తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 91

వికీసోర్స్ నుండి


రేకు: 0091-01 శ్రీరాగం సం; 01-447 ఉపమానములు


పల్లవి:
తప్పఁ దోయవే దైవశిఖామణి
యిప్పుడు నీకృప నెనసితి నేను

చ.1:
అనలముఁ బొడగని యటునిటు మిడుతలు
కినిసి యందు మగ్గినయట్లు
అనువగువిజ్ఞాన మాత్మ వెలుఁగఁగ
మొనసి యింద్రియములు మూఁగీ నాకు

చ.2:
అఱిముఱిఁ గమలము లటు వికసించిన
మెఱసి తుమ్మిదలు మించుగతి
తఱి నాహృాదయము తగవికసించిన
తఱమీ నజ్ఞానతమ మది నాకు

చ.3:
యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియు
నూరకే యుండఁగా నొదిఁగియుండె
నేరిచి నీభక్తి నిలుపఁగ మదిలో
చేర గతిలేక చిమిడీ నదివో


రేకు: 0091-02 రామక్రియ సం: 01-448 మంగళ హారతులు


పల్లవి:
మరలి మరలి జయమంగళము
సారిది నిచ్చలును శుభమంగళము

చ.1:
కమలారమణికి గమలాక్షునకును
మమతల జయజయమంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహర్తముతో శుభమంగళము

చ.2:
జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభంమంగళము
కలిమికాంత కాకలికివిభునికిని
సుళువులయారతి శుభమంగళము

చ.3:
చిత్త జుతల్లికి శ్రీవేంకటపతికి
మత్తిల్లిన జయం మంగళము
యిత్తలనత్తల యిరువురకాఁగిటి
జొత్తులరతులకు శుభమంగళము


రేకు: 0091-03 మాళవిగౌళ సం: 01-449 అథ్యాత్మ


పల్లవి:
చదువులోనే హరిని జట్టిగొనవలెఁగాక
మదముగప్పినమీద మగుడ నది గలదా

చ.1:
జడమతికి సహజమే సంసాయాతన యిది
కడు నిందులోఁ బరము గడియించవలెఁగాక
తొడరి గాలప్పుడు తూర్చెత్తక తాను
విడిచి మఱచిన వెనక వెదకితేఁ గలదా

చ.2:
భవబంధునకు విధిపాపపుణ్యపులంకె
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెఁగాక
అవల వెన్నెలోనె అల్లు నేరేళ్లింతే
నివిరి నిన్నటివునికి నేఁటికిఁ గలదా

చ.3:
దేహధారికిఁ గలదే తెగనియింద్రియబాధ
సాహసంబున భక్తి సాధించవలెఁగాక
యీహలను శ్రీవేంకటేశుదాసులవలన
వూహించి గతిగానక వొదిఁగితేఁ గలదా


రేకు: ౦091-04 లలిత సం: 01-450 వైరాగ్య చింత


పల్లవి:
కలది గలట్టే కర్మఫలంబులు
నిలిపతిమా నేము నిమ్మకు బులుసు

చ.1:
యెంత సేసినా యిహమున జీవికి
చెంత నజుఁడు వ్రాసిన కొలఁదే
వంతల ముంటికి వాఁడి వెట్టితిమూ
కొంతతీపు చెఱకుకుఁ జల్లితిమా

చ.2:
ఘనముగ బుద్దులు గఱపిన దేహికి
మును నోఁచిన నోముఫలంటే
నినుపుఁ దెంకాయకు నీరు నించితిమూ
వొనర వేమునఁ జేఁదు నిచితిమా

చ.3:
యిరవుగ శ్రీవేంకటేశుఁడే ప్రాణికి
కెరలి భాగ్య మొసఁగినయంతే
మరువమునకు బరిమళము సేసితిమా
పెరిగేటి యడవులు పెంచితిమా


రేకు: 0091-05 లలిత సం; ౦1-451 వైరాగ్య చింత


పల్లవి:
వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా
నలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు

చ.1:
జీవము నిర్దివముగాక సిద్దించదు పరము
వావులెల్ల నొకవావిగాక మఱీ వదలదు ప్రపంచము
భావంబెల్ల నభాషముగాక పాయదు కర్మంబు
దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు

చ.2:
మాటలెల్లఁ గడమాటలుగాక మాయదు మలినంబు
కూటంబులు కాలకూటంబుగాక కొనకక్కదు భవము
చాటుఁదృష్ట లగచాటునఁబడక చాలదు సౌఖ్యంబు
తేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు

చ.3:
గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు
అనువున కనువై అంతయుఁ దాగాక ఆనందము లేదు
ప్రణుతింపఁగ శ్రీవేంకటరమణుని బహుళమహిమెల్లా
గణనకెక్కఁగా పురాతనులు మును కడకట్టినమతము


రేకు: 0౦91-06 గళ సం: 01-452 వైరాగ్య చింత


పల్లవి:
రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి
అండదేహమం దొకటి అతుమలో నొకటి

చ.1:
యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలో
పదిలముగా నిలిపి బంధించుట
అదివో వేధాముఖ, మంతరంగపుమనసు
చెదరకుండాఁ జొనిపి శ్రీహరిఁదలఁచుట

చ.2:
తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు
మేరతో ద్రిష్టినిలిపి మేలుఁబొందుట
చేరువ సువర్ణవిద్య, చిత్తములోఁ బ్రణవము
ధీరత నాదము సేసిఁ దేవునిఁ బొగడుట

చ.3:
పుటజయమాయ నిట్టి పుణ్యపాపము అందులో
కుటిలపుఁగోరికల కొన దుంచుట
యిటులనే శ్రీవేంకటేశుఁ డిందిరయును
అటు ప్రకృతిపురుషులనుటొరవచ్చుట