తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 41

వికీసోర్స్ నుండి

రేకు: 0౦41-01 ఆహరి సం: 01-249 అంత్యప్రాస


పల్లవి:కాక మరి యింతేల కలుగుఁ దమకేతముకు
       చేకొన్న కోరికలు చేరు నందాఁకా

చ.1:దొరతనములన్నియును దొరసి నందాఁకా
      నెరతనములన్నియును నెరపి నందాఁకా
      గరగరికలన్నియును కలసి నందాఁకా
      విరసంబులన్నియును విసుగు నందాఁకా

చ.2:యెడమాటలన్నియును యెరసి నందాఁకా
      అడియాసకోరికలు అదుకు నందాఁకా
      జడిగొన్నగుక్కిళ్లు చవిగొనయందాఁక
      వొడ లోముటలు మోహ ముడుగు నందాఁకా

చ.3:యీ వెల్లఁ దమయాత్మ యిచ్చగించినదాఁక
      శ్రీవేంకటేశుకృప చేరు నందాఁక
      లోవెలుతున్నియును లోఁగొన్న యందాఁక
      వేవేగ బంధములు వీడు నందాఁకా

రేకు: 0౦41-02 వరాళి సం: 01-250 అధ్యాత్మ


పల్లవి:ఏమి నేయువార మిఁకను
       ఆమని చేలపచ్చలాయ బ్రదుక

చ.1:దీపనమనియెడి తీరని యాస
      రేపుమాపుఁ బెడరేఁచఁగా
      తోపునేయఁగరాక దురితపుతరవుల -
      కాపదలకు లోనాయ బ్రదుకు

చ.2:వేడుకనెడి పెద్దవిడువనితరవు
      వోడ కెపుడు వొద్దనుండఁగా
      జోడు విడువరాక చులుకఁదనంబున-
      కాడికెలకు లోనాయ బ్రదుకు

చ.3:మమకారమనియెడిమాయతరవు
      తిమిర మెక్కించుక తియ్యఁగా
      విమలమూరితియైన వేంకటగిరిపతి
      అమరఁ జేరక యరవాయ బ్రదుకు

రేకు: 0041-03 ముఖారి సం; 01-251 అధ్యాత్మ


పల్లవి:కడునడసు చొరనేల కాళ్ళు గడుగఁగనేల
       కడలేని జన్మసాగర మీఁదనేల

చ.1:దురితంబునకు నెల్లదొడవు మమకారంబు_
      లరిదిమమతలకుఁ దొడ వడియాసలు
      గురుతయిన యాసలకుఁ గోరికలు జీవనము
      పరగ నిన్నిటికి లంపటమె కారణము

చ.2:తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ
      ముదుటయిన తాపమున కుండఁగఁ జోటు
      పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ-
      మదము పెంపునకుఁ దనమనసు కారణము

చ.3:వెలయ దనమనసునకు వేంకటేశుఁడు గర్త
      బలిసి యాతనిఁ దలఁచుపనికిఁ దాఁ గర్త
      తలకొన్న తలఁపు లివి దైెవమానుషముగాఁ
      దలఁచి యాత్మేశ్వరునిఁ దలఁపంగ వలదా

రేకు: 0041-04 శ్రీరాగం సం: 01-252 వేంకటగానం


పల్లవి:ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు
       సంపూర్ణమోహవిరహితు లెఱుగుఁదురు నినునిందిరారమణా

చ.1:నారీకటాక్షపటు నారాచభయరహిత-
      శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
      ఘోరసంసార సంకులపరిచ్చేదులగు-
      ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము

చ.2:రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
      భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
      ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-
      యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి

చ.3:పరమభాగవత పదపద్మసేవానిజా-
      భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
      పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-
      స్టిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ

రేకు: 0౦41-05 శంకరాభరణం సం: ౦1-253 వేంకటగానం


పల్లవి:ఎరుఁగుదు రిందరు నెఱిఁగీనెఱంగరు
       హరి దానే నిజపరమాతుమని

చ.1:నలినాసనుఁ డెఱుఁగు నారదుఁ డెఱుఁగు
      కొలఁది శివుఁ డెఱుఁగు గుహుఁ డెఱుఁగు
      యిల గపిలుఁ డెఱుఁగు నింతా మను వెఱుఁగు
      తలఁప విష్ణుఁడే పరతత్వమని

చ.2:బెరసి ప్రహ్లదుఁడు భీష్ముఁడు జనకుఁడు
      గురుతుక బలియ శుకుఁడుఁ గాలుఁడు
      వరుస నెఱుఁగుదురు వడి రహస్యముగ
      హరి యితఁడే పరమాత్ముఁడని

చ.3:తెలియదగిన దిది తెలియరాని దిది
      తెలిసినాను మదిఁ దెలియ దిది
      యిల నిందరుఁ దెలిసి రిదే పరమమని
      కలవెల్లఁ దెలిపె వేంకటరాయుఁడు

రేకు: 0041-06 దేవగాంధారి సం: 01-254 అథ్యాత్మ


పల్లవి:లేదు బహవిద్యామహసుఖము తమ-
       కీడు తమకర్మ మేమి సేయఁగవచ్చు

చ.1:నానావిధులఁ బొరలి నరుఁడు దానై వివిధ-
      మైనకర్మములే అనుభవించి
      లేనిలపంటములకు లోనై దురితా-
      దీనులై క్రమ్మరఁ దిరిగిపోవుటేకాని

చ.2:పరగ నిన్నిటఁ బొడమి బ్రహ్మణుఁడై
      సరిలేని వేదశాస్త్రములు చదివి
      అరుదయినకాంక్షచే నతిపాపపరులై
      వెరవునఁ బొడవెక్కి విరుగఁబడుటేకాని

చ.3:చేరనిపదార్థములే చేరఁగోరుటగాని
      చేరువనే యామేలు సిద్దింపదు
      ధీరులై తమలోనఁ దిరువేంకటేశ్వరునిఁ
      గోరి యిటు భజియింపఁగూడు టెన్నఁడుగాన