తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 81

వికీసోర్స్ నుండి

M


రేకు: 0081-01 దేసాళం సం; 01-388 అధ్యాత్మ


పల్లవి:
వీనిఁ జూచియైన నేము విరతిఁబొందగలేము
పూని మాబ్రదు కిందుఁబోలదాయఁగా

చ.1:
పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవు
పరపురుషా-+ ర్ధమే ఫలవృక్షతతులెల్ల
నరులమై ఘనులమై నానాబుద్దు లెఱిఁగి
పారి మాబ్రదుకు లిందుఁబొలదాయఁగా

చ.2:
కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవు
కామించినట్లువు నెక్కడనైనా శిల లివి
దీమసము గలిగియుఁ దెలివి గలిగియును
భూమిలో మాబ్రదు కిందుఁబోలదాయఁగా

చ.3:
వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవు
వొకమానిగడు చేరివుండు పక్షు లాడనాడ
వొక శ్రీ వేంకటపతి నమ్మియుండలేము
మొకెమో మాబ్రదు కిందుఁబొలదాయఁగా


రేకు: ౦౦81-02 సాళంగం సం; 01-389 వైరాగ్య చింత


పల్లవి:
పనిమాలినట్టి వట్టి పఱఁదుగాక మాకు
ననిచి యిదియు నొక్కనగుఁబాట్లా

చ.1:
కన్నవారినెల్లా వేఁడేకష్టమే దక్కుటగాక
పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా
యెన్నికతోఁ దేహమిచ్చె నిహమెల్లాఁ జెందనిచ్చె
వున్నవారింతటి పని కోపఁగలరా

చ.2:
బడలి తానెందైనాఁ బడ్డపాటే దక్కెఁగాక
కడఁగి రానిది దే నొక్క రివసమా
కడుపులో నుండఁగానే కలవి నుదుట వ్రాసె
తడవి దైవముచేఁత దాఁట వసమా

చ.3:
దెప్పరపు సంపదకుఁ దిమ్మటలే దక్కెఁగాక
యెప్పుడూ శ్రీవేంకటేశుఁడీక మానీనా
చప్పుడుగా నతనికే శరణన్న జాలుఁగాక
తప్పులును వొప్పులు నాతనివే కావా


రేకు: 0081-03 దేసాళం సం: 01-390 వైష్ణవ భక్తి


పల్లవి:
పరులసేవలు చేసి బ్రదికేరటా
సిరివరుదాసులు సిరులందు టరుదా

చ.1:
కోరి వొక నరునిఁ గొలిచిన వారలు
దీరులై సలిగెలఁ దిరిగేరట
కూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని-
వార లింతటఁ జనవరులౌ టరుదా

చ.2:
చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము -
లాకడఁ దుమ్మిదలయీనట
శ్రీకాంతుని పాదసేవకులగు వార -
లేకులజు లయినా నెక్కుడౌ టరుదా

చ.3:
ధరణీశు నాజ్ఞల తమదేశములందు
సిరులనాణెపు ముద్ర చెల్లీనట
తీరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు
థరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా


రేకు: 0081-04 గుజ్జరి సం: 01-391

పల్లవి:
ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు
తటుకున స్వతంత్రముడిగిన యాత్మకు తగునిశ్చింతమే పరసుఖము

చ.1:
ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించినరీతి,
యీకడఁ గోరికలుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడు
చేకొని బుద్దెఱిఁగిన జింతింపరు తొల్లిటివలెఁ దల్లులు
యీకొలఁదులనే స్వయత్న దేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు

చ.2:
తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రాపదిమానము గాచినయట్లు,
హితమతి స్వతంత్రముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడు
అతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజునిశిరంబటు ద్రుంచిననాఁడు
చతురుఁడుదా నడ్డము రాఁడాయను స్వతంత్రముడుగని జీవులుగాన

చ.3:
దిక్కని యనిశముఁ జిత్తములోనఁ జింతించేటి శరణాగతజనులకు,
యిక్కడనక్కడ శ్రీ వేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడు
మక్కువతోఁ దనయంతర్యామిని మఱచినస్వామి ద్రోహులకెల్లా
అక్కరతోఁ బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన


రేకు: 0౦81-05 వసంతం సం: 01-392 రామ


పల్లవి:
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరత శత్రుఘల తోడ జయమందు దశరథ రాఘవా

చ.1:
శిరసు కూఁకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా
గరిమ నావయసునఁ దాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవా
అరిది యజ్ఞముగాచు రాఘవా అట్టె హరువిల్లు విఱిచిన రాఘవా
సిరులతో జనకుని యింటను జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా

చ.2:
మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవా
చెలఁగి చుప్పనాతి గర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవా
సొలసి వాలిఁజంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా
జలధి బంధించిన రాఘవా లంక సంహరించిన రాఘవా

చ.3:
దేవతలు చూడ రాఘవా నీవు దేవేంద్రు రథమెక్కి రాఘవా
రావణాదులనుఁ జంపి విభిషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయ పట్టమేలి రాఘవా
శ్రీవేంకటగిరిమీఁద నభయము చేరి మాకిచ్చిన రాఘవ