Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 33

వికీసోర్స్ నుండి

రేకు: 0033-01 శ్రీరాగం సం; 01-202 భక్తి


పల్లవి:వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు
       నెన్ని వలసిన దమయేలిటివే కావా

చ.1: తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు
       కలుగుటే కలుగువలెఁగాక
       వలనైన భోగములు వైభవంబులు మరియు
       కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా

చ.2: పదిలముగ హరినామపఠన మంత్రము నోరు
       కదియుటే కలుగవలెఁగాక
       తుదలేని సంపదలు తొలగని ముదంబులును
       కదలకెప్పుడుఁ దమకు గలిగినవె కావా

చ.3: యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబు
       కాంచుటే కలుగవలెఁగాక
       అంచితంబైన నిత్యానంద పదవులను
       మించి తమయెదుటఁ బ్రభనించినవె కావా

రేకు: 0033-02 ముఖారి సం: 01-203 అధ్యాత్మ


పల్లవి:పసలేని యీబ్రదుకు
       అసలు చొచ్చి చొచ్చి అలసినట్టాయె

చ.1:తొల్లిటిజన్మాదులఁ గానినరరూపు
      పల్లించుకొన్న యీబ్రదుకు
      కల్లసుఖములచే కనలి కమ్మర
      ముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ

చ.2:బూటకములనెల్లఁ బొరలి సంసారంపు-
      పాటు దెచ్చినయీబ్రదుకు
      నీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము -
      చాటు కేఁగినయట్టిచందమాయె

చ.3:పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడి
      పగలు రేలైనయీబ్రదుకు
      తగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండి
      యెగసి మేడమీఁది కేఁగినట్లాయె

రేకు: 0033-03 ముఖారిసం: 01-204 వైరాగ్య చింత


 
ఫల్లవి:ఎంతమానుమన్నఁ జింతలేల మానునే
       పంతపుమనసు హరిపై నుంటేఁగాక

చ.1: తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగు
       భారపుమమతఁ బెడఁబాసినఁగాక
       వూరటగా మమత నేనొల్లనంటే నేల మాను
       వోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక

చ.2: వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడు
      తోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాక
      ఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికి
      మాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక

చ.3: పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్లు
       యిట్టే వేంకటపతి యిచ్చినఁగాక
       యిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చు
       వొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక

రేకు: 0033-04 సామంతం సం: 01-205 భక్తి


పల్లవి:చాలదా హరిసంకీర్తనంగల-
       మే లిది దీననే మెరసిరి ఘనులు

చ.1:తలఁప వేదాశాస్త్రములు గానక
      అలరుచు వాల్మీకాదులు
      తలకొని హరిమంత్రమే దగఁ బేర్కొని
      అలవిమీరఁ గడు నధికములైరి

చ.2:యితరదైవముల నెఱఁగనేరక
      ప్రతిలేనిమహిమఁ బార్వతి
      మతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొని
      సతతము హరులో సగమై నిలిచె

చ.3:చదువులుఁ బలుమరుఁ జదువనోపక
      అదివో నారదాదులు
      పదిలపువేంకటపతిహరినామమే
      వదల కిదియ జీవనమై మనిరి

రేకు: 0033-05 సామంతం సం; 01-206 అథ్యాత్మ


పల్లవి:పోయఁబోయఁ గాలమెల్ల పూఁటపూఁటకు
       చేయి నోరు నోడాయ చెల్లఁబో యీరోఁతలు

చ.1:తిప్పన తొప్పన కేతు దేవన బావన గనున్న
      పప్పన బొప్పనగారి బాడిపాడి
      కుప్పలుఁదెప్పలు నైనకోరికెలు మతిలోన
      యెప్పుడుఁ బాయకపోయ నెన్ని లేవు రోఁతలు

చ.2:కాచన పోచన మాచు కల్లప బొల్లప మల్లు
      బాచన దేచనగారిఁ బాడిపాడి
      యేచినపరసుఖము నిహమును లేకపోయ
      చీచీ విరిగితిమి చెప్పనేల రోఁతలు

చ.3:బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి-
      బక్కల నిందరి నోరఁ బాడిపాడి
      యెక్కువైన తిరువేంకటేశునిఁ దలఁచలేక
      కుక్కకాటుఁ జెప్పుటాటై కూడె నిన్ని రోఁతలు

రేకు: 0033-06 సాళంగనాట సం: 01-207 విష్వక్సేన


పల్లవి:పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగ
       ఘటన నఖిలమును గాతువుగా

చ.1:తత్తుమురుగ దైత్యుల దనుజుల నవి
      మొత్తి మోఁది చలమునఁ జెలగి
      జొత్తుపాపలుగ సారిది విరోధుల-
      నెత్తురు వడుతువు నీవేకా

చ.2:తళతళమెఱుచుసుదర్శనాయుథం-
      బలరుచు నొకచే నమరఁగను
      బలుదైత్యులదొబ్బలుఁ బేగులు నని
      నిలువున జెండుదు నీవేకా

చ.3:దిట్టవు సూత్రవతీపతి వసురలఁ
      జట్టలు చీరఁగఁ జతురుఁడవు
      రట్టడి వేంకటరమణుని వాకిటి-
      పట్టపు నేనాపతిపటకా