Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 45

వికీసోర్స్ నుండి

రేకు: 0౦45-01 వరాళి సం: 01-273 వైరాగ్య చింత


పల్లవి:ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని -
       మచ్చిక పెనుఁదెవులు మానకపోయె

చ.1:పాయపు సతులగుబ్బల పెదపొట్లాల
      కాయము వడి నొత్తి కాఁచఁగను
      రాయిడిచే ఘనమాయఁగాని లోని-
      మాయపు పెనుఁదెవులు మానకపోయె

చ.2:అతివల మోహపుటధరామృతములు
      యితవుగ నోరి కందియ్యఁగను
      అదిమోహమే ఘనమాయఁగాని లోని-
      మతకరిపెనుఁదెవులు మానకపాయె

చ.3:తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద-
      నిరవుగ నిటు సుఖియించఁగను
      తిరువేంకటాచలాధీశుకృపచేఁగాని
      మరుచేతి పెనుఁదెవులు మానకపోయె

రేకు: 0౦45-02 మలహరిసం: 01-274 శరణాగతి

పల్లవి:పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షల
       యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని

చ.1:పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లు
      వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు
      చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక
      హృదయము నిలువదు చంచల మేలాగోకాని

చ.2:కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి-
      పాపము లొకనిమిషయములొఁ బాపఁగఁగలఁ డితఁడు
      కాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని-
      యేపునఁ గని మననే మిఁక నేలాగోకాని

చ.3:జడిగొని యెన్నఁడు బాయనిసంసారపుబంధంబుల
      విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు
      కడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని-
      నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని

రేకు: 0౦45-03 వరాళి సం: ౦1-275 అధ్యాత్మ


పల్లవి:వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో
       నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి

చ.1:పంచభూతములనెడి పలువన్నె నూలు
      చంచలపుగంజి వోసి చరిసేసి
      కొంచెపు కండెల నూలి గుణముల నేసి
      మంచిమంచి చీరలమ్మే మారు బేహారి

చ.2:మటుమాయములఁ దన మగువ పసిఁడి నీరు
      చిటిపొటి యలుకలఁ జిలికించఁగా
      కుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టి
      పటవాళి చీరలమ్మే బలుబేహారి

చ.3:మచ్చిక కర్మమనేటి మైల సంతలోన
      వెచ్చపు కర్మధనము వెలువచేసి
      పచ్చడాలుగాఁ గుట్టి బలువేంకటపతి
      ఇచ్చకొలఁదుల నమ్మే ఇంటిబేహారి

రేకు: 0045-04 సామంతం సం: 01-2/6 అథ్యాత్మ


పల్లవి:తొక్కనిచోట్లు దొక్కెడిమనసు
       యెక్కడ గతిలే దింకనో తెరువు

చ.1:పాపము వాయదు పై పై మనసున
      కోపము దీరదు కొంతైనా
      దీపన బాధయుఁ దీర దిన్నియును
      యేపున బెనఁగొనె నింకనో తెరువు

చ.2:యెవ్వనమదమును నెడయదు కోరికె
      కొవ్వును నణఁగదు కొంతైనా
      రవ్వగు మమకారముఁ బెడఁబాయదు
      యెవ్విధియును లేదింకవో తెరువు

చ.3:వెఱపును విడువదు వెడమాయలఁబడి
       కొఱఁతయుఁ దీరదు కొంతైనా
       తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి -
       నెఱిఁగీ నెఱఁగలే మింఁకనో తెరువు

రేకు: 0045-05 సాళంగనాట సం; 01-277 దశావతారములు


పల్లవి:ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా-
       యెట్టివారికి నింక నేది తోవయ్య

చ.1:పాముఁజంపిన యట్టిపాతకమునఁ బెద్ద -
      పాముమీఁద నీకుఁ బవళించవలసె
      కోమలిఁ జంపిన కోఱఁతవల్ల నొక్క-
      కోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె

చ.2:బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్ద
      బండిబోయుఁడవై పనిసేయవలసె
      కొండవెఱికి నట్టిగుణమునఁ దిరుమల-
      కొండమీఁద నీకుఁ గూచుండవలసె

రేకు: 0౦45-06 ముఖారిసం: 01-278 దశావతారములు


పల్లవి:అన్ని చోట్లఁ పరమాత్మ నీవు
       యిన్నిరూపుల భ్రమయింతువుగా

చ.1:పాలజలనిధినుండి బదరీవనాన నుండి
      ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
      భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
      వేలసంఖ్యలరూపై విచ్చేతుగా

చ.2:వుత్తర మధురలో నయోధ్య లోపలినుండి
      సత్ తైైన నందవ్రజాన నుండి
      చిత్తగించి పంచవటి సింహాద్రిలోననుండి
      వత్తుగా లోకములు పావనము సేయఁగను

చ.3:కైవల్యముననుండి కమలజలోకాన
      మోవఁగ శ్రీరంగమున నుండి
      యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
      నీవే నీవే వచ్చి నెలకొంటిగా

రేకు: ౦045-06 సామంతం సం; 01-279 హనుమ


పల్లవి:మాయపుదనుజులమదవైరి కపి-
        రాయఁడు వీఁడివో రామునిబంటు

చ.1:పెట్టిన జంగయు పెంపుమిగుల మొలఁ
      గట్టినకానెయు గర్వమున
      నిట్టనిలిచి పూనినచేత నడిమి-
      దిట్ట వీఁడువో దేవునిబంటు

చ.2:నవ్వుచు లంకానగరపుదనుజుల-
      కొవ్వణఁచినకపికుంజరుఁడు
      మువ్వురువేల్పుల మొదలి భూతియగు-
      రవ్వగు సీతారమణునిబంటు

చ.3:పంకజసంభవుపట్టముగట్టను
      వుంకించిన తనవొాడయనిచే
      పొం కపుకలశాపురహనుమంతుఁడు
      వేంకటరమణుని వేడుకబంటు