Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 68

వికీసోర్స్ నుండి


రేకు: 0068-01 నాట సం: 01-352 వైరాగ్య చింత


పల్లవి:
కాయము జీవుఁడుగలనాఁడే తెలియవలె
యీాయత్నములు దనకెన్నఁడు

చ.1:
సతతము సంసారజడుఁడు దానట యాత్మ-
హితవు దెలుసుకాల మెన్నఁడు
రతిసరసముల పూరకే ప్రాయ మెడలంగ
యితరసుఖము దన కెన్నఁడు

చ.2:
యెడపక ద్రవ్యమెహితుఁడై తిరుగఁ దన.-
యిడుమపాటు మాను టెన్నఁడు
కడలేనిపొలయలుకలచేతఁ దనదేహ-
మిడియఁగ నిజసుఖ మెన్నఁడు

చ.3:
శ్రీవేంకటేశునిఁ జేరి తక్కినసుఖ-
మేవగించుకాల మెన్నఁడు
శ్రీవల్లభునికృప సిరిగాఁ దలఁచి జీవుఁ -
డీవైభవముఁ గాంచు టెన్నఁడు


రేకు: 0068-02 సామంతం సం; 01-353 అథ్యాత్మ


పలవి:
అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యాతురబంధువుఁ -
డతఁడు దలఁపుల ముంగిట నబ్బుట యెన్నఁడొకో

చ.1:
సారేకు సంసారంబను జలనిధు లీఁదుచు నలసిన-
వారికి నొకదరిదాపగు వాఁడిఁక నెవ్వఁడొకో
పేరిన యజ్ఞానంబను పెనుఁజీఁకటి తనుఁగప్పిన
చేరువవెలుఁగై తోఁపెడిచెలి యికఁ నెవ్వఁడొకో

చ.2:
దురితపుకాననములలో త్రోవటు దప్పినవారికి
తెరు విదె కొమ్మని చూపెడిదేవుఁడి దెవ్వఁడొకో
పెరిగిన యాశాపాశము పెడగేలుగఁ దనుఁగట్టిన
వెరవకుమని విడిపించేటి విభుఁడిఁక నెవ్వఁడొకో

చ.3
తగిలిన యాపదలనియెడి దావానలముల చుట్టిన
బెగడకుమని వడినార్సెడి బిరుదిఁక నెవ్వఁడొకో
తెగువయుఁ దెంపును గలిగిన తిరువేంకట విభుఁడొక్కఁడే
సొ గిసి తలంచినవారికి సురతరువగువాఁడు


రేకు: 0068-03 ముఖారిసం: 01-354 నామ సంకీర్తన


పల్లవి:
ఎక్కడనున్నా నీతఁడు
దిక్కయి మాదెసఁ దిరిగీఁగాక

చ.1:
సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడు
పరమాత్మ డఖిల బంధువుఁడు
హరి లోకోత్తరుఁ డతఁడే నామతి
సిరితోఁ బాయక చెలఁగీఁగాక

చ.2:
ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడు
పన్నగశయనుఁడు భవహరుఁడు
యిన్నిటఁగ లిగిన యిందిరారమణుఁడు
మన్ననతో మము మనిపీఁగాక

చ.3:
మమతల నలమేల్మంగకు సంతత -
రమణుఁడు వేంకటరాయఁడు
జమళిసంపదల సరసవిభవముల
తమకంబున మముఁదనిపీఁగాక


రేకు: 0068-౦4 కన్నడగౌళ సం: 01-355 అథ్యాత్మ


పల్లవి:
విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడ
శాశ్వతున కూహింప జన్మమిఁక నేడ

చ.1:
సర్వపరిపూర్జునకు సంచారమిఁక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిఁక నేడ
వుర్వీధరునకుఁ గాలూఁదనొక చోటేడ
పార్వతీ స్తుత్యునకు భావమిఁక నేడ

చ.2:
నానాప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రు నకు నవ్వలివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ
జ్ఞాన స్వరూపునకుఁ గాన విననేడ

చ.3:
పరమ యోగీంద్రునకు పరులేడ తా నేడ
దురితదూరునకు సంస్తుతి నింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడ
హరికి నారాయణున కవుఁగాము లేడ


రేకు: 0౦068-05 వసంతంసం: 01-356 దశావతారములు


పల్లవి:
తలఁపులోపలి తలఁపు దైవమితఁడు
పలుమారుఁ బదియునుఁ బదియైన తలఁపు

చ.1:
సవతైనచదువులు సరుగఁ దెచ్చిన తలఁపు
రవళిఁ దరిగుబ్బలివి రంజిల్లు తలఁపు
కవగూడఁ గోరి భూకాంతముంగిట తలఁపు
తివిరి దూషకు గోళ్ళఁ దెగటార్చు తలఁపు

చ.2:
గొడగువట్టినవానిఁ గోరి యడిగిన తలఁపు
తడఁబడక విప్రులకు దానమిడు తలఁపు
వొడిసి జలనిధినిఁ గడగూర్చితెచ్చినతలఁపు
జడియక హలాయుధము జళిపించు తలఁపు

చ.3:
వలపించి పురసతులవ్రతము చెరిచిన తలఁపు
కలికితనములు చూపఁగలిగున్న తలఁపు
యిల వేంకటాద్రిపై నిరవుకొన్న తలఁపు
కలుషహరమై మోక్షగతిచూపు తలఁపు


రేకు: 0068-06 పాడి సం: 01-357 సంస్కృత కీర్తనలు


పల్లవి:
అస్మదాదీనాం అన్యేషాం
తస్మికా తస్మికా తత్రచ పునశ్చ

చ.1:
సతతాధ్యయననిష్టా-- పరాణాం దృఢ-
ప్రతినాం యతీనాం వనవాసినాం
గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర-
స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ

చ.2:
మోహినామత్యంతముష్కరాణాం గుణ-
గ్రాహిణాం భవనైకకఠినానాం
దేహసంక్షాళన విదేశకోవా దా
శ్రీహరిస్మరణవిశేష; పునశ్చ

చ.3:
కింకుర్వాణదుఃఖితజీవినాం
పంకిలమనోభయభ్రాంతానాం
శంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ-
వేంకటాచలపతేర్వినుతి: పునశ్చ