తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 43
రేకు: 0043-01 థన్నాశి సం: 01-261 కృస్ణ
పల్లవి:ఆదిమునుల సిద్ధాంజనము
యేదెసఁ జూచిన నిదివో వీఁడే
చ.1: నగిన సెలవిఁ బడు నాలుగుజగములు
మొగమునఁ జూపే మోహనము
నిగిడి యశోదకు నిధానంబై
పొగడొందీ గృహమున నిదె వీఁడే
చ.2: కనుదెరచిన నలుగడ నమృతము లటు
అనువునఁ గురసీ నపారము
వనితలు నందవ్రజమునఁ జెలఁగఁగ
మనికికి నిరవై మలసీ వీఁడే
చ.3: పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-
పరిపూర్ణ పరాత్పరుఁడు
సరుస రుక్మిణికి సత్యభామకును
వరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే
రేకు: 0043-02 సామంతం సం: 01-262 భక్తీ
పల్లవి: నారాయణ నీనాముము బుద్ధిఁ
జేరినాఁ జాలు సిరులేమి బాఁతి
చ.1: ననుపైన శ్రీవిష్ణునామము పేరు-
కొనఁగానే తేఁకువ మీరఁగా
ఘనమైన పుణ్యాలు గలుగఁగా తమ-
కనయముఁ బరమది యేమిబాఁతి
చ.2: నలువైన శ్రీహరినామము మతిఁ
దలఁచిననాబంధము లూడఁగా
యెలమి దీనిఁ బఠియించినా యీ-
కలుషములేల కలుగు నెవ్వరికి
చ.3: వేంకటపతి నామవిభవము కర్మ
పంకములెల్లఁ బరిమార్చఁగా
బింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందు-
నింక నీ సుఖమిది యేమిబ్రాఁతి
రేకు: 0043-03 ఆహిరి సం: 01-263 వైరాగ్య చింత
పల్లవి: మోహము విడుచుటే మోక్షమది
దేహ మెఱుఁటే తెలివీనదే
చ.1:ననిచిన తనజన్మముఁ గర్మముఁ దన-
పనియు నెఱుగుటే పరమ మది
తనకు విధినిషేధములుఁ బుణ్యముల-
ఘనత యెఱుగుటే కలిమి యది
చ.2:తఱిఁదఱి బ్రేమపుతల్లిదండ్రులను
యెఱఁ గనిదే కులహీన తది
చఱులఁ బొరలి యాచారధర్మములు
మఱచినదే తనమలిన మది
చ.3:కమ్మరఁ గమ్మరఁ గామభోగములు
నమ్మి తిరుగుటే నరక మది
నెమ్మది వేంకటనిలయునిదాసుల-
సొమ్ముయి నిలుచుట సుకృత మది
రేకు: 0043-04 ముఖారిసం: 01-264 సంస్కృత కీత్తనలు
పల్లవి:శ్రీశోయం సుస్థిరో యం
కౌశికమఖరక్షకోయం
చ.1:నిగమనిథినిర్మలోయం
జగన్మోహనసతీపతి-
విగతభయోయం విజయసఖోయం
భృగుమునినా సంప్రీతోయం
చ.2:సకలపతి శ్శాశ్వతోయం
శుకముఖమునిజనసులభోయం
ప్రకటబహళశోభనాధికోయం
వికచరుక్మిణీవీక్షణోయం
చ.3:సరసపోయం పరిసరప్రియోయం
తిరువేంకటాధిపోయం
చిరంతనోయం చిదాత్మకోయం
శరణాగతవత్సలోయం
రేకు: 0౦43-05 శుద్దవసంతం సం; 01-265 సంస్కృత కీర్తనలు
పల్లవి:కిం కరిష్యామి కిం కరోమి బహుళ-
శంకాసమాధానజాడ్యం వహామి
చ.1:నారాయణం జగన్నాధం త్రిలోకైక-
పారాయణం భక్తపావనం
దూరీకరోమ్యహం దురితదూరేణ సం-
సారసాగరమగ్నచంచలత్వేన
చ.2:తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ-
వరదం శరణాగతవత్సలం
పరమపురుషం కృపాభరణం న భజామి
మరణభవదేహభిమానం వహామి
రేకు: 0043-06 శ్రీరాగం సం: 01-266 వేంకటగానం
పల్లవి:ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క
యే పొద్దును భజియించంగ నితరుఁడు మరి కలఁడా
చ.1:నిరుపాధిక నిజబంధుఁడు నిరతి శయానందుఁడు
కరి వరదుఁ డితఁడే గాక ఘనుఁడధికుఁడు గలఁడా
చ.2:సంతత గుణ సంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడు
అంతర్యామితఁడే కాక అధికుఁడు మది కలఁడా
చ.3:పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడు
తిరువేంకట విభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా
రేకు: 0043-07 కురంజి సం: 91-267 నామ సంకీర్తన
పల్లవి:మందరథర మధుసూదన
నందగోపనందనా
చ.1:నరసింహ గోవింద నవనీతానంద
హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప
గురుచాపా యదుకులదీపా
చ.2:భవదూర భయహర పరిపూర్జామృత
భవనపాలన సురపాలన
భువనభూషణ పరపురుష పురాతన
నవభోగా కరుణాయోగా
చ.3;పంకజాసననుత భవ్యనిర్మలపాద-
పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు-
భంకరా క్షేమంకరా