తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 46

వికీసోర్స్ నుండి

రేకు: 0046-01 శంకరాభరణం సం: 01-280 అథ్యాత్మ


పల్లవి: పరుసము సోఁకియు బ్రదుకవద్దా
       తిరిగి కర్మము లింక తీదీపులా

చ.1: పడిగాలువడియున్న ప్రాణచారముల-
      పడఁతుల నధములఁ బాలించితి
      యిడుమలఁ బెడఁబాప నింకనేల తెగి కొంక
      గడిచీటిచ్చియు నింకఁ గడ మున్నదా

చ.2: మితిలేనిధనములు మెరసి కానుకగొని
      అతిపుణ్యలిందరి నలరించితి
      ధృతిహీనులకునెల్ల దిక్కయి కాతువుగాక
      వ్రతముచెల్లిన నింక వట్టఁగట్లా

చ.3:పాలించి నావిన్నపమున వేంకటరాయ
      లాభించితివి నే నీలలనఁగానా
      యీలాగుననె లోకమింతాఁ గాతువుగాక
      పాలుదాగినమీఁదఁ బైకుడుపులా

రేకు: 0046-02 శ్రీరాగం సం; 01-281 నృసింహ


పల్లవి:భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా-
       కేలీ విహార లక్ష్మీనరసింహా

చ.1:ప్రళలయమారుత ఘోరభస్త్రికా ఫూత్కార
      లలితనిశ్వాసడోలారచనయా
      కులశైలకుంభినీకుముదహితరవిగగన-
      చలనవిధినిపుణ నిశ్చల నారసింహా

చ.2: వివరఘనవదనదుర్విహసననిష్ఠ్యూత -
      లవదివ్య వరుషలాలాఘటనయా
      వివిధజంతువ్రాతభువన మగ్నీకరణ
      నవనవప్రియ గుణార్థవ నారసింహా

చ.3: దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి
      కారస్ఫులింగసంగక్రీడయా
      వైరిదానవఘోరవంశభస్మీకరణ -
      కారణ ప్రకటవేంకట నారసింహా

రేకు:౦౦46-03 కన్నడగౌళ సం: 01-282 ఉపమానములు



పల్లవి:ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో
       సంతపాకలంంజఁ దెచ్చి సన్యాసిఁ జేసె

చ.1:పరిగెలేరేటివానిఁ బట్టపురాజుఁగా
      నిరతభోగము లిచ్చి నిలిపినట్లు
      ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
      అరయ నిత్తడిఁ దెచ్చి యపరంజిఁ జేసె

చ.2:కుక్కలవండుకతినే కులహీనునిఁ దెచ్చి
      వెక్కసఁబాఁపనిఁ గావించినయట్లు
      దిక్కులెఱఁగఁగఁ గష్టదేహిని నన్నుఁ దెచ్చి
      గక్కనఁ దెలుకపిండి కస్తూరి సేసె

చ.3:చెడుగైనదోమఁ దెచ్చి సింహపుఁగొదమఁగా
      బెడిదంప్తుఁ బ్రేమతోడఁ బెంచినయట్లు
      కడునధముని వేంకటపతి నను నిటు
      చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె

రేకు: ౦౦46-౦4 నాట సం: 01-283 వైరాగ్య చింత


పల్లవి:మానఁ డెన్నఁడు శరీరి దు-
        ర్మానబోధుతుఁడుగాన

చ.1:పంచభూతవికారంబులు
      పంచేంద్రియములూ
      పంచమహపాతకములకును
      పంచివేసినవిగాన

చ.2:తైగుణ్యవికారంబులు
      త్రైగుణ్యపుఁదనువులు
      శ్రీగురుఁడగుశ్రీవేంకటపత-
      భోగయోగ్యములుగాన

రేకు: 0046-05 శ్రీరాగం సం: 01-284 అంత్యప్రాస


పల్లవి:ఎన్ని బాధలఁబెట్టి యేఁచెదవు నీవిఁక నెంతకాలముదాఁకఁ గర్మమా
       మన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా

చ.1: ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁబాలించవైతి వో కర్మమా
      తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమా
      జితకాలములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా
      మతిహీనులైనట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూపవో కర్మమా

చ.2: ఆసలనియెడితాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా
      వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వో కర్మమా
      కాసుకనుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలుఁదనీవేల కర్మమా
      వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీకర్మమా

చ.3: తిరువేంకటాచలాధిపునిమాయలచేతదెసలఁదిరిగినయట్టికర్మమా
       హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
       వరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా
       పరమపురుషోత్తముని భ్రమతఁబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా

రేకు: 0౦46-06 దేవగాంధారి సం; 01-285 అథ్యాత్మ


పల్లవి:ఇన్ని నేఁతలకు నిది యొకటే
       కన్నా మన సిది కానదు గాని

చ.1: పాతకకోట్లు భవములు భస్మీ-
      భూతముసేయఁగఁ బొడవొకటే
      శ్రీతరుణీపతిచింత, నిజముగా
      యేతరి చిత్తం బెఱఁగదుగాని

చ.2: మరణభయంబులు మదములు మలినీ-
      కరణము సేయఁగఁగల దొకటే
      హరినామామృత , మందుమీఁది రతి
      నిరతము నా కిది నిలువదుగాని

చ.3: కుతిలములును దుర్గుణములునుఁ దృణీ -
      కృతములు సేయఁగ గురుతొకటే
      పరియగువేంకటపతి సేవారతి,
      గతియని మతి గని కానదుగాని