తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 85

వికీసోర్స్ నుండి


రేకు: 0085-01 దేవగాంధారి సం: 01-411 అధ్యాత్మ


పల్లవి:
మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి
తక్కినవారు మీకృప దప్పినవారు హరి

చ.1:
వున్నతపు సంపదల నోలలాడేయట్టివాఁడు
మున్నిటిజన్నాన నీకు మొక్కినవాఁడు హరి
పన్ని పడనిపాట్లఁ బరులఁ గొలిచేవాఁడు
వున్నతి మిము సేవించనొల్లనివాఁడు హరి

చ.2:
పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు
శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి
నానానరకముల నలఁగుచుండేవారు
నానాఁడే నీమహిమ నమ్మనివారు హరి

చ.3:
పావనులై నిజభక్తిఁ బ్రపన్నులయ్యినవారు
శ్రీవేంకటేశ మిమ్ముఁ జేరినవారె హరి
వేవేలు దేవతలవెంట దగిలేటివాఁడు
కావించి మిమ్మెఱఁగనికర్మి యాతఁడే హరి


రేకు: 0085-02 ముఖారిసం: 01-412 భక్తి

పల్లవి:
చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే
అప్పటి నపరాధమా ఆదరించవలదా

చ.1:
నియ్యాజ్ఞ దేహము నే మోఁచితి నింతే
యియ్యెడ విజ్ఞానమేల యియ్యవయ్యా
వెయ్యవేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి
వొయయ్య కొంతైనా వూరడించవలదా

చ.2:
నీవు సేసే కర్మము నేఁ జేయువాఁడ నింతే
యీవల నానందసుఖ మియ్యవయ్యా
కోవరమై వెంటవెంటఁ గొలిచినబంట్లకు
తావులఁ గొంతవడైనా దప్పిదీర్చవలదా

చ.3:
మతిలో శ్రీవేంకటేశ మనికైనవాఁడ నింతే
తతి నాపాటుకు దయదలఁచవయ్యా
యితవై పనిసేసేటి యింటపసురమునకు
వెతదీరఁ బాలార్చి వెడ్డువెట్టఁదగదా


రేకు: 0085-03 బౌళి సం: 01-413 అధ్యాత్మ

పల్లవి:

వెఱ్ఱివాఁడు వెఱ్ఱిగాఁడు విష్ణుని దాస్యము లేక
విఱ్ఱవీఁగే యహంకారి వెఱ్ఱివాఁడు

చ.1:

నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండఁగాను
జోలితో మఱచిననీచుఁడే వెఱ్ఱివాఁడు
అలరియీజగమెల్లా హరిరూపై వుండఁగాను
వాలి తలపోయలేనివాఁడు వెఱ్ఱివాఁడు

చ.2:

కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే
కోరి వేరె కలఁడనేకుమతి వెఱ్ఱివాఁడు
చేరి తనయాత్మలోన శ్రీరమణుఁడుండఁగాను
దూరమై తిరుగువాఁడే దొడ్డవెఱ్ఱివాఁడు

చ.3:

సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండఁగా
సారెఁ గర్మములంటెడి జడుడు వెఱ్ఱివాఁడు
చేరువ నాతని ముద్ర చెల్లుబడి నుండఁగా
మోరతోపైవున్నవాఁడే ముందు వెఱ్ఱివాఁడు


రేకు: ౦౦85-04 మాళవి సం: 01-414 వైష్ణవ భక్తి


పల్లవి:
నిత్యులు ముక్తులు నిర్మలచిత్తులు నిగమాంతవిదులు వైష్ణవులు
సత్యము వీరల శరణని బ్రదుకరో సాటికిఁ బెనఁగక జడులాల

చ.1:
సకలోపాయశూన్యులు సమ్యగ్జ్ఞానపూర్జులు
అకలంకులు శంఖచక్రలాంఛను అన్నిట బూజ్యులు వైష్ణవులు
వొకటీ గోరరు వొరుల గొలువరు వొల్లరు బ్రహ్మదిపట్టములు
అకటా వీరలసరియనఁ బాపం బారుమతంబులపూఁతకోకల

చ.2:
మంత్రాంతరసాధనాంతరంబులు మానినపుణ్యులు విరక్తులు
యంత్రపుమాయలఁ బొరలుపరులకు యెంతైనా మొక్కరు వైస్టవులు
తంత్రపుకామక్రోధవిదూరులు తమనిజధర్మము వదలరు
జంత్రపుసంసారులతో వీరల సరియని యెంచఁగఁ బాపమయ్య

చ.3:
తప్పరు తమపట్టినవ్రత మెప్పుడు దైవ మొక్కడేఁ గతియనుచు
వొప్పగుతమపాతివ్రత్యంబున నుందురు సుఖమున వైష్ణవులు
కప్పిన శ్రీవేంకటపతిదాసులు కర్మవిదూరులు సాత్వికులు
చెప్పకుఁడితరుల సరిగా వీరికి సేవించఁగ నే ధన్యుఁడనైతి


రేకు: 0085-05 లలిత సం; 01-415 వేంకటగానం


పల్లవి:
మా కెల్ల ' రాజానుమతో ధర్మ' యిది నీ
యీకడఁ గలుగుట కేమరుదు

చ.1:
అలగరుడగమన మహిశయనంబును
కలిసి నీయందె కలిగెనటా
పొలసినపాపముఁ బుణ్యము నరులకు
యెలమి గలుగుటకు నేమరుదు

చ.2:
యిదె నీడకన్ను యెండకన్ను మరి
కదిసి నీయందె కలిగెనట
సదరపునరులకు జననమరణములు
యెదురనె కలుగుట కేమరుదు

చ.3:
శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెన
కైకొని నీకిటు గలిగెనట
యీకడ శ్రీవేంకటేశ యిహపరము
యేకమై మా కగు టేమరుదు


రేకు: ౦౦85-06 ఖైరవి సం: 01-416 అంత్యప్రాస


పల్లవి:
తెలియరాదు మాయదేహమా మమ్ము
పలువికారాలఁబెట్టి పనిగొన్న దేహమా

చ.1:
దినమొక్క వయసెక్కే దేహమా సారె
పెనుమదము గురిసీ బెండు దేహమా
దినదిన రుచిగోరే దేహమా నన్ను
ఘనమోహపాశాలఁ గట్టెఁగదె దేహమా

చ.2:
తెలివినిద్రలుగల దేహమా నీ-
పొలము పంచభూతాలపొత్తు దేహమా
తిలకించి పాపపుణ్యాల దేహమా
బలుపుగలదాఁకా బదుకవో దేహమా

చ.3:
తీరని సంసారపు దేహమా ఇట్టె
వూరట లేనిభోగాల వోదేహమా
కూరిమి శ్రీవేంకటేశుఁ గొలిచితి నిఁక నాకు
కారణజన్మమవై కలిగినదేహమా