తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 87

వికీసోర్స్ నుండి


రేకు:0087-01 రామక్రియ సం; 01-423 వైష్టవ భక్తి


పల్లవి:
సులభమా యిందరికి జూడ సులభముగాక
కలిగె మీకృప నాకుఁ గమలారమణా

చ.1:
సతతదయాచారసంపన్నుఁడై మఱికదా
అతిశయవైష్టవాన కరుహుడౌట
వ్రతోపవాసతీర్థవరసిద్దుఁడైకదా
మితిమీరి నరహరి మీదాసుఁడౌట

చ.2:
సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదా
ప్రకటించి విష్ణునామపాఠకుఁడౌట
అకలంకమతితోడ నాజన్మశుద్దుఁడైకదా
అకుటిలమగుమీచక్రాంకితుఁడౌట

చ.3:
కెరలి సదాచార్యకృప గలిగినగదా
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ గనుట
మరిగి మీపై భక్తి మఱి ముదిరినఁ గదా
అరయ మీకే శరణాగతుఁడౌట


రేకు: 0087-02 శంకరాభరణం సం: 0౦1-424 ఉత్సవ కీర్తనలు


పల్లవి:
అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని
వెదకివెదకి తిరువీధులందు దేవుఁడు

చ.1:
అలసూర్యవీథి నేఁగీ నాదిత్యునితేరిమీద
కలికికమలానందకరుఁడుగాన
తలపోసి అదియును దవ్వు చుట్టఱికమని
యిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు

చ.2:
చక్క సోమవీథి నేఁగీ జందురునితేరిమీఁద
యెక్కువైన కువలయహితఁడుగాక
చుక్కలు మోచిన దవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు

చ.3:
యింతులమనోవీధి నేఁగీ మరుతేరిమీఁద-
నంతటా రతిప్రియుఁ డటుగాన
రంతుల నదియుఁ గానరానిచుట్టరికమని
వింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు


రేకు: 0087-03 బౌళి సం; 01-425 వేంకటగానం


పల్లవి:
శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడే
పావనపు వైకుంఠ పతియును నితఁడే

చ.1:
భగవతములోఁ జెప్పే బలరాముతీర్ణయాత్ర
నాగమోక్తమైనదైవమాతఁ డితడే
బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాతఁ డితఁడే
యోగమై వామనపురాణోక్తదైవ మీతఁడే

చ.2:
వెలయ సప్తరుషులు వెదకి ప్రదక్షిణము
లలరఁ జేసినదేవుఁడాఁతఁ డీతఁడే
నెలవై కోనేటిపొంత నిత్యముఁ గుమారస్వామి
కలిమి దపముసేసి కన్నదేవు డీతఁడే

చ.3:
యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు
తక్కక కొలిచియున్న తత్వమీతఁడు
చక్క నారదాదులససంకీర్తనకుఁ జొక్కి
నిక్కినశ్రీవేంకటాద్రి నిలయుఁడు నీతఁడే


రేకు: 0087-04 బౌళి సం: 01-426 ఉపమానములు


పల్లవి:
పట్టినచోనే వెదకి భావించవలెఁగాని
గట్టిగా నంతర్యామి కరుణించును

చ.1:
యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితే
వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును
అంటి కానరానితనయాతుమ తప్పకచూచు-
కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును

చ.2:
మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితే
అంచెలఁ దానే కుదురై నయట్టు
పొంచి హరినామమే యేపాద్దు నాలికతుదను
యెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము

చ.3:
వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితే
యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు
యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును
పక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును


రేకు: 0087-05 సాళంగనాట సం: 01-427 అథ్యాత్మ


పల్లవి:
నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ
చేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని

చ.1:
అందరిలో నంతర్యామివై నీవుండఁగాను
యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును
సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను
వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి

చ.2:
లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను
చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని
కైకొని యామాయలు నీకల్పితమై వుండఁగాను
చౌకలేక నేవేరే సంకల్పించితిని

చ.3:
యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగాను
యిక్కడాఁ దొత్తుల బంట్లు నేలితి నేను
చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను
మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను


రేకు: 0087-06 నాట సం: 01-428 నృసింహ, సంస్కృత కీర్తనలు


పల్లవి:
పరిపూర్ణ గరుడాద్రి పంచాననం
పరమంసేవే పంచాననం

చ.1:
క్రూరదంష్టాగ్నికణఘోర పంచాననం
పారీణచక్రధర పంచాననం
వీర పంచాననం విజయ పంచాననం
భారభూభారహర పంచాననం

చ.2:
దివిజపంచాననం తీవ్రనఖకాననం
భవనాశినీతీర పంచాననం
కువలయాకాశసంఘోష పంచాననం
పవిశబ్దదంతరవ పంచాననం

చ.3:
శ్రీవేంకటాఖ్యఘనశిఖరి పంచాననం
పావనం పంచముఖ పంచాననం
సేవిత ప్రహ్హదసిద్ది పంచాననం
భావితం శ్రీయుక్త పంచాననం