Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 3

వికీసోర్స్ నుండి

రేకు: 0003-01 కన్నడ గౌళ సం: 01-014 అధ్యాత్మ
పల్లవి: గాలినే పోయఁ గలకాలము
తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు
చ. 1: అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
గడుగుకొననే పట్టెఁ గలకాలము
ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
దడవఁగా గొంతయుఁ బొద్దులేదు
చ. 2: కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
కలుషదేహపుబాదఁ గలకాలము
తలపోసి తనపాలిదైవమైనహరి
దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు
చ. 3: శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
గరిమలఁ గపటాలఁ గలకాలము
తిరువేంకటగిరి దేవుఁడైన హరి
దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు

రేకు: 0003-02 వరాళి సం: 01-015 అధ్యాత్మ
పల్లవి: ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-
నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా
చ. 1: అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురితకాననములతరిఁ బడి
వెడలలేక నేము విసిగేమయ్యా
చ. 2: తెవులువడినవాఁడు తినఁబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగములఁ బడి పరమామృతము నోరఁ
జవిగాక భవముల చవులాయనయ్యా
చ. 3: తనవారి విడిచి యితరమైనవారి-
వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము తిరువేంకటాధీశుఁ గొలువక
మనసులోని వాని మఱచేమయ్యా

రేకు: 0003-03 కాంబోధి సం: 01-016 తత్వములు
పల్లవి: దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంసా
చ. 1: అనువునఁ గమలవిహారమై నెలవై
వొనరి వున్నదిదె వొక హంసా
మనియెడి జీవుల మానససరసుల-
వునికి నున్న దిదె వొక హంసా
చ. 2: పాలునీరు నేర్పరిచి పాలలో-
నోలనాడె నిదె వొక హంసా
పాలుపడిన యీ పరమహంసముల-
వోలి నున్నదిదె వొక హంసా
చ. 3: తడవి రోమరంధ్రంబుల గుడ్ల-
నుడుగక పొదిగీ నొక హంసా
కడువేడుక వేంకటగిరి మీఁదట-
నొడలు వెంచెనిదె యొక హంసా

రేకు: 0003-04 శ్రీరాగం సం: 01-017 శరణాగతి
పల్లవి: నీవేకానింక నే నన్య మెఱఁగ యే-
త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య
చ. 1: అపరాధనత కోట్లయినవి వొక్క-
నెపమున ననుఁ గావనేరవా
అపరిమితదురితా లైనవి యే-
ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య
చ. 2: అతిశయముగఁ గర్మినైతిని నీ-
మతము నాకొకయింత మరపవా
ఇతర కర్మారంభహితుఁడను
గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య
చ. 3: తిరువేంకటాచలాధీశ్వరా నీ-
శరణాగతులఁ బ్రోవఁజాలవా
పరమదయానందపరుఁడవు యే-
వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య

రేకు: 0003-05 గుండక్రియ సం: 01-018 తత్వములు
పల్లవి: తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద-
వెలుఁగులోపలికి వెలుఁగేలా
చ. 1: అరయ నాపన్నుని కభయ మీవలెఁగాక
ఇరవైనసుఖిఁ గావనేలా
వఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాక
దరివానిఁ దివియంగఁ దానేలా
చ. 2: ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాక
యెసి మునక్తునిఁ గావనేలా
అనయము దుర్బలుని కన్నమిడవలెఁగాక
తనసినవానికిఁ దానేలా
చ. 3: మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాక
హితవెఱుఁగుపుణ్యుని కేలా
ధృతి హీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడు
తతిఁ గావకుండినఁ దానేలా

రేకు: 0003-06 ముఖారి సం: 01-019 భక్తి
పల్లవి: చిత్తములో నిన్నుఁ జింతించనేరక
మత్తుఁడఁనై పులుమానిసినైతి
చ. 1: అరుత లింగము గట్టి యది నమ్మఁజాలక
పరువతమేఁగిన బత్తుడఁ నైతి
సరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత-
నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి
చ. 2: ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే-
వెడమతినై నే వెర్తుడ నైతి
విడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండ
పొడగానక మందబుద్ధి నేనైతి

రేకు: 0003-07 శ్రీరాగం సం: 01-020 భక్తి
పల్లవి: అన్నియును నతని కృత్యములే
యెన్నియైనానవు నతఁడేమి సేసినను
చ. 1: అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే
చ. 2: పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీఁది చింత పాయక నిజం బైతే
నిరతిఁ బట్టినవెల్లా నిధానములే
చ. 3: మదనగురుని సేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతి భక్తి గలిగితేను
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే