తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 90
రేకు: ౦౦9౦-౦1 సాళంగం సం; 01-441 భక్తి
పల్లవి:
ఉన్నవిచారములేల వోవో సంసారులాల
యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో
చ.1:
తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరు
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు
చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో
చ.2:
భవరోగవైద్యుని పాదములు సేవించి
భువి రోగములఁ బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైన వానిఁ
గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో
చ.3:
తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే
యెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో
రేకు: 0౦9౦-౦2 మలహరిసం 01-442 వైష్ణవ భక్తి
పల్లవి:
కలిగినది యొక్కటే కమలాపతిసేవ
తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను
చ.1:
హరియే పరతత్వ మతఁడొక్కఁడే గతి
ధరలోన దేవతలెందరైనాఁ గలుగనీ
మురహరనామము ముంచి యొక్కటే యొక్కుడు
యిరవైనమంత్రము లెన్నియైనా నుండనీ
చ.2:
గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలో
వేవేలు పెద్ద లటు వేలసంఖ్య లుండనీ
కైవసపువిష్ణుకైంకర్యమే సాధనము
యీవలనావల పుణ్య మెంతైనాఁ గలుగనీ
చ.3:
పట్టినశ్రీవేంకటేశుభక్తి యొక్కటే ఘనము
యిట్టే శాస్త్రజ్లాన మెట్లున్నాను
వొట్టిన యాతని ముద్ర లొక్కటికి మూలము
యెట్టిలాంఛనము లీల నెన్నియైనా నుండనీ
రేకు: 0090-03 సామంతం సం: 01-443 నృసింహ
పల్లవి:
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు
చ.1;
మేఁటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు
గాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీఁటైనగురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు
బాటసంసారముకంటే పగ లేదు
చ.2:
పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు
హరిదాసుడౌకంటే నట గతి లేదు
చ.3:
కర్మసంగము మానుకంటే దేజము లేదు
అర్మిలిఁ గోరకమానేయంతకంటే బుద్ధి లేదు
ధర్మపుశ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి
నిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు
రేకు: 0090-04 గుజ్జరి సం: 01-444 వైష్ణవ భక్తి
పల్లవి:
ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టియింతయును హరిమూలము
చ.1:
కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁదామే
ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల
సారేకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము
చ.2:
కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకది
యిమ్ముల మోక్షము యీరితులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదననవుననరాదెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము
చ.3:
సరి నెఱఁగుదుమూ పోయినజన్మము సారేకు నేమేమిచేసితిమా
యిరవుగ నట్లా మీదఁటిజన్మముయెఱుకలు మఱపులు యిఁకనేలా
నిరతమై శ్రీవేంకటేశుఁడు తనయిచ్చ నిర్మించిన దిదియీదేహము
గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి
రేకు: 0090-05 గుజ్జరి సం: 01-445 అధ్యాత్మ
పల్లవి:
దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు
శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే
చ.1:
జనని నీమాయా జనకుఁడవు నీవు
జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము
వొనరెడి దినభోగములు వూరేటిచనుబాలు
మునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో
చ.2:
ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు
వురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలు
మరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివి
నిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా
చ.3:
చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములు
భావపుటారంభంబులు బాలలీలగతులు
కైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిది
మావంటివారికెల్లను నీమన్ననలాలనలు
రేకు: 0090-06 పాడి సం: 01-446 గురు వందన, నృసింహ
పల్లవి:
మఱియు మఱియు నివె మాపనులు
మెఱసితి మిందే మిక్కిలిని
చ.1:
నారాయణునకు నమస్కారము
ధారుణీపతికిని దండము
శ్రీరమణునకును జేరి శరణ్యము
వారిధిశాయికి వరుస జోహారు
చ.2:
రామకృష్ణులకు రచనలబంటను
దామోదరునకు దాసుఁడను
వామనమూర్తికి వాకిటిగొల్లను
సోమర్శనేత్రునిసొరిదిలెంకను
చ.3:
గోవిందునికే కొలువులు సేతుము
దేవొ త్తముబడిఁ దిరుగుదుము
భావజగురునకు పంపునడతుము
శ్రీ వేంకటపతి సేవింతుము