తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 7
రేకు: 0007-01 లలిత సం: 01-045 అధ్యాత్మ
పల్లవి: మంచిదివో సంసారము మదమత్సరములు మానిన
కంచునుఁ బెంచును నొకసరిగాఁ దా చూచినను
చ. 1: ఆపదలకుమ సంపదలకు నభిమానింపక యుండిన
పాపముఁ బుణ్యము సంకల్పములని తెలిసినను
కోపము శాంతము తమతమగుణములుగా భావించిన
తాపము శైత్యమునకుఁ దాఁ దడఁబడకుండినను
చ. 2: వెలియును లోపలయును నొకవిధమై హృదయం బుండిన
పలుకునుఁ బంతము దా నొక భావన దోఁచినను
తలఁపునఁ దిరువేంకటగిరిదైవము నెలకొనియుండిన
సొలపక యిన్నిటికినఁ దా సోఁకోరుచెనైనా
రేకు: 0007-02 లలిత సం: 01-046 మంగళ హారతులు
పల్లవి: మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ
చ. 1: ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు
చ. 2: హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా-
కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు
చ. 3: పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు
రేకు: 0007-03 సామంతం సం: 01-047 అధ్యాత్మ
పల్లవి: పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె
కాయమునకు జీవునకునుఁ గర్తృత్వము లేదు
చ. 1: ఆతుమ కలవ్యాపకమని తలపోసినపిమ్మట
జాతియుఁ గులాభిమానముఁ జర్చింపనెరాదు
భూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడు
పాతకముల పుణ్యంబులపని తనకే లేదు
చ. 2: పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచినపిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కకపోరాదు
కదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసిన
చెదరక సంసారమునకు జేసాఁపనెరాదు
చ. 3: పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడు
యెరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవు
పరమాత్ముండగు నీతని భక్తులందలఁచిన యప్పుడు
తిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు
రేకు: 0007-04 బౌళి సం: 01-048 అధ్యాత్మ
పల్లవి: ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు
బూడిదిలో హోమమై పోయఁ గాలము
చ. 1: ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి నని
కదిసిన యాసచేఁ గడవలేక
యెదురుచూచి చూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయఁ గాలము
చ. 2: ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని
వింతవింత వగలచే వేఁగివేఁగి
చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని-
పొంతనున్న వెన్నయై పోయఁ గాలము
చ. 3: యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని
యెక్కడికైనా నూర కేఁగియేఁగి
గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక
పుక్కిటి పురాణమయి పోయఁ గాలము