తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 10

వికీసోర్స్ నుండి

రేకు: 0010-01 శంకరాభరణం సం: 01-061 వైరాగ్య చింత
పల్లవి: పదిలము కోట పగవారు
అదనఁ గాచుకొందు రాఱుగురు
చ. 1: ఇమ్మైఁ జెప్ప యిందరిచేత
తొమ్మిదినెల్లఁ దోఁగినది
కొమ్మతీరునఁ గుదురైనకోట
దొమ్మికాండ్లై దుగు రుందురు
చ. 2: వొంటికాఁడు రాజు వుడుగక తమలోన
వొంటనీనిమంత్రు లొక యిద్దరు
దంటతనంబునఁ దమయిచ్చఁ దిరిగాడు-
బంటు లేడుగురు బలవంతులు
చ. 3: కలవు తొమ్మిది కనుమల తంత్రము
నిలుపఁగలిగినట్టినెరవాదులు
తెలిసి కొనేటితిమ్మినాయఁడు చొచ్చె
బలిసె యీకోట భయమేల

రేకు: 0010-02 సామంతం సం: 01-062 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఎంత చదివిన నేమి వినిన తన-
చింత యేల మాను సిరులేల కలుగు
చ. 1: ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను
చ. 2: పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను
చ. 3: వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయాల మాను జయమేల కలుగు

రేకు: 0010-03 సామంతం సం: 01-063 వైరాగ్య చింత
పల్లవి: కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల_
కీలువదలె సౌజన్యము కిందయిపోయినది
చ. 1: ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము
కందయినది,విజ్ఞానము కడకుఁ దొలంగినది,
గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ,వివేకము
మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు
చ. 2: మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_
వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ,
కొఱమాలెను నిజమంతయు,కొండలకేఁగెను సత్యము,
మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి
చ. 3: తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు,
సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు ,
తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ-
రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు

రేకు: 0010-04 శ్రీరాగం సం: 01-064 అధ్యాత్మ
పల్లవి: ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది
పావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని
చ. 1: ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణి
సమ్మతంబున జేయఁ జాలుఁగా కేమి
కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును
నమ్మితలఁ చినవిష్ణునామంబుచేత
చ. 2: కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లును
చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హృదయంబు హరిమీఁద నుండినంతటను
చ. 3: సరిలేని దుష్కర్మసంఘములు రాసులై
పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?
బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను

రేకు: 0010-05 కన్నడ గౌళ సం: 01-065 వైరాగ్య చింత
పల్లవి: తనకర్మవశం బించుక,దైవకృతం బొకయించుక
మనసు వికారం బించుక,మానదు ప్రాణులకు
చ. 1: ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు
యీదురవస్థలు గతులును యీలంపటములును
యీదాహము లీదేహము లీయను బంధంబులు మరి
యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు
చ. 2: యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు-
నీచొక్కులు నీపొక్కులు నీ వెడయలుకలును
యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు-
నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు
చ. 3: యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు
దైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలు
దైవికమున కిటువగనక తనతలఁ పగ్గలమైనను
దైవము తానౌ తానే దైవంబవుఁగాన

రేకు: 0010-06 శ్రీరాగం సం: 01-066 దశావతారములు
పల్లవి: ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది
చ. 1: ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిది
యీ పాదమే కదా యీగగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది
చ. 2: యీ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
యీ పాదమే కదా యీబ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది
చ. 3: యీ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీవేంకటాద్రిపై నిరవైనది