తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 89

వికీసోర్స్ నుండి


రెకు: 0౦89-౦1 మలహరిసం; 01-435 వైరాగ్య చింత


పల్లవి:
దేహ యీతగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా

చ.1:
తనువున బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికిఁ బోవునయా
పెనఁగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేఁగుదురయ్యా

చ.2:
పాదుగుచు మనమున బొడమినయాసలు
అదన నెక్కడికి నరుగునయా
వొదుగుచు జలములనుండు మత్స్యములు
పదపడి యేగతి బాసీనయ్యా

చ.3:
లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా
బలు శ్రీవేంకటపతి నాయాత్మనుఁ
గలిగితి వెక్కడి కలుషములయ్యా


రేకు: 0089-02 నాట సం: 01-436 నృసింహ


పల్లవి:
నిక్కించీ గర్ణములు మానిసిమెకము
నిక్కపుఁ గరుణతో మానిసిమెకము

చ.1:
కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే
నిండురాజసమున మానిసిమెకము
గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్చు
నిండించీ నాకసము మానిసిమెకము

చ.2:
కరములు వేయింటాఁ గైకొని యాయుధములు
నిరతి జళిపించీ మానిసిమెకము
సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి
నెరపీని నవ్వులు మానిసిమెకము

చ.3:
యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ
నిక్కపుగాఁగిటను మానిసిమెకము
అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు
నెక్కొని మమ్మేలెను మానిసిమెకమ


రేకు: 0౦89-౦3 శుద్ధవసంతం సం; 01-437 అథ్యాత్మ


పల్లవి:
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
వింతవింతవిధముల వీడునా బంధములు

చ.1:
మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియౌదాఁక
తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక
ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చ.2:
చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను
మదిగల్లి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా
యెదుట తారాజై తే నేలెనా పరము

చ.3:
పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా
జీవించేటిఫలమేది చింతదీరుదాఁకను
వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా


రేకు: 0౦89-04 సామంతం సం: 01-438 వేంకటేశ్వరౌషధము

పల్లవి:
ఆపద్భంధుఁడు హరి మాకుఁ గలఁడు
దూపలి తలఁచినా దోషహరము

చ.1:
గరుడనినెక్కినఘనరేవంతుఁడు
గరుడ కేతనముగలరథుఁడు
గరుడఁడే తనకును గరియగుబాణము
గరిమె నీతఁడేపో ఘనగారుడము

చ.2:
పాముపరపుపై బండినసిద్దుడు
పాముపాశముల పరిహరము
పామున నమృతముంఁ పడఁదచ్చినతఁడు
వేమరు నీతఁడే విషహరము

చ.3:
కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును
కమలాదేవికిఁ గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితఁడే
మమతల మాకిదే మంత్రౌషధము


రేకు: 0089-05 అలిత సం: 01-439 శరణాగతి


పల్లవి:
ఇరవగువారికి యిహపర మిదియే
హరిసేవే సర్వాత్మలకు

చ.1:
దురితమోచనము దుఃఖపరిహరము
హరినామమెపో ఆత్మలకు
పరమపదంబును భవనిరుహరణము
పరమాత్ముచింతే ప్రపన్నులకు

చ.2:
సారము ధనములు సంతోషకరములు
శౌరికథలు సంసారులకు
కోరినకోర్కియు కొంగుబంగరువు
సారె విష్ణుదాస్యము లోకులకు

చ.3:
యిచ్చయగుసుఖము యిరవగుపట్టము
అచ్చుతుకృప మోక్షార్థులకు
అచ్చపు శ్రీవేంకటాధిపు శరణము
రచ్చల మాపాలిరాజ్యపు సుగతి


రెకు: ౦౦89-06 బౌళి సం; 01-440 అధ్యాత్మ


పల్లవి:
పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి పట్టుబుద్దెఱిఁగితే
మరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు

చ.1:
జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారి
తనరఁ గౌపీన కటిసూత్రముల తగులములేని దిగంబరి
తనుఁదా నెఱఁగడుయెదిరినెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడు
పెనఁగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మా

చ.2:
నిద్దురవొయ్యేటి యప్పుడుదేహి నిత్యవిరక్తునివంటిఘనుఁడు
బుద్ది సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడు
వొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్నలంపటాల కేమియుఁ జొరఁడు
కొద్దిలేనియాస యెందువోయనాకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా

చ.3:
హరి శరణన్న యప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడు
పరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు
దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు
గరిమ శ్రీవేంకటేశుఁడు వీఁడివో కానరైరిగా యిన్నాళ్లమ్మా