తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 4

వికీసోర్స్ నుండి

రేకు: 0004-01 శుద్ధవసంతం సం: 01-021 భక్తి
పల్లవి: దురితదేహులే తొల్లియును శ్రీ-
హరి భజించి నిత్యాధికులైరి
చ. 1: అనంతకోటి మహామునులు ఈ-
సనకాదులు నిశ్చలయశులు
ఇనశశినయనుని నితనిని మును
గని భజించి గత కల్మషులైరి
చ. 2: అతిశయమతులు మహామహులు సుఖ-
రతి విముఖులును చిరంతనులు
హిత విచారమతి నితనిని సం-
తతమును భజించి ధన్యులైరి
చ. 3: దేవతాధిపులు దివ్యులును కడుఁ-
బావనులును తగ బరహితులు
యీ వేంకటపతి నితనిని
సేవించి సుఖాంచితమతులైరి

రేకు: 0004-02 శ్రీరాగం సం: 01-022 ఆరగింపు
పల్లవి: ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి-
చ. 1: అక్కాళపాశాలు నప్పాలు వడలు
పెక్కైనసయిఁదంపుపేణులును
సక్కెరరాసులు సధ్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్యామీ
చ. 2: మీరినకెళంగు మిరియపుఁదాళింపుఁ -
గూరలు కమ్మనికూరలును
సారంపుఁబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితోఁ జేకొనవో స్వామీ
చ. 3: పిండివంటలునుఁ బెరుగులుఁ బాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలుపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చేవే వేంకటస్వామీ

రేకు: 0004-03 శ్రీరాగం సం: 01-023 తిరుపతి క్షేత్రం
పల్లవి: అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పడగల మయము
చ. 1: అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు-
నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము
చ. 2: చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
చ. 3: కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపద రూపమదివో
పావనములకెల్లఁ బావనమయము

రేకు: 0004-04 ఆహిరి సం: 01-024 అధ్యాత్మ
పల్లవి: వననిధిఁ గురిసిన వానలివి మతి-
పనిలేని పనుల భారములు
చ. 1: అడవుల వెన్నెల లారిడి బదుకులు
తడతాఁకుల పరితాఁపములు
వొడలొసఁగిన హరి నొల్లక యితరుల
బడి బడిఁ దిరిగిన బంధములు
చ. 2: కొండల నునుపులు కొనకొన మమతలు
అండలఁ కేగిన నదవదలు
పండిన పంటలు పరమాత్ము విడిచి
బండయి తిరిగిన బడలికలు
చ. 3: బచ్చన రూపులు పచ్చల కొలపులు
నిచ్చలనిచ్చల నెయ్యములు
రచ్చల వేంకటరమణునిఁ గొలువక
చచ్చియుఁ జావని జన్మములు

రేకు: 0004-05 శ్రీరాగం సం: 01-025 నామ సంకీర్తన
పల్లవి: నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీ స్తోత్రకామ కమలాక్ష
చ. 1: అరవిందనాభ జగధాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశా
కరుణాసమగ్ర రాక్షసలోకసంహార-
కరణ కమలాదీశ కరిరాజవరద
చ. 2: భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ
చ. 3: పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాద్య సుస్థిరకృపాభరణ

రేకు: 0004-06 ముఖారి సం: 01-026 అధ్యాత్మ
పల్లవి: అనుమానపుబ్రదు కది రోఁతా తన
మనసెనయనికూటమి మరి రోఁతా
చ. 1: అపకీర్తులఁబడి ఆడికెలోనై
అపవాదియౌట అదిరోఁత
వుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలు
విపరీతపుగుణవిధ మొకరోఁతా
చ. 2: తనగుట్టెల్లా నెరిఁగినవారలముందట
తనయెమ్మెలు చెప్పుకొనుట రోఁత
వనితలముందట వదరుచు వదరుచు
కనుఁగవ గాననిగర్వము రోఁత
చ. 3: భువి హరి గతియని బుద్ధిఁదలంచని-
యవమానపుమన నది రోఁత
భవసంహరుఁడై పరగువేంకటపతి-
నవిరళముగఁ గొలువని దది రోఁత

రేకు: 0004-07 దేసాక్షి సం: 01-027 భక్తి
పల్లవి: నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచి
నన్నుఁ కరుణించితే నెన్నికగాక
చ. 1: అధికునిఁ గాచు టేమరుదు నన్ను-
నధమునిఁ గాచుట యరుదుగాక నీకు
మదురమౌ టేమరుదు మధురమూ, చేఁదు
మధురమౌటే మహిలో నరుదుగాక
చ. 2: అనఘునిఁ గరుణింప నరుదుగాదు నీకు
ఘనపాపుని నన్నుఁ గాచు టరుదుగాక
కనకము గనకము గానేల, యినుము
కనకమవుటే కడు నరుదుగాక
చ. 3: నెలకొన్నభీతితో నిన్నుఁ జెనకితిఁగాక
తలకొన్నసుఖినైనఁ దలఁచనేల నిన్ను
యెలమితోఁ దిరువేంగళేఁశుడ నాపాలఁ
గలిగి నీకృప గలుగఁ జేతువుగాక

రేకు: 0004-08 పాడి సం: 01-028 వైరాగ్య చింత
పల్లవి: పాపపుణ్యములరూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు
చ. 1: అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోనిదేహభిమానంబు విడుచుటకు
రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు
చ. 2: సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు