తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 31

వికీసోర్స్ నుండి

రేకు: 0031-01 ఆహిరి సం: 01-188 వైరాగ్య చింత

పల్లవి:పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసా
      పారిన నీవే బడగయ్యెదవు చేరువ నాఁడే చెప్పనె మనసా

చ.1:చింతించకుమీ శివునివైరిచే చిక్కువడకుమీ వోమనసా
     కంతువారకము వయసుఁ బ్రాయములు కావటికుండలు వోమనసా
     యెంతే మేలుఁగీ డేకాలము ఎప్పుడు నుండదు వోమనసా
     సంతరించుకో వానిని మనసున సంతోషముగా వోమనసా

చ.2:యెన్నికలే తలపోయకుమీ యేమరకుండుమి వోమనసా
    కన్న విన్న వారిలో నెప్పుడు కాకుపడకుమీ వోమనసా
    పున్నమమాసలు పుడమిలో బదుకులు పోయివచ్చేవి వోమనసా
    మిన్నో నేలనిమన్న దినములో మీఁదుచూడకుమి వోమనసా

చ.3:కన్నులసంగాతము సేయకుమీ కళవళించకుమి వోమనసా
    వన్నెలమాటలు చెవులఁబెట్టక వాసివిడువకుమి వోమనసా
    మున్నిఁటిసురలు బ్రహ్మదులకై నను ముక్తి సాధనము వోమనసా
    వెన్నుని వేంకటగిరిఁ దలఁచుము వేసారకుమీ వోమనసా

రేకు: 031-2 ముఖారిసం: 01-189 వైరాగ్య చింత

పల్లవి:ఏల పొరలేవులేవే యింతలోనిపనికి
      మాలయింటితోలుకప్పు మాయ లిటువంటివి

చ.1:చిక్కులతమకముల చీఁకటిగప్పిననాఁడు
      యెక్కువ వాసనలౌ హేయపుమేను
      వెక్కసపు ప్రియమది విరిగితే రోఁతలౌ
      లక్కపూఁతకపురు లీలాగు లిటువంటివి

చ.2:మించినచిత్తములో మేలుగలిగిననాఁడు
     యంచరానిచవులౌ నెంగలిమోవి
     పెంచుకంటే కష్టమౌ ప్రియముదీరిననాఁడు
     చంచలపు చిత్తములచంద మిటువంటిది

చ.3:వెల్లి గొనుసురతపువేళ మరపులయింపు
      కొల్లలాడుటౌ కొనగోరితాఁకులు
      నల్లితిండౌ మరి మీఁద మరగితే రోఁతలౌ
      వుల్లమిచ్చే వేంకటేశువొద్ది కిటువంటిది

రేకు: 0031-03 ముఖారిసం: 01-190 వైరాగ్య చింత


పల్లవి:ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు
       బట్టబయలుగాఁ బరచీ నొకటి

చ.1:చెడనిమట్టిలోఁ జేసినముద్దే
      నడుమ ముంచుకొన్నది వొకటి
      తడియనినీరై తడివొడమింపుచు
      వడిసీని వేపుర వడితో నొకటి

చ.2:పాయనితనుదీపనములుగా నటు
      చేయుచు మది వేఁచీ నొకటి
      కాయపుచుట్టరికమ్ములు చేయుచు
      రేయుఁబగలు విహరించీ నొకటి

చ.3:యిన్నియుఁదానే యేచి కపటములు
      పన్నీ నిదె లోపల నొకటి
      వెన్నెలచూపుల వేంకటేశ నిను
      యెన్నికతోఁ గడు నెదిరీ నొకటి

రేకు: 0031-04 ముఖారిసం: 01-191 దశావతారములు

పల్లవి:బ్రహ్మ గడిగిన పాదము
       బ్రహ్మము దానె నీపాదము

చ.1:చెలఁగి వసుధ గొలిచిన నీపాదము
      బలి తల మోపిన పాదము
      తలఁకక గగనము దన్నిన పాదము
      బలరిపుఁ గాచిన పాదము

చ.2:కామినిపాపము గడిగిన పాదము
      పాముతల నిడిన పాదము
      ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
      పామిడి తురగపుఁ పాదము

చ.3:పరమయోగులకుఁ బరిపరి విధముల
      పరమొసఁగెడి నీపాదము
      తిరువేంకటగిరి తిరమని చూపిన-
      పరమపదము నీపాదము

రేకు: 0౦31-05 సామంతం సం; 01-192 వేంకటగానం


పల్లవి:తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన
       లోనఁ బెట్టుకొని మాకు లోనైనవాఁడు

చ.1:చదవించి, కూడవెట్టి, జారకుండ నిల్లుగట్టి
      బెదురులేని బుద్ది పిన్ననాఁడే చెప్పి
      యెదరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి
      పదిలమై తమ్ముఁ బాలించువాఁడు

చ.2:మోహవియోగమ్ము, మొహానురాగమ్ము
      దేహవిబాగంబు దెలిపిని కలికి
      ఐహికమున వేంకటాధీశుఁడై సర్వ
      దేహరక్షకుఁడై తిరుగుచున్నాఁడు

రేకు: 0౦31-06 బౌళి సం; 1-193 వైరాగ్య చింత


పల్లవి:చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె
      ఆదలించి తగదు నీ కనువారు వేరీ

చ.1:చిత్త మింద్రియములచేఁ జిక్కి , కడు మద-
     మెత్తిన వద్దన నిఁక వేరీ
     హత్తినమనసు మోహాదులతోఁ గూడి
     తత్తరించిన మాన్పఁదగువారు వేరీ

చ.2: జీవుఁడిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁ
      బోవఁజొచ్చిన బుద్ధిపొల మేది
      శ్రీవేంకటేశుని చింతాపరతఁ గాని
      కావఁగ నాత్మకు గతి దానేది

రేకు: 0031-07 కన్నడగౌళ సం; 01-194 వైరాగ్య చింత

పల్లవి:పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణిని
       శ్రీయుతుఁ దలఁచుఁడీ నరులు మాయఁబడి చెడక

చ.1:చిత్తము చేకూరుచుకొని చిత్తైకాగ్రతను
      చిత్తజగురునిఁ దలఁచుఁడీ చిత్తజుఁ జొరనీక

చ.2:బూరుగుమాఁకునఁ జెందినకీరముచందమున
      ఆరయ నిష్పలమగు మరి యన్యులఁ జేరినను

చ.3:కూరిమి మాతిరువేంకటగిరి గురుశ్రీ పాదములు
      చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన