Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 67

వికీసోర్స్ నుండి


రేకు: 0067-01 ఆహిరి సం: 01-346 ఉత్సవ కీర్తనలు


పల్లవి:
నానాదిక్కుల నరులెల్లా
వానలలోననే వత్తురు గదలి

చ.1:
సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు
హితులు గొలువఁగా నిందరును
శతసహస్రయోజనవాసులు సు-
వ్రతములతోడనె వత్తురు గదలి

చ.2:
ముడుపులు జాళెలు మొగిఁదల మూఁటలు
కడలేనిధనముఁ గాంతలును
కడుమంచిమణులు కరులుఁ దురగములు
వడిగొని చెలఁగుచు వత్తురు గదలి

చ.3:
మగుటవర్థనులు మండలేశ్వరులు
జగదేకపతులుఁ జతురులును
తగువేంకటపతి దరుశింపఁగ బహు-
వగలసంపదల వత్తురు గదలీి


రేకు: 0067-02 నాటు సం; 01-347 వైరాగ్య చింత


పల్లవి:
ఎంత బోధించి యేమి సేసినఁ దన-
దొంతికర్మములు తొలఁగీనా

చ.1:
సతతదురాచారజడునకుఁ బుణ్యసం
గతి దలపోసినఁ గలిగీనా
అతిపాపకర్మబోధకుఁడై వెలయుదుష్టు
మతిఁ దలపోసిన మరి కలిగీనా

చ.2:
బహుజీవహింసాపరుఁడైనవానికి
యిహపరములు దైవ మిచ్చీనా
విహితకర్మములువిడిచినవానికి
సహజాచారము జరిగీనా

చ.3:
దేవదూషకుఁడై తిరిగేటివానికి
దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరుఁ జింతింపకుండిన
పాపనమతుఁడై బ్రతికీనా


రేకు: 0067-03 శ్రీరాగం సం: 01-348 అంత్యప్రాస


పల్లవి:
ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క
మాటలోనే యటమటమైన బ్రదుకు

చ.1:
సంతకూటములే చవులయిన బ్రతుకు
దొంతిభయములతోడి బ్రదుకు
ముంతనీళ్ళనే మునిఁగేటి బ్రదుకు
వంతఁ బొరలి కడవరంలేని బ్రదుకు

చ.2:
మనసుచంచలమే మనువయిన బ్రదుకు
దినదినగండాలఁ దీరు బ్రదుకు
తనియ కాసలనె తగిలేటి బ్రదుకు
వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు

చ.3:
తెగి చేఁదె తీపయి తినియేటి బ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు
పొ గకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు


రేకు: 0067-04 లలిత సం; 01-349 భక్తి


పల్లవి:
సకలసంగ్రహము సకలసంచయము
అకృతకృత మిది హరినామం

చ.1:
సకలవేదశాస్త్రములసార మిది
సకలమంత్రరాజంబు నిది
సకల పురాణరసముల మథుర మిది
ఆకుటిలపావనం హరినామం

చ.2:
సకలతత్వసంశయ ఖండన మిది
సకలకర్మనిశ్చయము నిది
సకలవిధిరహస్యప్రధాన మిది
అకారణహితం హరినామం

చ.3:
సకలదేవతాస్వామిప్రియం బిది
సకలలోకరక్షణము నిది
ప్రకటం వేంకటపతి నామాంకిత-
మకించనధ నం హరినామం


రేకు: 0067-05 పాడి సం: 01-350 వైరాగ్య చింత


పల్లవి:
కటకటా జీవుఁడా కాలముదోలుకరాఁగ
సటవటలనే పొద్దు జరుపే వుగా

చ.1:
సమత నన్నియును జదివి కడపటను
కుమతివై అందరిఁ గొలిచేవుగా
తమిగొని ప్రేమ నెంతయును గంగకుఁబోయి
తమకింది నూతినీరు దాగేవుగా

చ.2:
తనువుఁ బ్రాయము నమ్మి దానధర్మము మాని
చెనటివై కర్మాలు సేసేవుగా
వొనరఁగ మీఁదనా డైన యొగులు నమ్మి
దొనలనీళ్ళు వెళ్ళఁదోసే వుగా

చ.3:
యెలమితోఁ దిరువేంకటేశుఁ గొలువలేక
పొలము రాజులవెంటఁ బొయ్యేవుగా
చిలుకకువలె బుద్ధిచెప్పనఁ గానలేక
పలువమారుకే తోజుఁ బాడేవుగా


రేకు: 0067-06 సామంతం సం; 01-351 దశావతారములు


పల్లవి:
అందరి కాధారమైనఆదిపురుషుఁ డీతఁడు
విందై మున్నారగించె విదురునికడ నీతఁడు

చ.1:
సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు
వనజ భవాదులకును దైవంబైనతఁ డీతఁడు
యినమండలమునఁ జెలఁగేటిహితవైభవుఁ డీతఁడు
మునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు

చ.2:
సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడు
థరనావులమందలలో తగఁ జరించె నీతఁడు
సరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడు
ఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు

చ.3:
పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడు
సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు
తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు
వేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు