తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 66

వికీసోర్స్ నుండి


రేకు: ౦066-01 శుద్దవసంతం సం: 01-340 వైరాగ్య చింత


పల్లవి:
ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే
కందులేనిసుఖము కలనైన లేదు

చ.1:
సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కాని
సొ లది సంతోష మించుకయైన లేదు
తరుణి గల ఫలము వేదనలఁ బొరలుటె కాని
నెరసులేని సుఖము నిమిషంబు లేదు

చ.2:
తనువుగల ఫలము పాతకము సేయనె కాని
అనువైన పుణ్యంబు అది యింత లేదు
మనసుగల ఫలము దుర్మతిఁబొందనే కాని
ఘనమనోజ్ఞాన సంగతి గొంత లేదు

చ.3:
చదువుగలిగిన ఫలము సంశయంబే కాని
సదమల జ్ఞాననిశ్చయ మింత లేదు
యిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచినను
బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు


రేకు: 0066-02 ఆహిరి సం: 01-341 శరణాగతి


పల్లవి:
సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడ
మతి ననుఁగని కావుము రామా రామా రామా

చ.1:
నేసిననాబ్రహ్మత్యలు శిశుహత్యలు గోహత్యలు
ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను
యీసున నేనిపు డెరిఁగియు నెరఁగక సేసేదురితపు-
రాసులకును గడలే దిదె రామా రామా రామా

చ.2:
నమలెడి నావాచవులకు నానావిధభక్షణములు
కమిలిన దుర్గంధపు శాకమ్ములు దొమ్ములును
జముబాధల నరకంబుల సారేకు నన్నెటువలె శ్రీ...
రమణుఁడ ననుఁగాచే విటు రామా రామా రామా

చ.3:
కపటపునాధనవాంఛలు కలకాలముఁ బరకాంతలఁ
జపలపుదలఁపుల నేఁతల సంఖ్యము లరయఁగను
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో
రపమున శ్రీ వేంకటగిరి రామా రామా రామా


రేకు: ౦౦66-03 కన్నడగౌళ సం; 01-342 సంస్కృత కీర్తనలు


పల్లవి:
కరుణానిధిం గథాదరం
శరణాగతవత్సలం భజే

చ.1:
శుకవరదం కౌస్తుభాభరణం
ఆకారణప్రియ మనేకదం
సకలరక్షకం జయాధికం సే -
వకపాలకమేవం భజే

చ.2:
వురగశయనం మహోజ్ఞ్జ్వలం తం
గరుడారూఢం కమనీయం
పరమపదేశం పరమం భవ్యం
హరిం ధనుజభయదం భజే

చ.3:
లంకాహరణం లక్ష్మీరమణం
పంకజ సంభవ భవప్రియం
వేంకటేశం వేదనిలయం శు...
భాంకం లోకమయం భజే


రేకు:0066-04 సామంతం సం: 01-343 నామ సంకీర్తన


పల్లవి:
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం

చ.1:
సంతోషకరమైన సంకీర్తనం
సంతాపమణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం

చ.2:
సామజముఁ గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం

చ.3:
జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం

చ.4:
జలజాసనునినోరి సంకీర్తనం
చలిగొండసుతదలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం

చ.5
సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం


రేకు: 0౦66-05 శుద్దవసంతం సం: 01-344 ఇతర దేవతలు


పల్లవి:
ఎదుటినిధానమ వెటుచూచిన నీ-
వదె వేంకటగిరియనంతుఁడా

చ.1:
సొ గిసి భాద్రపదశుద్ధచతుర్హశి
తగువేడుక నిందరు గొలువ
పగటుసంపదలు బహుళ మొసఁగు నీ-
వగు వేంకటగిరియనంతుఁడా

చ.2:
తొలుత సుశీలకు దుశ్ళీలవలన
వెలయ సంపదల విముఖఁడవై
వలెనని కొలిచిన వడిఁ గాచినమా-
యల వేంకటగిరియనంతుఁడా

చ.3:
కరుణఁ గాచితివి కౌండిన్యుని మును
పరగినవృద్దబ్రహ్మఁడవై
దొరవులు మావులు ధ్రువముగఁ గాచిన-
హరి వేంకటగిరియనంతుఁడా


రేకు: 066-06 శుద్దవసంతం సం; 01-345 అథ్యాత్మ


పల్లవి:
ఏమి వొరలేరు యేమి మరలేదు
యీ మాయలంపటం బీఁదమోఁదనేకాని

చ.1:
సతులుగలమేలు దా సడిఁబొరలనేకాని
సతమైన సౌఖ్యస్వస్థానంబు లేదు
హితులు గలమేలు తా నిడుమఁబొరలనె కాని
హితవివేకము నరుల కెంతైన లేదు

చ.2:
తనువు లెత్తినమేలు తగులాయమేకాని
కనుఁగొనఁగ యోగభోగము గొంత లేదు
ఘనము గలమేలు తా గర్వాంధమేకాని
ఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు

చ.3:
చింతగలిగిన మేలు చివుకఁబట్టనెకాని
చింత వేంకటవిభునిఁ జింతించ లేదు
సంతు గలిగిన మేలు సంసారమే కాని
సంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు