తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 86

వికీసోర్స్ నుండి


రేకు: 0086-01 లలిత సం; 01-417 అధ్యాత్మ


పల్లవి:
తహతహ లిన్నిటికి తానే మూలము గాన
సహజాన నూరకున్న సంతతము సుఖము

చ.1:
భారమైన పదివేలు పనులు గడించుకొంటే
సారెసారె నలయించకపోవు
తీరనియాసోదము దేహములో నించుకొంటే
వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు

చ.2:
వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే
వుండుఁబో మంచముకింద నొకనూయి
కొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటే
నండనే యాబహురూప మాడకపోదు

చ.3:
మనసురానివైన మంచివి చేసుకొంటే
తినఁదిన వేమైన దీపవును
తనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతే
యెనయుచు నేపని కెదురే లేదు


రేకు: ౦౦86-02 సాళంగనాట సం; 01-418 శరణాగతి


పల్లవి:
ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడు
పదపడి జీవులాల బదుకరో


చ.1:
హరి గానలేరు మీరు అరసెందువెదకినా
హరిదాసు లెఱుఁగుదు రడుగరో
గరిమెఁ బ్రత్యక్షము గాండు దేవు. డెవ్వరికి
ధరం బ్రత్యక్షము హరిదాసుల గొలువరో

చ.2:
చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరు
చేతులార ప్రపన్నులసేవ సేయరో
జాతిగాఁగ విష్ణునిప్రసాద మేడ దొరకీని
ఆతల వారి బ్రసాద మడుగరో

చ.3:
అంతరంగమున నున్నాఁడందురు విష్ణుడు గాని
అంతటా నున్నారు వైష్ణువాధికులు
చెంతల దదియ్యుల చేతియనుజ్ఞ వడసి
సంతతం శ్రీవేంకటేశు శరణము చొరరో


రేకు: 0086-03 దేసాక్షి సం: 01-419 వైరాగ్య చింత


పల్లవి:
ఎవ్వరివాఁడో యీదేహి
యివ్వలనవ్వల నీదేహి

చ.1:
కామించు నూరకే కలవియు లేనివి
యేమి గట్టుకొనె నీదేహి
వాములాయ నిరువదియొక వావులు
యేమని తెలిసెనో యీదేహి

చ.2:
కందువ నిజములు గల్లలు నడిపీ
యెందుకు నెక్కెనో యీ దేహి
ముందర నున్నవి మొగిఁ దనపాట్లు
యిందే భ్రమసీ నీదేహి

చ.3:
పంచేంద్రియముల పాలాయ జన్మము
యించుక యెఱఁగఁడు యీదేహి
అంచెల శ్రీవేంకటాధీశ నీకృప
వంచఁగ గెలిచెను వడి నీదేహి


రేకు: 0086-04 రామక్రియ సం: 01-420 అంత్యప్రాస


పల్లవి:
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరి
వంతుకు నీకృపగలవాఁడే యెఱుఁగు హరి

చ.1:
నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి
నిన్నునొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి
మున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరి
వున్నతి నసురలు నిన్నాల్లక చెడిరి హరి

చ.2:
యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరి
నీపెరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరి
కేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరి
పైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి

చ.3:
యిట్టె నీవిచ్చినవర మెన్నఁడు జెడదు హరి
గట్టిగా నీవియ్యనివి కపటములే హరి
అట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరి
వుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి


రేకు: 0086-05 మాళవి సం: 01-421 నృసింహ


పల్లవి:
నగుమొగముతోడి వో నరకేసరి
నగరూప గరుడాద్రి నరకేసరి

చ.1:
అమితదానవహరణ ఆదినరకేసరి
నమితబ్రహ్మాదిసుర నరకేసరి
కమలాగ్రవామాంక కనకనరకేసరి
నమోనమో పరమేశ నరకేసరి

చ.2:
రవిచంద్రశిఖనేత్ర రౌద్రనరకేసరి
నవనారసింహ నమో నరకేసరి
భవనాశినీతీరభవ్య నరకేసరి
నవరసాలంకార నరకేసరి

చ.3:
శరణాగతత్రాణ సౌమ్య నరకేసరి
నరకమోచననామ నరకేసరి
హరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరి
నరసింహ జయ జయతు నరకేసరి


రేకు: ౦౦86-06 లలిత సం: ౦1-422 వేంకటగానం

పల్లవి:
వాడె వేంకటాద్రిమీద వరదైవము
పోఁడిమితోఁ బొడచూపెఁ బొడవైన దైవము

చ.1:
వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు
పిక్కటిల్ల వెలుఁగొందే పెను దైవము
పక్కినను తనలోని పదునాలుగు లోకాలు
తొక్కి పాదానఁ గొలచే దొడ్డ దైవము

చ.2:
వేద శాస్త్రాలు నుతించి వేసరి కానఁగలేని
మోదపు పెక్కుగుణాల మూలదైవము
పోది దేవతలనెల్లఁ బుట్టించ రక్షించ
ఆదికారణంబైన అజుఁగన్న దైవము

చ.3:
సరుస శంఖచక్రాలు సరిఁబట్టి యసురల
తరగి పడవేసిన దండి దయివమూ
సిరి వురమున నించి శ్రీవేంకటేశుండయి
శరణాగతులఁగాచే సతమయిన దయివము