తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 42

వికీసోర్స్ నుండి

రేకు: 0౦42-01 లలిత సం; 01-255 విష్వక్సేన


పల్లవి:నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా
       శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి

చ.1:నీవేకా కట్టిదుర నిలుచుండి హరివద్ద
      దేవతలఁ గనిపించే దేవుఁడవు
      యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ-
      సేవకుఁడవు నీవెకా సేనమొదలారి

చ.2:పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ
      దెసలఁ బంపులువంపే దీరుడవు
      వసముగా ముజ్ఞగాలవారి నిందరిని నీ-
      సిసువులఁగా నేలిన సేనమొదలారి

చ.3:దొరలై నయసురుల తుత్తుమురు సేసి జగ-
      మిరవుగా నేలితి వేకరాజ్యమై
      పరగుసూత్రవతీ పతివై వేంకటవిభు-
      సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి

రేకు: ౦౦42-02 పాడి సం: 01-256 కృష్ణ


పల్లవి:బాలులతో వీథులలోఁ బారాడువాఁడు
       కోలలెత్తుక వుట్లు గొట్టీఁ జుండీ

చ.1:నారికడపువక్కలు నానిన సనగలు
      చారపప్పుఁ దేనెలు చక్కెరలును
      పేరిననేతులు నానబియ్యాలు నుట్ల నవే
      చేరి యశోదబిడ్డకు జెప్పేరు సుండీ

చ.2:చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును
      చెక్కిన మెత్తనితూఁట చెఱకులును
      పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవే
      చక్కనెశోదబిడ్డకుఁ జాటేరు సుండీ

చ.3:నవ్వులుఁ జిటిబెల్లాలు నున్ననిచిమ్మిలులు
      నవ్వుటిడియునుఁ జిన్ని నురుగులును
      యెవ్వారు వేంకటపతి కెఱుగించ నారగించి
      కివ్వకివ్వ నవ్వ నణఁకించీ జుండీ

రేకు: 0042-03 కన్నడగౌళ సం: 01-257 వైరాగ్య చింత


పల్లవి:పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు
       పుండు మాన మందు వొయఁగదయ్య

చ.1:నెత్తురు నెమ్ములు నిండినపుంటికి
      తిత్తిలో సోదించనేరా
      నిత్తెమూ వేనీళ్లఁ గడిగినాను
      మత్తిలి వుబ్బు మానదేలయ్యా

చ.2:చల్లఁగూడు వెట్టి చల్లఁగా పొత్తు
      లెల్లఁ బెట్టి బిగియంచఁగాను
      కల్లగాదు చీము గారు తొమ్మిద్రిగండ్ల
      పిల్లలాఁ జాలఁ బెట్టెఁగదయ్యా

చ.3:ఆదినుండి పాకమైనది యెవ్వా-
      రేదిరో మొక మేరుపడదు
      ఆదరించి వేంకటాధిప నీవింక
      సోదించి మానఁజూడఁగదయ్యా

రేకు: 0042-04 సామంతం సం: 01-258 కృస్ణ


పల్లవి:భావమునఁ బరబ్రహ్మ మిదె
       కైవసమై మాకడ చూడ

చ.1:నీలమేఘ ముపనిషదర్ధం బదె
      పాలుదొంగిలెడిబాలులలో
      చాలు నదియ మాజన్మరోగముల-
      చీల దివియ మముఁ జెలగిఁచ

చ.2:తనియని వేదాంతరహంస్యంబదె
      వొనర గోపికలవుట్లపై
      పనుపడి సకలాపజ్జాలంబుల-
      పనులు దీర్చ మముఁ బాలించ

చ.3:భయములేని పెనుఁబరమపదం బదె
      జయమగు వేంకటశై లముపై
      పయిపడు దురితపుఁబౌఁజుల నుక్కున
      లయము సేయ మము లాలించ

రేకు: 0042-05 సామంతం సం; 01-259 నృసింహ


పల్లవి:నగధర నందగోప నరసింహ వో
       నగజవరద శ్రీ నారసింహ

చ.1:నరసింహ పరంజోతి నరసింహా వీర-
      నరసింహ లక్ష్మీనారసింహా
      నరసఖ బహుముఖ నారసింహా వో-
      నరకాంతక జేజే నారసింహా

చ.2:నమో నమో పుండరీకనారసింహ వో-
      నమితసురాసురనారసింహా
      నమకచమకహిత నారసింహ వో
      నముచిసూదనవంద్య నారసింహా

చ.3:నవరసాలంకార నారసింహా వో-
      ననీతచోర శ్రీనారసింహా
      నవగుణివేంకటానారసింహా వో-
      నవమూర్తి మండేము నారసింహ

రేకు: 0042-06 పాడి సం: 01-260 అధ్యాత్మ


పల్లవి:కడగనుటే సౌఖ్యముగాక యీ-
       తడతాఁకుల నెందరు చనరిట్లా

చ.1:నిలిచినదొకటే నిజమని తెలిసిన-
      తెలివే ఘన మింతియకాకా
      కలకాలము చీఁకటి దవ్వుకొనెడి-
      వలలభ్రమల నెవ్వరు వడ రిట్లా

చ.2:పరహిత మిదియే పరమని తెలిసిన
      పరిపక్వమె సంపదగాకా
      దురితవిధుల గొందుల సందులఁ బడి
      థరలోపల నెందరు చనరిట్లా

చ.3:ఘనుఁడీ తిరువేంకటపతి యని కని
      కొనకెక్కుట తేఁకువ గాకా
      పనిమాలిన యీపలులంపటముల
      తనువు వేఁచు టెంతటిపని యిట్లా