తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 32

వికీసోర్స్ నుండి

రేకు: 0032-01 పాడి సం: 01-195 వైరాగ్య చింత


పల్లవి:ఏఁటికి నెవ్వరిపాందు యిస్సిరో చీచీ
       నాటకములాల చీచీ నమ్మితిఁగా మిమ్మును

చ.1:జవ్వనమదమ చీచీ చక్కఁదనమరో చీచీ
      రవ్వైసరాజసగర్వమరో చీచీ
      కొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీ
      నవ్వులదేహము చీచీ నమ్మితిఁగా మిమ్మును

చ.2:ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెమ చీచీ
       బచ్చురపణములోనిబచ్చన చీచీ
       తెచ్చుకోలుతాలిములదిట్టతనమరో చీచీ
       పుచ్చినపోకరో చీచీ పోయఁగా మీకాలము

చ.3:సిరులచీఁకటి చీచీ సిలుగుసంపద చీచీ
      వరవిభవమ చీచీ వాసిరో చీచీ
      కరుణించెఁ దిరువేంకటగిరిపతి నన్ను
      విరసవర్తన చీచీ వీడెఁగా మీభారము

రేకు: 0౦౩2-02 సామంతం సం; 01-196 భగవద్గీత కీర్తనలు

పల్లవి:మనుజుఁడైపుట్టి మనుజుని సేవించి
       అనుదినమును దుఃఖమందనేలా

చ.1:జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
      పట్టెఁడుగూటికై బతిమాలి
      పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
      వట్టిలంపటము వదలనేరఁడుగాన

చ.2:అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-
      గందరి రూపము లటు దానై
      అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
      అందరానిపదమందె నటుగాన

రేకు: 0032-03 నాట సం; 01-197 ఆధ్యాత్మ

పల్లవి:లంకెలూడుటే లాభము యీ-
       కింకరులను నలఁగెడికంటెను

చ.1: జంపులఁ జంపక సరుగనఁబాసేటి-
      లంపటమేపో లాభము
      కంపుమోపుతోఁ గనలి శరీరపు
      కొంపలోన వేఁగుట కంటెను

చ.2: యీవలనావల నేచేటిల యాసల-
       లావు దిగుటెపో లాభము
       యేవగింతలకు నిరవగు నరకపు-
       కోవులఁబడి మునుఁగుటకంటెను

చ.3: తివిరి వేంకటాధిపుదాసులకృప-
       లవలేశమెపో లాభము
       చవులని నోరికి సకలము దిని తిని
       భవకూపంబులఁ బడుకంటెను

రేకు:0032-౦4 నాట సం; 01-198 అధ్యాత్మ

పల్లవి:తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు
       మనసు చంచలబుద్ధి మానీనా

చ.1:జడ్డుమానవుఁడు చదువఁజదువ నాస
      వడ్డివారుఁగాక వదలీనా
      గుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగిన
      దుడ్డుపెట్లే కాక దొరకీనా

చ.2:దేవదూషకుఁడై తిరిగేటివానికి
      దేవతాంతరము తెలిసీనా
      శ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాక
      పావనమతియై పరగీనా

రేకు: 0032-05 ఖైరవి సం: 01-199 అధ్యాత్మ


పల్లవి:సడిబెట్టెఁగటకటా సంసారము చూడ-
       జడధి లోపలి యీఁత సంసారము

చ.1:జమునోరిలో బ్రదుకు సంసారము చూడ
      చమురు దీసిన దివ్వె సంసారము
      సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ
      సమరంబులో నునికి సంసారము

చ.2:సందిగట్టినతాడు సంసారము చూడ
      సందికంతలతోవ సంసారము
      చుందురునిజీవనము సంసారము చూడ
      చంద మేవలెనుండు సంసారము

చ.3:చలువలోపలివేఁడి సంసారము చూడ
      జలపూఁతబంగారు సంసారము
      యిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకు
      చలువలకుఁ గడుఁజలువ సంసారము

రేకు: 0032-06 థన్నాశి సం: 01-200 వేంకటగానం

పల్లవి: సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము
       నేమమునఁ బెనగొనియె నేఁడు నీవనక

చ.1:జగతిఁ బ్రాణులకెల్ల సంసారబంధంబు
      తగుల బంధించు దురితంపుఁ గర్మమున
      మగుడ మారుకుమారు మగువ నీవురముపై
      తెగికట్టి రెవ్వరో దేవుండవనక

చ.2:పనిలేక జీవులను భవసాగరంబులో
      మునుఁగ లేవఁగఁ జేయు మోహదోషమున
      పనిపూని జలధిలోఁబండఁబెట్టిరి నిన్ను
      వెనకెవ్వరో మొదలివేలుపనక

చ.3:వుండనియ్యక జీవనోపాయమున మమ్ము
      కొండలను గొబల తతిగొని తిప్పుఫలము
      కొండలను నెలకొన్న కోనేటిపతివనఁగ
      నుండవలసెను నీకు నోపలేననక

రేకు: 0032-07 దేవగాంధారి సం: 01-201 అథ్యాత్మ


పల్లవి:ఎందరివెంట నెట్లం దిరుగవచ్చు
       కందువెఱిఁగి చీఁకటిదవ్వుకొనుఁగాక

చ.1:తల రాయిగాఁగ నెందరికి మొక్కెడిని
      తెలివిమాలినయట్టిదేహి
      కొలఁదిమీరినదేవకోట్లు దనలోన
      కలవాని నొక్కనినే కొలుచుఁగాక

చ.2:కాలీచపడఁగ నెక్కడికి నేఁగెడిని
      పాలుమాలినయట్టిప్రాణి
      మేలిమిజగములు మేనిలోఁ గలవాఁడు
      పాలిటివాఁడై ప్రణుతికెక్కుఁగాక

చ.3:నూరేంట్ల నెందరి నుతియింపఁ గలవాఁడు
      చేరఁదావులేనిజీవి
      శ్రీరమణీశుఁడు శ్రీవేంకటేశుని
      కోరికెఁ దలఁచి నుతి కొల్ల గొనుటగాక