తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 8

వికీసోర్స్ నుండి

రేకు: 0008-01 గుండక్రియ సం: 01-049 వైరాగ్య చింత
పల్లవి: కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు-
గనుట వినుట లేక దా కడచన్నభవము
చ. 1: ఆపద వడ్డికినిచ్చి అనుభవింపఁబోయిన
యేపున నెవ్వరికి నిం దేమిగలదు
పాపపుపైరు విత్తినపండిన పంటలలోన
రూపింపఁగ నిందు రుచి యేమిగలదూ
చ. 2: ఘనుఁడైనతిరువేంకటనాథుఁ డిన్నిటికి-
యును భోక్తయుఁ గర్మియును నైనవాఁడు
పనిలేదు నిష్ఠూరపరుఁడు దానై వుండు
తనకుఁ దానె కర్త తనమౌటఁ గాన

రేకు: 0008-02 ఆహిరి సం: 01-050 వైరాగ్య చింత
పల్లవి: జీవాతుమై యుండు చిలుకా నీ-
వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా
చ. 1: ఆతుమపంజరములోన నయముననుండి నాచేతనేపెరిగిన చిలుకా
జాతిగాఁ గర్మపుసంకెళ్ళఁబడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా
భాతిగాఁ జదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంపురెక్కలచాటున నుండి సీతుకోరువలేని చిలుకా
చ. 2: బెదరి అయిదుగురికిని భీతిఁబొందుచుఁ గడుఁ జెదరఁగఁ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిఁగాక అడిచిపడుదువే నీవు చిలుకా
వదల కిటు యాహారవాంచ నటు పదివేలు వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నాతోఁగూడి మెలగిన చిలుకా
చ. 3: నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందుఁ జిలుకా
శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించు కొని గట్టి చిలుకా
దైవమానుషములు తలఁపించి యెపుడు నా తలఁపునఁ బాయని చిలుకా
యేవియునునిజముగా వివియేఁటికని నాకు నెఱఁగించి నటువంటి చిలుకా

రేకు: 0008-03 ముఖారి సం: 01-051 భక్తి
పల్లవి: నదు లొల్లవు నా స్నానము కడు-
సదరము నాకీ స్నానము
చ. 1: ఇరువంకల నీయేచినముద్రలు
ధరియించుటే నాస్నానము
ధరపై నీనిజదాసులదాసుల-
చరణధూళి నాస్నానము
చ. 2: తలఁపులోన నినుఁదలఁచినవారలఁ
దలఁచుటే నాస్నానము
వలనుగ నినుఁగనువారల శ్రీపాద-
జలములే నాస్నానము
చ. 3: పరమభాగవతపాదాంబుజముల-
దరుశనమే నాస్నానము
తిరువేంకటాగిరిదేవ నీకథా
స్మరణమే నాస్నానము

రేకు: 0008-04 శ్రీరాగం సం: 01-052 నామ సంకీర్తన
పల్లవి: చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు
చాలదా హితవైన చవులెల్ల నొసఁగ
చ. 1: ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా
చెదరకీ జన్మముల చెఱలు విడిపించ
మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా
పదివేలు నరకకూపముల వెడిలించ
చ. 2: కలదొకటి హరినామ కనకాద్రి చాలదా
తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ
తెలివొకటి హరినామ దీపమది చాలదా
కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల
చ. 3: తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా
జగములో కల్పభూజంబు వలెనుండ
సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా
నగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప

రేకు: 0008-05 శ్రీరాగం సం: 01-053 సంస్కృత కీర్తనలు
పల్లవి: వందే వాసుదేవం
బృందారకాధీశ వందిత పదాబ్జం
చ. 1: ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకితల సచ్చారు దేహం
మందారమాలికా మకుటసంశోభితం
కందర్పజనక మరవిందనాభం
చ. 2: ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలం
ఖగరాజవాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేష ప-
న్నగరాజ శాయినం ఘన నివాసం
చ. 3: కరిపురనాధ సంరక్షణే తత్పరం
కరిరాజ వరదసంగత కరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరువేంకటాచలా దేవం భజే

రేకు: 0008-06 భూపాళం సం: 01-054 భక్తి
పల్లవి: నీ కథామృతము నా నిరతసేవన నాకు
చేకొనుట సకలసంసేవనం బటుగాన
చ. 1: ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు-
నిదియె వేదసంహితపాఠము
యిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు-
నిదియె సంధ్య నాకిదియ జప మటుగాన
చ. 2: యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు-
నిదియె దుఃఖవిరహితమార్గము
యిదియె భవరోగహితభేషజము నాకు-
నిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన
చ. 3: యిదియె దానఫల మీఁజాలినది నాకు
యిదియే తలఁపఁ బరహితకర్మము
యిదియె తిరువేంకటేశ నీసంస్మరణ-
మిదియె యిదియె ఇన్నియును నటుగాన