Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 34

వికీసోర్స్ నుండి

రేకు: 0034-01 దేసాక్షి సం: 01-208 అధ్యాత్మ


పల్లవి:పోయఁ బోయఁ గాలమెల్ల గాలమెల్ల పూఁట పూఁటకు
       రోయనిరోఁతలు చూచి రుచి చూరఁబోయ

చ.1:తాడిమానెక్కేటివాని తడయక పట్టిపట్టి
      తోడఁదోడ నెందాఁకాఁ దోయవచ్చును
      కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే
      ఆడికెలకులోనై తనియక పోయ

చ.2:మన్నుదినియేటిదూడ మానుమంటా మొత్తిమొత్తి
      కన్నిగట్టి యెందాఁకఁ గాయవచ్చును
      సన్నపుటాస లమీఁదిచరిఁబడ్డదేహమిది
      కన్నపుఁగత్తులచూపు కట్టరాకపోయ

చ.3:హేయము దొక్కకుమన్న యేచి తినేననేవాఁడు
      చాయకు రాకున్న నేమిసేయవచ్చును
      మాయలవేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ
      పాయక యాతనిఁజేరి భయమెల్లఁ బోయ

రేకు: 0034-02 మాళవిగౌళ సం: 01-209 అథ్యాత్మ


పల్లవి: పాపమెరంగనిబ్రహ్మఁ డు యెందుఁ
       జూపరానిచోట చూపీనయ్యా

చ.1: తనివోక జీవముతలకాయ నంజుడు
      పనివడి తిని తిన్న బ్రాహ్మఁడు
      యెనసి యెదిరిఁ దన్ను నెఱఁగక విభుఁడై
      ఘనవంశము మంటఁ గలపీనయ్యా

చ.2: యెవ్వారు నెఱఁగనియెముకలయింటిలో
      పవ్వళింపుచునున్న బ్రహ్మఁడు
      జవ్వనమదమున జడినేటికోమలీఁ
      బువ్వులతోఁటలోఁ బొదిగీనయ్యా

చ.3:చెలఁగి కన్నెరికము చెడనిపడుచుఁ దెచ్చి
      పలువేదనలఁబెట్టే బ్రహ్మఁడు,
      తెలిసి వేంకటాధిపునిదాసుఁడై
      పులుగు పంజారాన బొదిగీనయ్యా

రేకు: 0034-03 శంకరాభరణం సం: 01-210 అథ్యాత్మ


పల్లవి: ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే
       వున్నవారియీవులెల్ల నొద్దికయ్యీనా

చ.1: తెగనియాపదలకు దేవుఁడే కలఁడుగాక
      వగలుడుపఁ బరులవస మయ్యీనా
      నొగిలి యితరలకు నోళ్ళుదెరచిన
      నగుఁబాటేకాక మానఁగఁబొయ్యీనా

చ.2: అగ్గలపుదురితాలు హరియే మానుపుఁగాక
      బగ్గన నొక్కరు వచ్చి పాపఁబొయ్యేరా
      తగ్గుముగ్గులైనవేళ తలఁచినవారెల్ల
      సిగ్గుఁబాటేకాక తమ్ముఁ జేరవచ్చేరా

చ.3:యెట్టు నేసినను వేంకటేశుఁడే నేరుచుఁగాక
      కట్టఁగడవారెల్లఁ గరుణించేరా
      యిట్టే యేమడిగిన నీతఁడే యొసఁగుఁగాక
      వుట్టిపడి యెవ్వరైనా నూరడించేరా

రేకు: 0034-04 ఆహిరి సం: 01-211 కృస్ణ

పల్లవి:ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో
       తటతట నిరువంక దాఁటీ వీఁడే

చ.1: తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి
      దారుణలీలఁ బెదవు లవుడుకఱచి
      కారించి చాణూరుఁ గడుభంగపఱచి
      వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే

చ.2: పిడుగడచినయట్టు పెడచేత నడిచి -
      పడనీక పురములోపలఁ జొరఁబొడిచి
      తొడిచి చాణూరు నెత్తుక దయవిడిచి
      వడివెట్లి నెత్తురు వడిచీ వీఁడే

చ.3:బుసకొట్టుచును వూరుపులఁ జెమరించి
      మసిగాఁగ బెదపెదమల్లుల దంచీ-
      నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి
      ముసిముసినవ్వుల ముంచీ వీఁడే

రేకు: 0034-05 ఆహిరి సం: 01-212 అధ్యాత్మ


పల్లవి:ఆసమీఁద విసుపౌదాఁక యీ
       గాసిఁ బరచుతన కపటమే సుఖము

చ.1: తిరమగుఁ కర్మము దెగుదాఁక తన-
      గరిమ సుఖము పాగడునందాఁక
      పరమార్గం బగపడుదాఁక తన-
      పరితాపపు లంపటమే సుఖము

చ.2: కాయము గడపల గనుదాఁక యీ
      మాయ దన్ను వెడమరుదాఁక
      రాయడి మదము గరఁగుదాక యీ-
      రోయఁదగిన తనరూపమే సుఖము

చ.3:లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీ
      యంకెల భవము లెరవౌదాఁక
      వేంకటపతిఁ దడవిన దాఁక యీ
      కింకురువాణపు గెలుపే సుఖము

రేకు: 0034-06 సాళంగం సం: 01-213 అథ్యాత్మ


పల్లవి: తన కర్మమెంత చేఁతయు నంతే
       గొనకొన్న పనియంత కూలీనంతే

చ.1:తలఁపులో హరి నెంత దలఁచె నేఁడే వాని
      కలిమియు సుఖమును గల దంతే
      తులందూఁచ బైఁడెంత తూఁకము నంతే
      నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే

చ.2:సిరివరుపూజెంత సేసె నేఁడే వాని-
      దరియును దాపు నెంతయు నంతే
      పురిగొన్న యీవెంత పొగడూ నంతే
      నరపతిచనవెంత నగవూ నంతే

చ.3:శ్రీవేంకటపతి చింత యంత నేఁడే
      భావపరవశము పలుకూ నంతే
      దైవము కృప యంత తానూ నంతే
      యేవంక జయమెంత యిరవూ నంతే