తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 9
రేకు: 0009-01 సామంతం సం: 01-055 దశావతారములు
పల్లవి: ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదు
తాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు
చ. 1: ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపు
బట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు
తెట్టఁదెరువున నోరుదెరచినా లేదు
చ. 2: అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి
విడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదు
అడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదు
యిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు
చ. 3: వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు
మెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదు
యెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటే
యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు
రేకు: 0009-02 ముఖారి సం: 01-056 అధ్యాత్మ
పల్లవి: నగుఁబాట్లఁ బడేనాజిహ్వ
పగటున నిదివో పావనమాయ
చ. 1: ఇల నిందరి నుతియించి పెంచువలె
నలినలియైనది నా జిహ్వ
నలినోదరుశ్రీనామము దలఁచిన-
ఫలమున కిదివో పావనమాయ
చ. 2: భ్రమఁబడి మాయపుపడఁతులతమ్మలు
నమలి చవులుగొనె నాజిహ్వ
అమరవంద్యుఁడగుహరి నుతియించఁగ
ప్రమదము చవిగొని పావనమాయ
చ. 3: నెలఁతలపలు యోనిద్రవనదులను
నలుగడ నీఁదెను నాజిహ్వ
అలసి వేంకటనగాధిపయనుచును
పలికినయంతనె పావనమాయ
రేకు: 0009-03 శ్రీరాగం, యేకతాళి సం: 01-057 కృస్ణ
పల్లవి: విడుమనవో రోలు విడుమనవో వేగ
విడుమనవో తల్లి వెఱచీ, నీబాలుడు
చ. 1: యెన్నఁడు గొల్లెతలయిండ్లు వేమారుఁ జొచ్చి
వెన్నలుఁ బాలును వెఱఁజఁడు
వన్నెలనీకోప మింత వద్దు నీకు నీయాన
కన్నుల నవ్వుల ముద్దుగారీ నీబాలుడు
చ. 2: సారేకు పెరుగులచాడెలూ నేఁడు మొదలూ
గోరయై కోలలఁ బగుల మొత్తఁడు
కూరిమిలేక నీవు కోపగించఁగాఁ గన్నీరు
జోరుగా రాలఁగా నిన్నే చూచీ నీబాలుఁడు
చ. 3: చాలు నీకోప మిది సరిలేనిమద్దులివి
రోలనే యిట్లను విరుగఁద్రోయఁడు
మేలిమివేంకటపతి మేటిఁనీకొమాఁరు డిదె
కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుఁడు
రేకు: 0009-04 భైరవి-రచ్చెతాళం సం: 01-058 కృస్ణ
పల్లవి: పట్టవసముగానిబాలుఁడా పెనుఁ-
బట్టపు బలువుఁడ బాలుఁడా
చ. 1: ఇరుగడ బహ్మయు నీశ్వరుఁడును నిన్ను
సరుస నుతింప జఠరమున
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన-
పరమమూర్తివా బాలుఁడా
చ. 2: తల్లియుఁ దండ్రియుఁ దనియనిముదమున
వెల్లిగ లోలో వెఱవఁగను
కల్లనిదురతోఁ గనుమూసుక రే-
పల్లెలోఁ బెరిగిన బాలుఁడా
చ. 3: యేదెసఁ జూచిన నిందరి భయముల-
సేదలు దేఱఁగఁ జెలగుచును
వేదపల్లవపు వేంకటగిరిపై
పాదము మోపిన బాలుఁడా
రేకు: 0009-04 ఆహిరి సం: 01-059 వైష్ణవ భక్తి
పల్లవి: మదమత్సరము లేక మనసుపేదై పో
పదరినయాసలవాఁడువో వైష్ణవుఁడు
చ. 1: ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి
పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి
యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి
వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు
చ. 2: గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి
నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి
వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల
వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు
చ. 3: ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని
చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక
కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప
వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు
రేకు: 0009-05 సామంతం సం: 01-060 వేంకటగానం
పల్లవి: ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే
వేదవిరహితులకు వెఱతు మటుగాన
చ. 1: ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గలనిన్నుఁ
బరికించవలెఁగాని భజియింపరాదు
గరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ_
స్మరణ విజ్ఞానవాసన గాదుగాన
చ. 2: యిహ దేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు
సహజమనవలెఁగాని సరిఁ గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు
గ్రహియింపరా దవగ్రాహములు గాన
చ. 3: యింతయునుఁ దిరువేంకటేశ నీవునికిఁ దగఁ
జింతింపవలెఁగాని సేవింపరాదు
అంతయు ననరుహమును నరుహంబనఁగరాదు
అంతవానికిఁ బరుల కలవడదుగాన