తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 82

వికీసోర్స్ నుండి


రేకు: ౦082-01 దేవగాంధారి సం; 01-393 భక్తి


పల్లవి:
విధి నిషేధము లకు వెఱవఁగఁ బనిలేదు
మధుసూదన నీమన్నన దాసుడైతే

చ.1:
విడువరానిధర్మ విధుల పురుషులను
విడిచి గోపికలు విచ్చనవిడి
బడి నిన్ను దగులుటే పరమధర్మ మాయ
యెడయునితర ధర్మాలిక నేటికయ్యా

చ.2:
మానరాని కర్మమార్గము అటు మాని
పూనినయతులే పూజ్యులట
నీనారాయణనియతే ధర్మమాయ
యీనిజ మొకటియు నెఱగఁగఁవలయు

చ.3:
యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుఁడై
వున్న విచారాల నొదుగనేలా
నిన్ను గూర్చినట్టి నిజభక్తి గలదని
తిన్ననై తెలిపేటి తెలివే కలది


రేకు:0082-02 రామక్రియ సం: 01-394 దశావతారములు

పల్లవి:
సులభుఁడు మధుసూదనుఁడు మన-
మెలమి నమ్మిన నిట్టే సుండీ

చ.1:
పడుచు మాటన కా ప్రహ్లాదునెదుట
పాడచూపె నాదిపురుషుఁడు
అడవి దేహనక అదంతిమొఱకును
తడవి కాచిన దైవము సుండీ

చ.2:
ఆడుమాటలనక అంతలో ద్రౌపదిని
వాడిమి గాచిన వరదుఁడు
పోఁడిమిఁ బేదనక పొందిన కుచేలుని
వీఁడె సంపదిచ్చె విష్ణుఁడు సుండీ

చ.3:
వీరువారన కిదె వేఁడిన వరములు
సారెకు నిచ్చిన సర్వేశుఁడు
మేరతో లోకముల మెఱసె నిప్పుడును
యీరీతి శ్రీవేంకటేశుఁడే సుండీ


రేకు: 0082-03 ధన్నాసీ సం: 01-395 గురు వందన


పల్లవి:
కింకదీర 'నదైవం కేశవాత్పర' మని
ఉంకునైవనాలో నీవుపమ లివే

చ.1:
కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమని
వొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గాన
వింటి నీవే ఘనమని వేదాంతమందు నీ-
కంటె నితరము విన గరుణానిథి

చ.2:
తోఁచె నాకు నీసేవే తుదిపదమని మఱి
తోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందును
పూఁచి నాగురుఁడు నిన్నే బోధించేగాని మఱి
దాఁచఁడాయ నీమహిమ ధరణిధరా

చ.3:
సమ్మతించె నామతి జవియైనా కథలె
సమ్మతించ దెక్కడో రచ్చల సుద్దులు
నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలే
నమ్మితి నేమియు నమ్మ నారాయణా

M


రేకు: 0082-04 రామక్రియ సం: 01-396 అధ్యాత్మ


పల్లవి:
ఓహో ఢేంఢేం వొగి బ్రహ్మమిదియని
సాహసమున శృతి చాటెడిని

చ.1:
పరమును నపరముఁ బ్రకృతియు ననఁగా
వెరవు దెలియుటే వివేకము
పరము దేవుఁడును అపరము జీవుఁడు
తిరమైన ప్రకృతియె దేహము

చ.2:
జ్ఞానము జ్జేయము జ్ఞానగమ్యమును
పూని తెలియుటే యోగము
జ్ఞానము దేహాత్మ జ్జేయము పరమాత్మ
జ్ఞాన గమ్యమే సాధించు మనసు


చ.3:
క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడని
సరవిఁ దెలియుటే సాత్వికము
క్షరము ప్రపంచ మక్షరము కూటస్టుఁడు
సిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు


రేకు: 0౦82-05 శంకరాభరణం సం: 01-397 వైరాగ్య చింత


పల్లవి:
చీవీ నరుల దేటిజీవనము
కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక

చ.1:
అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁగాక
వడి నితరులఁ గొలువఁగవచ్చునా
వుడివోని పక్షియై వుండనై నావచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా

చ.2:
పసురమై వెదలేనిపాటు వడవచ్చుఁ గాక
కసివో నొరుల బొగడగావచ్చునా
వుసురుమానై పుట్టివుండనై నవచ్చుగాక
విసువక వీరివారి వేసరించవచ్చునా

చ.3:
యెమ్మెల బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాక
కమ్మి హరిదాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమే కాక
దొమ్ములకర్మము లివి తోయవచ్చునా


రెకు: ౦౦82-06 గుజ్జరి సం: 01-398 భక్తి


పల్లవి:
ఇంతే మఱేమిలేదు యిందుమీదను
దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట

చ.1:
వుల్లములో నుండి దేహ మొగి రక్షించేహరి-
నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుట
బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లా
పాల్లకట్టు దంచిదంచి పోగు సేసుకొనుట

చ.2:
యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి-
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లా
చయ్యన జెఱకుఁ బిప్పి చవిగొనుట

చ.3:
శ్రీకాంతుడై నట్టి శ్రీవేంకటేశ్వరుని
జేకొంటే సిరులెల్లా జేకొనుట
మేకుల శ్రీహరినామమే నోర నుడుగట
కైకొన్న యమృతపుగందు వగుట