తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 30

వికీసోర్స్ నుండి

రేకు: 0030-01 ఆహిరి సం: 01-182 వైరాగ్య చింత


పల్లవి:

 చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి-
పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు


చ. 1:

 చెలఁగి నే మునుసేసినచేఁత లుండఁగా
మలసి నేఁ దిరుగుతిమ్మట లుండఁగా
తొలఁగఁదోసి తప్పుడుతోడనే లోహంబు
వెలయ బంగారుగావించినగతిని


చ. 2:

 బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగా
జగడగాండ్లు పగచాటఁగను
జిగిగలచేఁతిముసిఁడికాయయగునన్ను
మొగిఁ గల్పకము ఫలముగఁ జేయవసమా


చ. 3:

 పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగా
మదివికారము నే మరుగఁగానే
వదలకు వేంకటేశవ్వెర నన్ను నిదే నీ -
పదపంకజములు చేర్పఁగ నిది వసమా

రేకు: 0030-02 పాడి సం: 01-183 ఉత్సవ కీర్తనలు


పల్లవి:

 చక్రమా హరి చక్రమా
వక్రమైన దనుజుల వక్కలించవో


చ. 1:

 చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని-
చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీహరి చేతఁ బాయక యీ జగములు
వొట్టుకొని కావగదవో వో చక్రమా


చ. 2:

 పానుకొని దనుజుల బలుకిరీటమణుల
సానలఁ దీరిన వో చక్రమా
నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ-
మూని నిలుపఁగదవో వో చక్రమా


చ. 3:

 వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ
వుఱుట్లు గొనియాడేరో చక్రమా
అఱిముఱిఁ దిరు వేంకటాద్రీశు వీధుల
వొఱవుల మెఱయుదువో వో చక్రమా

రేకు: 0030-03 వరాళి సం: 01-184 వైరాగ్య చింత


పల్లవి:

 వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ


చ. 1:

 చాల నమ్మి యీ సంసారమునకు సోలిసోలి తిరిగేవు
బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు
మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు
మాలెమీఁద పరు వెందాఁకా నీమచ్చిక విడువఁగ లేవు


చ. 2:

 మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు
నానావిధములదుష్కర్మంబులు నానాటికి నాటించేవు
మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు
ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగలేవు


చ. 3:

 పామరివై దుర్వ్యాపారమునకుపలుమారునుఁ బొయ్యేవు
వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు
ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగాలేవు
తామసమతివయి వేంకటనాథునితత్వ మెఱఁగఁగాలేవు

రేకు: 0030-04 శ్రీరాగం సం: 01-185 వైరాగ్యచింత


పలల్లవ:

 ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు-
ప్రాభవం బెడలించి బాధఁ బెట్టించె


చ. 1:

 చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్ల
రప్పించె నెన్నఁడును రానిచోట్లకును
వొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను
తప్పించె కోరికల తిరిగి నలుగడల


చ. 2:

 పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల
కట్టించె సంసారకలితబంధముల
పెట్టించె ఆసలను పెడకొడములఁ దన్ను
తిట్టించె నిజద్రవ్యదీనకుల చేత


చ. 3:

 బెదరించె దేహంబు పెనువేదనలచేత
చెదరించె శాంతంబు చెలఁగి చలమునను
విదళించె భవనములను వేంకటేశ్వరుఁ గొలిచి
పదిలించె నతనికృప పరమసౌఖ్యములు

రేకు: 0030-05 ఖైరవి సం; 01-186 వైరాగ్య చింత


పల్లవి:ఎంతపాపకర్మవాయ యెంతవింతచింతలాయ
       వింతవారితోడిపాందు వేసటాయ దైవమా

చ.1:చూడఁజూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయ
      వీడుఁబట్టు ఆలుచాయ వేడుక లుడివోయను
      జోడుజోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయ
      యేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా

చ.2:నీరులేనియేఱు దాఁటనేర దెంతేలోఁతాయ
      మేరవెళ్ల నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయను
      తోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయ
      కోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము

చ.3:తల్లీ దండ్రి దాత గురువు తానెయైననాచారి
      వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
      కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
      మొల్ల మాయ నామనసు మోదమాయ దైవమా

రేకు: 0030-06 రామక్రియ సం: 01-187 వైరాగ్య చింత


పల్లవి:కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు
       దడవీనా నోరు తగినయెంతయును

చ.1:చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ది
      గంప గమ్మక తన్ను గాచీనా
      పంపుడుదయ్యమై బాధఁ బెట్టెడుయాస
      కొంపలోన నుండనీఁగోరీనా

చ.2:శ్రీవేంకటగిరి శ్రీనాథుఁ డిందరిఁ
      గావఁబ్రొవఁగ నున్నఘనుఁడు
      దేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయిన-
      త్రోవ లెన్నిన మేలు దొరకీనా