కొక్కవేళా

చ.3:
పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ
యెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకా
వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా


రేకు: ౦098-02 శంకరాభరణం సం; 01-490 భక్తి

పల్లవి:
నెరవాది సాహసులు నిత్యశూరులు
దురితవిదూరులు ధ్రువాదులు

చ.1:
తక్కక శ్రీహరిభక్తితాపలు సేసి యెక్కిరి
చక్కఁగా వైకుంఠము సనకాదులు
వొక్కట విష్ణుకథలు వోడసేసుక దాఁటిరి
పెక్కుసంసారజలధి భీష్మాదులు

చ.2:
కడువిరక్తియనేటికత్తులనే నరకిరి
నడుమ భవపాశముల నారదాదులు
బడినే హరిదాసులపౌఁజుల గూడుకొనిరి
నుడివడ కిహమందే శుకాదులు

చ.3:
పరమశాంతములనే పట్టపేనుగులమీద
వరుసల నేఁగేరు వ్యాసాదులు
సిరుల శ్రీవేంకటేశుఁ బేరి సుఖముఁ బొందిరి
బెరసి దాస్యమున విభీషణాదులు

రేకు: 0098-03 గుజ్జరి సం: 01-491 వైరాగ్య చింత


పల్లవి: సంసారినై ననాకు సహజమే
కంసారి నే నిందుకెల్లా గాదని వగవను
    
చ. 1:
    నరుఁడనైననాకు నానాసుఖదుఃఖములు
సరి ననుభవించేది సహజమే
హరిని శరణాగతులైనమీఁద బరాభవ-
మరయ నిన్నంటునని అందుకే లోగేను
    
చ. 2:
    పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాఁడ
జట్టిగాఁ గట్టువడుట సహజమే
యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట
పట్టు వోయీనోయని పంకించే నే నిపుడు
    
చ. 3:
మాయకులోనైననాకు మత్తుఁడనై యిన్నాళ్లు
చాయకు రానిదెల్లా సహజమే
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
మోయరానినేను నీకు మోపని వీఁగేను

రేకు: 0098-04 సామంతం సం: 01-492 వైరాగ్య చింత


పల్లవి: ఇహమునుఁ బరమును యిందే వున్నవి
వహికెక్కఁ దెలియువారలు లేరు
    
చ. 1:
    చట్టువంటి దీచంచలపు మనసు
కొట్టులఁబడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించినఁ గరఁగదు
పట్టఁబోయితే పసలేదు
    
చ. 2:
    చిగురువంటి దీజీవశరీరము
తగుళ్లు పెక్కులు తతి లేదు
తెగనిలంపటమే దినమునుఁ బెనచును
మొగము గల దిదే మొనయును లేదు
    
చ. 3:
గనివంటిది యీఘనసంసారము
తనిసితన్పినాఁ దగ లేదు
ఘనుడఁగు శ్రీవేంకటపతి గావఁగ
కొనమొద లేర్పడె కొంకే లేదు


రేకు: 0098-05 సాళంగం సం: 01-493 అంత్యప్రాస

పల్లవి:
    నేరిచిబ్రదికేవారు నీదాసులు
నేరమిఁ బాసినవారు నీదాసులు
    
చ. 1:
    కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి-
నేమము వట్టినవారే నీదాసులు
దోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగాఁనే
నీమాయ గెలిచినారు నీదాసులు
    
చ. 2:
    కిక్కిరించిన యాసలఁ గిందవేసి మోక్షము
నిక్కి నిక్కి చూచేవారు నీదాసులు
వెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేక
నెక్కొన్న మహిమవారు నీదాసులు
    
చ. 3:
    అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి
నెట్టుకొని మించినారు నీదాసులు
యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా
నెట్టువడఁ దోసినారు నీదాసులు

రేకు: 1998-06 ముఖారి సం: 01-494 ఉపమానములు

పల్లవి:
    ఇందిరాపతిమాయలు యింతులు సుండీ
మందలించి హరి గొల్చి మనుదురుగాని
    
చ. 1:
    అతివలచూపులే ఆయాలు దాఁకీఁ జుండీ
జితమైనపులకల జిల్లులౌఁజుండీ
రతిపరవశములు రాఁగినమూర్ఛలు సుండీ
మతిలోఁ దప్పించుక మనుదురుగాని
    
చ. 2:
    మెఱయించేచన్నులే మించుఁబెట్లుగుండ్లు సుండీ
మెఱుఁగువమోవులే మచ్చు మేపులు సుండీ
మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ
మఱవక తప్పించుక మనుదురుగాని
    
చ. 3:
    బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ
వెలలేనివలపులు విషము సుండీ
యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱఁగు చొచ్చి
మలయుచు సొలయుచు మనుదురు గాని