తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 5

వికీసోర్స్ నుండి

రేకు: 0005-01 ఆహిరి సం: 01-029 అంత్యప్రాస
పల్లవి: పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి
ఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమి
చ. 1: అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి
కంటఁగంట నవ్వించేఘనమైనచెలిమి
వెంటవెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమి
యింటివారిచిత్తములకు నెడరైనచెలిమి
చ. 2: చెక్కుచెమట పెక్కు వలనే చిక్కనై నచెలిమి
యెక్కడౌటా తమ్ముఁదమ్ము నెఱఁగనీనిచెలిమి
చక్కఁదనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమి
లెక్కలేని యాసలెల్ల లేఁతలయినచెలిమి
చ. 3: అంకురించినట్టితలఁపు లధికమయినచెలిమి
లంకెలయినయాసలెల్లా లావుకొన్న చెలిమి
వేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయినచెలిమి
పంకజాననలకెల్లఁ బాయరానిచెలిమి

రేకు: 0005-02 ఆహిరి సం: 01-030 వైరాగ్య చింత
పల్లవి: ఆలాగుపొందులును నటువంటికూటములు
యీలాగులౌట నేఁడిదె చూడనయితి
చ. 1: అడియాసచూపులకు నాసగించితిఁగాని
వెడమాయలని లోను వెదకలేనైతి
కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగాని
యెడలేనిపరితాప మెఱఁగలేనైతి
చ. 2: చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగాని
తరితీపులని లోనుఁ దలఁపలేనైతి
వరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగాని
గరువంపుఁ బొలయలుక గానలేనైతి
చ. 3: శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగాని
దేవోత్తమునిలాగుఁ దెలియలేనైతి
యీవైభవముపై నిచ్చగించితిఁగాని
యీవైభవానంద మిది పొందనైతి

రేకు: 0005-03 గౌళ సం: 01-031 వైరాగ్య చింత
పల్లవి: ఎన్ని లేవు నా కిటువంటివి
కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి
చ. 1: అరయ నేఁజేసిన యపరాధములు చూచి
కరుణించి వొకడైనాఁ గాచునా
కరచరణాదులు కలిగించిననిన్నుఁ
బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి
చ. 2: యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-
పాతక మొకఁడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-
చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి
చ. 3: శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల-
సేవ కొకఁడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి

రేకు: 0005-03 గుండక్రియ సం: 01-032 గురు వందన, నృసింహ
పల్లవి: ఎంతటివారలు నెవ్వరును హరిఁ
జింతిచక నిశ్చింతులు గారు
చ. 1: అతిజితేంద్రియులు ననశనవ్రతులు-
నతుల తపోధనులగువారు
చతురానన గురుస్మరణము దొరకక
తతి నూరక పుణ్యతములుగారు
చ. 2: అనఘులు శాంతులు నధ్యాత్మతతులు-
ననుపమ పుణ్యులు యాజకులు
వనజోదరు ననవరతముఁ దలఁచక
వినుతి స్మృతికిని విభుదులుగారు
చ. 3: దురిత విదూరులు దుర్మతిహీనులు
నిరతానందులు నిత్యులును
తిరువేంకటగిరిదేవుని గొలువక
పరమార్గమునకు బ్రహ్మలు గారు

రేకు: 0005-04 సామంతం సం: 01-033 వైరాగ్య చింత
పల్లవి: పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ -
హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా
చ. 1: అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు-
నపగతణ్యుఁడ నలసుఁడను
కపటకలుషపరికరహృదయుఁడ నే-
నపవర్గమునకు నరుహుఁడనా
చ. 2: అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడ
హతవివేకమతి నదయుఁడను
పతిలేని రమాపతి మిముఁదలఁచలే
నతులగతికి నే నరుహుఁడనా
చ. 3: అనుపమవిషయపరాధీనుఁడ నే-
ననంతమోహభయాతురుఁడ
వినుతింపఁగ దిరువేంకటేశ ఘను-
లనఘులుగాక నే నరుహుఁడనా

రేకు: 0005-05 నాదరామక్రియ సం: 01-034 వైరాగ్య చింత
పల్లవి: ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
జెన్నలర హరిసేవ సిద్దించుకొరకు
చ. 1: అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-
కిరవైనశాస్త్రంబు లెరుకకొరకు
తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు
సరిలేనిదానములు జన్మములకొరకు
చ. 2: మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు
సమవివేకంబు శాంతములకొరకు
అమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-
జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు

రేకు: 0005-06 సామంతం సం: 01-035 శరణాగతి
పల్లవి: ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా
చ. 1: అపరాధిఁగనక నన్నరసి కావుమని
అపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాక
నెపములేక నన్ను నీకుఁ గావఁగ నేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా
చ. 2: ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాక
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప