తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 84

వికీసోర్స్ నుండి


రేకు: 0౦84-01 మలహరిసం; 01-405 వైష్ణవ భక్తి


పల్లవి:
వలెనను వారిదె వైష్ణవము యిది
వలపుఁ దేనెవో వైష్ణవము

చ.1:
కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై
వైరాగ్యమెపో వైష్ణవము
సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో
వారించుటవో వైష్ణవము

చ.2:
నుడిగొను దేహపు సుఖదుఃఖములో
వడిఁ జొరనిదెపో వైష్ణవము
ముడివడి యింద్రియముల కింకరుఁడై
వడఁబడనిదెపో వైష్ణవము

చ.3:
వుదుటునఁ దన సకలొపాయంబులు
వదలుటపో నిజవైష్ణవము
యెదుటను శ్రీవేంకటేశ్వరు నామము
వదనము చేర్చుట వైష్ణవము


రేకు: 0084-02 పాడి సం: 01-406 అధ్యాత్మ


పల్లవి:
శ్రీహరి సేసిన చిహ్నలివి యీ
మోహము విడుచుట మోక్షమది

చ.1:
మలినంబేది మణుఁగననేది
కలుషపుమలముల కాయమిది
కలిగిన దేది కడు లేందేది
చలనపుు మాయల జన్మ మిది

చ.2:
తనిసిన దేది తనియనిదేది
దినదిన మాఁకలి దీరదిది
కొన యిందేది గుఱి మొదలేది
పనిగొను కర్మపు బంధ మది

చ.3
నిండినదేది నిండనిదేది
కొండల పాడవుల కోరికది
అండనె శ్రీవేంకటాధిపు శరణని
వుండుటె యిహపరయోగ మది


రేకు: 0౦84-03 సాళంగనాట సం; 01-407 నామ సంకీర్తన


పల్లవి:
దైవమా నీకు వెలితా తలఁపువెలీతేకాక
వేవేలుకర్మాల వేసారఁగ వలసె

చ.1:
హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసిన
పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక
నరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకు
తిరముగా బుణములు దీర్చుకొనఁగలవా

చ.2:
దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవి
శైవశము నామనసు గాదుగాక
గోవింద యనియంటేఁ గూడని పదవు లేవి
కావిరిఁ గాల మూరకె గడుపేము నేము

చ.3:
వేదనారాయణమంటే వీడేటిబంధములు
ఆదిగా మూఁడులోకాలనైనా నున్నదా
శ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడా
యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక


రేకు: ౦౦84-04 గుజ్జరి సం: 01-408 గురు వందన, నృసింహ


పల్లవి:
ఎక్కడిపాపము లెక్కడిపుణ్యము
లొక్కట గెలిచితి మోహో నేము

చ.1:
ప్రపన్నులెదుటను బడినయాతుమకు
చపలత మరి నాశము లేదు
ఉపమల గురుకృప నొనరిన మనసుకు
రపముల మఱి నేరములే లేవు

చ.2:
ఘనతర ద్వయాధికారగు దేహికి
మినుకుల భవభయమే లేదు
చనవుల హరిలాంఛన కాయమునకు
వెనుకొను కర్మపువెట్టియు లేదు

చ.3:
శ్రీవేంకటేశ్వరుఁ జేరినధర్మికి
ఆవల మఱి మాయలు లేవు
కైవశమాయను కైవల్యపదమునుఁ
జావుముదిమితో సడ్జే లేదు


రేకు: 0084-05 లలిత సం; 01-409 భగవద్గీత కీర్తనలు


పల్లవి:
సర్మాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలుఁజాలునయ్యా

చ.1:
వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చి
కోరేటి యపరాథాలు కొన్ని వేసి
నేరకుంటే నరకము నేరిచితే సర్షమంటా
దూరవేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా

చ.2:
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి
ఘనము సేసే విందు గర్త లెవ్వరయ్యా

చ.3:
వున్నారు ప్రాణులెల్లా నొక్కనీ గర్భములోనే
కన్న కన్న భ్రమతలే కల్పించి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా


రేకు: 0084-06 రామక్రియ సం: 01-410 అంత్యప్రాస


పల్లవి:
భక్తి కొలఁది వాఁడే పరమాత్ముఁడు
భుక్తి ముక్తిఁ దానే యిచ్చు భువిఁ బరమాత్ముఁడు

చ.1:
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముఁడు
బట్టబయటి ధనము పరమాత్ముఁడు
పట్లుపగటి వెలుఁగు పరమాత్ముఁడు
యెట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు

చ.2:
పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడు
బచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడు
బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముఁడు
యిచ్చకొలఁది వాడువో యీ పరమాత్ముఁడు

చ.3:
పలుకుల లోని తేట పరమాత్ముఁడు
ఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడు
యెలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు