Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 40

వికీసోర్స్ నుండి

రేకు: 0౦40-01 సామంతం సం; 01-243 అథ్యాత్మ


పల్లవి:నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప
       నగరాజధరుఁడ శ్రీనారాయణా

చ.1:దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-
      నోపకకదా నన్ను నొడఁబరుపుచు
      పైపైనె సంసారబంథములఁ గట్టేవు
      నాపలుకు చెల్లునా నారాయణా

చ.2:చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ-
      లేకకా నీవు బహులీల నన్ను
      కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు
      నాకొలఁదివారలా నారాయణా

చ.3:వివిధనిర్భంధముల వెడలఁద్రోయక నన్ను
      భవసాగరములఁ దడఁబడఁ జేతురా
      దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ
      నవనీతచోర శ్రీనారాయణా

రేకు: 0040-02 కాంబోదిసం: 01-244 అంత్యప్రాస


పల్లవి:తెల్లవారనియ్యరో తెరువు యీ-
       పల్లదపుదొంగలెల్లఁ బారాడుతెరువు

చ.1:దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువు
      చింతపూవుఁ దేనెలచెమ్మ తెరువు
      సంతులేని సతియింటిచాయ తెరువు
      యింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు

చ.2:పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువు
      చీమకదొంతరలోనిచిన్న తెరువు
      గాములుగాచుక యుండే గాలి తెరువు
      యేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు

చ.3:అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువు
      పన్నీటి కాలువలబాట తెరువు
      కన్నుల వేంకటపతిఁ గన్న తెరువు
      మిన్నునేలఁగూడినమీఁది తెరవు

రేకు: 0040-03 శ్రీరాగం సం; 01-245 నామ సంకీర్తన

పల్లవి:నమో నారాయణాయ నమః
       సమధికానందాయ సర్వేశ్వరాయ

చ.1:ధరణీసతీఘనస్తనశైలపరిరంభ-
      పరిమళశ్రమజలప్రమదాయ
      సరసిజనివాసినీసరసప్రణామయుత-
      చరణాయ తే నమో సకలాత్మకాయ

చ.2:సత్యభామాముఖాంచనపత్రవల్లికా-
      నిత్యరచనక్రియానిపుణాయ
      కాత్యాయనీస్తోత్రకామాయ తే నమో
      ప్రత్యక్షనిజపరబ్రహ్మరూపాయ

చ.3:దేవతాధిపమకుటదివ్యరత్నాంశుసం-
      భావితామలపాదపంకజా య
      కైవల్యకామినీకాంతాయ తే నమో
      శ్రీవేంకటాచల శ్రీనివాసాయ

రేకు: 0040-04 సామంతం సం: 01-246 అధ్యాత్మ

పల్లవి: పాపినైననాపాలఁ గలిగి తోవ
        చూపుమన్న నెందుఁ జూపరు

చ. 1: ధృతిదూలి జగమెల్లఁ దొరిగి వేసరితి
         యితరాలయముల కేఁగియేఁగి వేసరితి
         గతమాలి పరులపైఁ గనలి వేసరితి
         మతిమాలి కులవిద్య మాని వేసరితి

చ. 2: విసిగి యాచారంబు విడిచి వేసరితి
        పసచెడి ప్రియములు పలికి వేసరితి
        కొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితి
        కసుగంది లోలోనె కాఁగి వేసరితి

చ. 3: కోవిదులగువారిఁ గొలిచి వేసరితి
        దైవములందరిఁ దడవి వేసరితి
        శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-
       సేవలన్నియు నేఁ జేసి వేసరితి

రేకు: 0౦40-05 శ్రీరాగం సం: 01-247 వైరాగ్య చింత


పల్లవి: సకలశాస్త్రజ్ఞానసంపన్నుఁడట చిత్త-
       మొకటికినిఁ జొరదు విథియోగమౌఁగాదో

చ.1: దొరతనంబట కలిమి దోడుగాదట మంచి-
      తరుణులట మోహమట దైన్యంబట
      విరహమట దారిద్య్రవివశుఁడౌానట చూడ
      నరయ నిది కర్మఫలమౌనో కాదో

చ.2: రాజసన్మానమట రవణహీనత్వమట
      తేజమట నలువంకఁ దిరిపెంబట
      వాజివాహనములట వాఁడి లేదట తొంటి-
      పూజఫలమిది వెలితిభోగమౌఁగాదో

చ.3:యిలయెల్ల నేలునట ఇంట లేదట మిగుల
      బలిమిగలదట సదా పరిభవమట
      చెలువలర వేడుకల శ్రీవేంకటేశ్వరుని
      గొలువనేరనివెనకఁ గొరంతలౌఁగాదో

రేకు: 0040-06 ముఖారి సం: 01-248 వైరాగ్య చింత


పల్లవి: సొరిది సంసారంబు సుఖమా యిందరికి
       వెరవెఱంగక వగల వేఁగేరు గాక

చ.1: దేహములు దలఁప సుస్థిరములా ప్రాణులకు-
      నూహింప లోభ మట్లుండుఁ గాక
      మోహంబుచే వెనకముందెఱుఁగలేక తమ-
      దేహసుఖములు మరిగి తిరిగేరుగాక

చ.2: నెలకొన్నద్రవ్యములు నిలుచునా యెవ్వరికి
      అలవి నిలుపఁగరాని యాస గాక
      బలువైన వట్టి విభ్రాంతిచే దగులువడి
      తెలిసియును దెలియ కిటు తిరిగేరు గాక

చ.3:నెఱయువిభవములెల్ల నిజములా యిందరికి
      కొఱమాలినట్టి తమగుణముగాక
      యెఱుకతోఁ దిరువేంకటేశుఁ గొలువఁగలేక
      తెఱఁగుమాలిన బుద్ధిఁ దిరిగేరుగాక