Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 35

వికీసోర్స్ నుండి

రేకు: 0035-01 బౌళి సం; 01-214 భక్తి

పల్లవి: ఎండగాని నీడగాని యేమైనఁగాని
       కొండలరాయఁడే మా కుల దైవము

చ.1: తేలుగాని పాముగాని దేవపట్టయినఁగాని
      గాలిగాని ధూళిగాని కాని యేమైనా
      కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి
      నీలవర్థుఁడే మానిజ దైవము

చ.2: చీమగాని దోమ గాని చెలఁది యేమైనఁని
      గాముగాని నాముగాని కాని యేమైనా
      పాములన్నిమింగే బలుతేజిపైనున్న
      థూమకేతువే మాకు దొర దైవము

చ.3:పిల్లిగాని నల్లీగాని పిన్న యెలుకైనఁగాని
      కల్లగాని పొల్లగాని కాని యేమైనా
      బల్లిదుఁడై వేంకటాద్రిపైనున్నయాతఁడే మ-
      మ్మెల్లకాలమును నేలేయింటి దైవము

రేకు: 0035-02 ఆహిరి సం: 01-215 వైరాగ్య చింత

పల్లవి:ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాక
       బందెపసురమవైతి బాపు జీవుఁడా

చ.1: తోలుబొక్కలోనఁ జొచ్చి తూలేటిఁయాకలిచేత
      పాలుమాలి యిందరికి బంటుబంటవై
      యేలినవానిఁ గానక యేచినయాసల వెంట
      కూలికిఁబో దొరకొంటి కూళజీవుఁడా

చ.2: తీఁటమేనిలోనఁ జొచ్చి దిమ్మరిదొంగలచేత
      మూఁటగట్టించుక నీవు మూలదొరవై
      గాఁటపువిభునిచేతిఘనత కోరికలకు
      వేఁటకుక్కవైతివి వెట్టిజీవుఁడా

చ.3:చీమలింటిలోనఁ జొచ్చి చిక్కువడి అందరిలో
      దోమకరకుట్లకు తోడిదొంగవై
      యేమరి వేంకటవిభు నెఱఁగక జాడుఁజొప్ప
      నాము మేయ దొరకొంటి నాలిజీవుఁడా

రేకు: 0035-03 శ్రీరాగం సం: 01-216 వైరాగ్య చింత

పల్లవి:వేదనఁ బొరలే వెరవేలా
       యీదయ విధి దన కీయదా

చ.1:తత్తరపాట్లు తనువికారములఁ
      జిత్తము దెంచే చెలువేలా
      బత్తితో దాఁచిన పరధనంబుంగొని
      సత్తయి వుండుట చాలదా

చ.2:యెక్కువతమకపుటింతులఁ బొందక
       పక్కుచువాడేవయసేలా
       మొక్కుచు దాఁచిన మూలథనము గన-
       నెక్కువ దైవం బియ్యదా

చ.3:సేఁతలఁ బొరలెడి చిక్కులఁ గెరలెడి-.
      రోఁతల యీనేరుపులేలా
      బాఁతిగ వేంకటపతిరతిఁ జిత్తపు-
      టూఁతలఁ గోరిక లూనవా

రేకు: 0౦35-04 ముఖారి సం: 01-217 అధ్యాత్మ

పల్లవి:వెరపులు నొరపులు వృథా వృథా
       ధరపై మరయంతయును వృథా

చ.1: తడయక చేసినదానంబులు వృథ
      యెడనెడ నెఱిఁగిన యెఱుక వృథా
      వొడలిలోనిహరి నొానరఁగ మతిలోఁ
      దడవనిజీవమె తనకు వృథా

చ.2: జగమునఁ బడిసినసంతానము వృథ
      తగిలి గడించినధనము వృథ
      జగదేకవిభుని సకలాత్ముని హరిఁ
      దెగి కొలువనిబుద్దియును వృథా

చ.3:పనివడికూడిన పరిణామము వృథ
      వొనరఁగనుందినవునికి వృథా
      ఘనుఁడుగు తిరువేంకటగిరి హరిఁగని
      మననేరని జన్మములు వృథా

రేకు: 0035-05 ఆహిరి సం: 01-218 వైరాగ్య చింత

పల్లవి: ఏమి గలిగెను మా కిందువలన
       వేమారుఁ బొరలితిమి వెఱ్ఱిగొన్నట్లు

చ.1: తటతటన నీటిమీఁదట నాలజాలంబు-
      లిటునటుఁ జరించవా యీఁది యీఁది
      అటువలెనెపో తమకమంది సంసారంపు-
      ఘటనకై తిరిగితిమి కడ గానలేక

చ.2: దట్టముగఁ బారావతముల మిన్నుల మోవ
      కొట్టఁగొన కెక్కవా కూడి కూడి
      వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు
      బట్ట బయ లీఁదితిమి పనిలేనిపాట

చ.3:బెరసి కుమ్మరపురువు పేఁడలోపలనెల్ల
      పారలదా పలుమారుఁ బోయిపోయి
      వరుస జన్మముల నటువలెనె పొరలితిమి
      తిరువేంకటాచలాధిపుఁ దలఁచలేక

రేకు: 0035-06 ఆహిరి సం: 01-219 అధ్యాత్మ


పల్లవి: హరినెఱఁగనిపుణ్య మంటేరుగాన
       దురితాలే దురితాలే దురితాలే సుండీ

చ.1: దొడ్డపుణ్యములు సేసి తుదలేనిసంపదలు
      అడ్డగించుకొని రాసులగుగురుతు
      జడ్డులేని హరికధ చవిలేకుండిన నిట్టే
      గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ

చ.2: వలేనని మేలేల్ల వడిఁబేసి కైవల్య-
      మలమి చేతికిలోననగు గురుతు
      తలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతా
      అలయికే అలయికే అలయికే సుండీ

చ.3:తిరమైన తీర్జాలు దిరిగి యందరిలోన
      ధరం బుణ్యఁడవుట యంతకు గురుతు
      తిరువేంకటపతిఁ దెలియకుండిన నంతా
      విరసాలే విరసాలే విరసాలే సుండీ